
జనవరి 24 నుంచి 26 దాక తిరుమల విఐపి దర్శనాలు బంద్
అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు
జనవరి 25న తిరుమలలో జరగనున్న రథసప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు అవుతున్నాయి. ఉత్సవాలకు సంబంధించి, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలపే టిటిడి రద్దు చేసింది.
ఇదే విధంగా ఎన్.ఆర్.ఐల, చంటి బిడ్డల తల్లిదండ్రుల, సీనియర్ సిటిజన్ల, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నారు. తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు జారీ రద్దు చేస్తారు. ఇలాగే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో రథ సప్తమి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఈ నిర్ణయాలను తీసుకున్నారు.
టీటీడీ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ రోజు అధికారులకు సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
సమగ్ర బందోబస్తు పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.

