వనం వదిలి జనంలోకి వస్తున్న పులులు, చిరుతలు
x
పులి సంచారంతో వణుకుతున్న తెలంగాణ అటవీ గ్రామాలు

వనం వదిలి జనంలోకి వస్తున్న పులులు, చిరుతలు

కరీంనగర్ నుంచి మెదక్ వరకు పులుల, చిరుతల పాదముద్రలు...


తెలంగాణ ఆటవీ గ్రామాల్లో పులులు, చిరుతల సంచారంతో ప్రజల జీవితం ఇప్పుడు అనిశ్చితిలో పడింది.కొంతకాలంగా పలు జిల్లాల్లో సంచరించిన ఒక ఒంటరి పులి పశువులపై దాడులు చేసి 20కి పైగా పశువుల్ని చంపిందని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.పోలీస్, అటవీశాఖ అధికారులు అప్రమత్తత ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు పులిని బంధించ లేకపోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది.

తెలంగాణలోని పలు అటవీ గ్రామాలు పులులు, చిరుతల సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో రెండు పులులు కనిపించాయి.మరో వైపు మెదక్ జిల్లాలో ఓ చిరుతపులి దర్శనమిచ్చింది. గత నెల రోజులుగా మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి నాలుగు జిల్లాల్లో 20కి పైగా పశువులను చంపి, గ్రామాల్లో సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు, వన్యప్రాణి విభాగం అధికారులు దీన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టలేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించి గ్రామస్థుల భయాన్ని పొగొట్టారు. కానీ తెలంగాణలో నెలరోజులుగా పులి పలు గ్రామాల్లో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజలకూ, పులికీ ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు సిద్ధిపేట, జనగాం, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ప్రత్యేక పట్రోలింగ్ బృందాలను అటవీశాఖ ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ, పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి కానీ దీన్ని మాత్రం బంధించలేక పోయారు. దీంతో పులి గత నెల రోజులుగా నాలుగు గ్రామాల ప్రజలను అల్లాడిస్తుంది.

ఇదీ పులులు, చిరుతల సంచారం

ఫిబ్రవరి 10 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామ శివార్లలో పులి సంచరించింది. పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేసి, పులి కదలికలపై ఫారెస్ట్ వాచర్లను నియమించారు. గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.కోసిని, వేంపల్లి గ్రామ పరిసర చెరువు, పొలాల్లో పులి సంచరించిన పాదముద్రలు కనిపించాయి.
10.02.2026 :
గత నెలరోజుల పాటు జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో సంచరించిన పులి తిరుగు ప్రయాణంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోకి వచ్చింది. నాలుగు జిల్లాల్లో సంచరించిన పులి తిరుగు ప్రయాణంలో భాగంగా మళ్లీ కవాల్ పులుల అభయారణ్యం వైపు కదులుతుందని అధికారులు గుర్తించారు. కరీంనగర్ జిల్లా తంగళ్లపల్లి మండలం సింగరాయిగుట్ట వద్ద సంచరిస్తున్న పులి అటవీశాఖ ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరా ట్రాప్ కు చిక్కింది.దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులిని బంధించడానికి బోను ఏర్పాటు చేశారు. శనిగరం, కోహెడ, ఆరెపల్లి ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ అధికారులు చాటింపు వేయించారు.
ఫిబ్రవరి 8 : సిద్ధిపేట జిల్లా ఆరెపల్లి గ్రామ సమీపంలో పులి కదలికలు కనిపించాయి. సిద్ధిపేట జిల్లాలో ఒకే రోజు 8 పశువులపై దాడి చేసి చంపింది. దీంతో పశువులను సురక్షితమైన కొట్టాల్లో ఉంచాలని అధికారులు సూచించారు.

శనిగరం అడవుల్లో పులి

కరీంనగర్ జిల్లా శనిగరం అడవుల్లో పులి మకాం వేసిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. శనిగరం అటవీ ప్రాంతంలో జలాశయంతోపాటు ఎలుగుబంట్లు, కోతులు, జింకలు, అడవి పందులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పులి ఈ అడవిలోనే ఉందని సమాచారం. పులి జనవాసాల్లోకి వస్తే దాన్ని ట్రాంక్విలైజర్లతో మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి బంధించాలని నిర్ణయించినట్లు హుస్నాబాద్ ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ సిద్ధార్థరెడ్డి చెప్పారు. పులి శనిగరం అడవుల్లో మకాం వేయడంతో తాము వింజయపల్లి, తీగల కుంటపల్లి, శనిగరం, సికండ్లాపూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

మెదక్ జిల్లాలో చిరుత సంచారం

ఫిబ్రవరి 10 : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అకోలా - హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఐబీ చౌరస్తా సమీపంలో చిరుతపులి సంచరిస్తుందని స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లాదుర్గం తహసీల్దారు మల్లయ్య, ఎస్ఐ శంకర్, ఏ ఎస్ఐ గాలయ్యలు అప్రమత్తమయ్యారు. అల్లాదుర్గం మండలంలోని గొల్లకుంట తండా, గాండ్లబాయి తండా, మాందాపూర్, చిల్వేరు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

మహారాష్ట్ర పులుల వలస

గత ఏడాది అక్టోబరు నెలలో మహారాష్ట్రలోని తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్టుల నుంచి మూడు పులులు ఆవాసాలు, టెరిటరీని వెతుక్కుంటూ తెలంగాణలోని కవాల్ అభయారణ్యానికి వలస వచ్చాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. కవాల అటవీప్రాంతంలో పులులకు కావాల్సిన ఆహారం జింకలు, అడవి పందులు అధికంగా ఉండటంతో పాటు అడవుల విస్తీర్ణం, ఆవాసాలు, నీటి వనరులు ఎక్కువగా ఉన్నాయి.దీంతో పులులు మహారాష్ట్ర నుంచి వలస వస్తున్నాయి.

అటవీశాఖ అధికారుల ఉన్నతస్థాయి సమావేశాలు

తెలంగాణ రాష్ట్రంలో పులులు, చిరుత పులుల సంచారం పెరగడంతో అప్రమత్తమైన అటవీశాఖ వైల్డ్ లైఫ్ విభాగం అధికారులు వీటి కదిలికలపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ముఖ్య అటవీ సంరక్షణాధికారిణి డాక్టర్ సి సువర్ణ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చీఫ్ వార్డెన్ వినయ్ కుమార్, వైల్డ్ లైఫ్ విభాగం అధికారి ఆంజనేయులు పులులు, చిరుతల సంచారంపై టైగర్ సెల్ అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. పలు జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో పులులు, చిరుతల సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, పూణేకు చెందిన రెస్క్యూ టీం సభ్యులు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్లతో కలిసి పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. కానీ గ్రామాల్లో తిరుగుతూ పశువులను చంపుతున్న పులిని బంధించాలని అటవీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Read More
Next Story