ఉదయం 11 వరకు: పోల్ సరళిపై కేసీఆర్ ఆసక్తికర విశ్లేషణ..
x

ఉదయం 11 వరకు: పోల్ సరళిపై కేసీఆర్ ఆసక్తికర విశ్లేషణ..

దేశ వ్యాపంగా నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బెంగాల్ లో మాత్రం అధికార, విపక్ష పార్టీల మధ్య ఉద్రిక్తతలు, వాదోపవాదాలు జరిగాయి. అయితే మాజీ సీఎం కేసీఆర్..


దేశంలో నాలుగోదశ పోలింగ్ కొనసాగుతోంది. పది రాష్ట్రాల్లో 96 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఉదయం 11 గంటల వరకు ప్రకటించిన సమాచారం ప్రకారం 24. 80 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూలైన్లు దేశ వ్యాప్తంగా దర్శనమిస్తోంది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే తెలంగాణలో 24.31, ఆంధ్రప్రదేశ్ 23.31 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయా, సిని ప్రముఖులు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకూ అత్యధికంగా పోలింగ్ నమోదైంది. అయితే అక్కడ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి.

దేశంలో ప్రాంతీయ పార్టీలదే అధికారం: కేసీఆర్
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఇటూ ఎన్డీఏ, అటూ ఇండి బ్లాక్ అధికారంలోకి రావని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీజేపీలో 75 ఏళ్లకే రిటైర్ మెంట్ అనే నిర్ణయాన్ని అమలు చేస్తారని, ఎన్నికల తరువాత నరేంద్రమోదీ దిగిపోతారని అన్నారు. ఓటింగ్ సరళిని చూస్తుంటే దేశవ్యాప్తంగా 65 నుంచి 70 శాతం మధ్య ఉండే అవకాశం కనిపిస్తోందని, దీనిని బట్టి కచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు ఎన్డీఏలో లేదా ఇండి బ్లాక్ లో ఎన్నికల తరువాత చేరతారా అనే ప్రశ్నకు గులాబీ దళపతి ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటర్ పై వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడి
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, వాదోపవాదాలు జరిగాయి. గుంటూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి శివకుమార్ ఓటర్ పై చేయిచేసుకున్నారు. సాధారణ ఓటర్ తనను క్యూలో రమ్మని చెప్పడంతో ఆగ్రహించిన అభ్యర్థి శివకుమార్ తన పై చేయిచేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన సదరు యువ ఓటర్ అభ్యర్థి చెంప చెల్లుమనిపించాడు.
రాష్ట్రాల వారీగా చూసుకుంటే..
ఆంధ్రప్రదేశ్: 23. 10%
బిహార్ : 22.54%
జమ్మూకాశ్మీర్: 14.94 %
జార్ఖండ్ : 27.40 %
మధ్యప్రదేశ్ : 17. 51 %
ఒడిషా : 23.28 %
తెలంగాణ : 24.31 %
ఉత్తర్ ప్రదేశ్: 27.12 %
ప బెంగాల్ : 32.78 %
ఇప్పటి వరకూ జరిగిన మూడు దశ పోలింగ్ లలో 283 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. నాలుగో దశ ఎన్నికల కోసం 19 లక్షల అధికారులను ఈసీ నియమించింది. 1.92 లక్షల పోలింగ్ బూతులు ఏర్పాటు చేసింది. ఈదశలో 17.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు.ఈ దశలో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ దశలో తెలంగాణలోని 17 సీట్లకు, ఆంధ్రప్రదేశ్ లోని 25 సీట్లు, ఉత్తర ప్రదేశ్ లోని 13 సీట్లకు, బిహార్ లో 5, జార్ఖండ్ లో నాలుగు, మధ్యప్రదేశ్ లో ఎనిమిది, మహారాష్ట్రలో 11, ఒడిషా లో నాలుగు, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది, జమ్ముకాశ్మీర్ లో ఒక్క స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిషాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Read More
Next Story