తెలంగాణ గ్రామాల్లో నెలరోజులుగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర అటవీ ప్రాంతాల నుంచి వలస వచ్చిన మగ పులి సిద్ధిపేట పరిసరాల్లో సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి.గత నెల రోజులుగా తెలంగాణ అటవీ గ్రామాల్లో సంచరిస్తున్న పులిని రక్షించడంతోపాటు మానవ- పులి సంఘర్షణను నివారించేందుకు అటవీశాఖ 50మంది ప్రత్యేక నిపుణులైన అధికార బృందాలను రంగంలోకి దించింది. మహారాష్ట్రలోని పూణే నుంచి వచ్చిన టైగర్ నిపుణులు, ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన టైగర్ ట్రాకర్లు, జూపార్కు నుంచి వచ్చిన పశువైద్యాధికారులు, హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్తలు, అటవీశాఖ అధికారులు 50 మందితో కూడిన ప్రత్యేకబృందాన్ని పులి కదలికలున్న ప్రాంతాల్లో బస చేసి పులికి రక్షణగా నిలిచారు.
తెలంగాణలో అలజడి సృష్టిస్తున్న పులి బంధనానికి గ్రీన్ సిగ్నల్
గత నెలరోజులకు పైగా తెలంగాణ జిల్లాల్లో సంచరిస్తూ గ్రామాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న పులిని సురక్షితంగా బంధించి దట్టమైన అడవిలో వదిలివేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (National Tiger Conservation Authority) అనుమతితో 50 మంది ప్రత్యేక బృందం పులిని బంధించేందుకు రంగంలోకి దిగింది. ట్రాంక్విలైజ్ చేసి బంధించిన అనంతరం పులికి రేడియో కాలర్ అమర్చి దాని సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేలా వ్యూహాన్ని అధికారులు అమలు చేయనున్నారు. పులి సంచరిస్తున్న అటవీ ప్రాంతం చుట్టూ అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు. అలజడి సృష్టిస్తున్న పులిని ఎలాగైనా బంధించి, దాన్ని సురక్షితంగా దట్టమైన అడవిలో వదిలి వేయాలని అటవీశాఖ అధికారులతోపాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు నిర్ణయించారు.
సిద్ధిపేట అటవీ ప్రాంతంలో చెరువు గట్టున పులి ( అటవీశాఖ కెమెరాట్రాప్ చిత్రం)
ఆరెపల్లి కొండల్లో పులి పాగా
సిద్దిపేటలోని బెజ్జంకి,కోహెడ మండలాల్లోని ఆరెపల్లి కొండల్లో పులి పాగా వేసింది.ఈ కొండల్లో గతంలో పశువులను తింటుందని అటవీ అధికారులు నిర్ధారించారు. పులి మహారాష్ట్రకు తిరిగి రావచ్చని అనుమానిస్తూ అధికారుల బృందాలు దాని కదలికను పర్యవేక్షిస్తున్నాయి. అటవీ బృందాలు థర్మల్ డ్రోన్లు, కెమెరా ట్రాక్‌లను ఉపయోగించి పులిని ట్రాక్ చేస్తున్నారు.ప్రజలకూ, పులికీ ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు సిద్ధిపేట, జనగాం, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ప్రత్యేక పట్రోలింగ్ బృందాలను అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ, పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి.
సిద్ధిపేట అటవీ ప్రాంతంలో పులి పాద ముద్ర (అటవీశాఖ చిత్రం)
పులి కదలికలివి...
ఫిబ్రవరి 15వతేదీ : సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠలాపూర్, మచాపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి కనిపించింది. విఠలాపూర్ గ్రామ శివార్లలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారుల బృందం గుర్తించింది.పులి సంచారం నేపథ్యంలో రిజర్వు ఫారెస్ట్ సమీపంలోని పొలాలకు రైతులు తెల్లవారుజామున, రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.
ఫిబ్రవరి 14 వతేదీ : చౌడారం గ్రామ రిజర్వు ఫారెస్టులో పులి సంచరించింది. రెండు వైపులా చెరువులు,1200 హెక్టార్లలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఈ అభయారణ్యం పులి ఆవాసానికి అనువుగా, సురక్షితంగా ఉంది. శనివారం డ్రోన్ల సహాయంతో పులి కదలికలను గుర్తించేందుకు అటవీబృందం యత్నించింది. పులిని పట్టుకునేందుకు పులి ఉన్న ప్రాంతం నలువైపులా ఇనుపజాలీలతో కూడిన బోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఘన్ పూర్, ఆరేపల్లి గ్రామాల్లో పులి పశువులను చంపింది.
ఎలా బంధిస్తారంటే...
పులికి మత్తుమందు ఇంజక్షన్లతో ట్రాంక్విలైజ్ చేసి దాన్ని బంధించి జూపార్కుకు తరలించి దాన్ని వెటర్నరీ వైద్యాధికారుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించారు. పులి ఆరోగ్యాన్ని పరీక్షించాక అది బాగుంటే దానికి రేడియో కాలర్ అమర్చాలని నిర్ణయించారు. దారి తప్పి వచ్చి గ్రామాల్లో రోజుకో పశువుపై దాడి చేస్తూ కల్లోలం సృష్టిస్తున్న పులిని బంధించి రేడియో కాలర్ అమర్చి మళ్లీ దాన్ని అడవిలో వదిలివేయాలని నిర్ణయించారు. దీని కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేడియో కాలర్ అమరిస్తే పులి కదలికలను మానిటరింగ్ చేయవచ్చని సిద్ధిపేట డీఎఫ్ఓ ఐ పద్మజారాణి చెప్పారు.దీంతో బోన్లు ఏర్పాటు చేయడంతోపాటు పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో మకాం వేసింది.
సిద్ధిపేట విఠలాపూర్ శివార్లలో పులి పాదముద్ర (అటవీశాఖ చిత్రం)
పులి మెడలో రేడియో కాలర్ ఏర్పాటు చేస్తారు. ఇటీవల మహారాష్ట్రలోని ఓ పులికి రేడియో కాలర్ ను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రేడియో కాలర్ ద్వారా పులి సంచారంపై ఎప్పటికప్పుడు వైర్ లెస్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పులికి రేడియో కాలర్ ను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారుల అనుమతితోనే ఏర్పాటు చేస్తామని వైల్డ్ లైఫ్ అధికారి ఎ శంకరన్ చెప్పారు.
మహారాష్ట్రలో ఇటీవల ఓ పులికి అమర్చిన రేడియో కాలర్ (మహారాష్ట్ర అటవీశాఖ సౌజన్యంతో)
50 మంది ప్రత్యేక బృందాల మోహరింపు
మహారాష్ట్ర నుంచి ఆవాసం, టెరిటరీని, ఆడ తోడును వెతుక్కుంటూ తెలంగాణ జిల్లాల్లోకి వచ్చిన మగ పులిని సురక్షితంగా కాపాడేందుకు హైదరాబాద్, వరంగల్, పూణే, ఆదిలాబాద్ జిల్లాల అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాలకు చెందిన 50 మంది శ్రమిస్తున్నారు. రోజుకో ప్రాంతంలో సంచరిస్తున్న పులి శుక్రవారం సాయంత్రం బెజ్జంకి మండలంలోని అటవీ గ్రామాల్లోకి వచ్చింది. పులి సంచారం నేపథ్యంలో అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.
పులిని బంధించే యత్నం విఫలం
సిద్ధిపేట అడవుల్లో సంచరిస్తున్న పులి అక్కడ మేతకు వచ్చిన దూడను చంపింది. దీంతో పులి చంపిన దూడ వద్ద పూణే నుంచి వచ్చిన నిపుణుల బృందం ట్రాంక్విలైజర్ ఇంజక్షన్లతో మొహరించారు. పులి దూడను చంపిన తర్వాత రెండో రోజు దాని మాంసాన్ని తినేందుకు వస్తుందని, అప్పుడు దానికి మత్తు మందు ఇచ్చి బంధించాలని ఎనిమల్ ట్రాకర్లు సిద్ధమయ్యారు. అయితే పులి చంపిన దూడ వద్దకు రాలేదని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధి తేజ్ వైష్ణవ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులిని బంధించే యత్నాలు విఫలమయ్యాయని ఆయన తెలిపారు.
గ్రామాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న ఈ పులి సంచారం ఒక వైపు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా, మరో వైపు వన్యప్రాణి సంరక్షణలో అధికారుల నిబద్ధతను పరీక్షిస్తోంది.నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకత్వంలో అటవీశాఖ చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైతే, అది మానవ–పులి సంఘర్షణను తగ్గించే కీలక మైలురాయిగా నిలవనుంది. పులికి హాని కలగకుండా, ప్రజలకు ప్రమాదం లేకుండా సురక్షిత పరిష్కారం దొరికే వరకు ప్రత్యేక బృందాల నిఘా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే...పులిని సురక్షితంగా బంధించి అడవిలోకి తిరిగి పంపే ఆ కీలక క్షణంపై.