
తెలంగాణ ఆలయాల్లో ‘తిరుమల కోడ్’
ఆలయ పరిసరాల్లో రాజకీయాలకు నో చెప్పే నిబంధనలు, బాసర అభివృద్ధికి రూ.225 కోట్ల ప్రణాళికపై సమీక్ష జరిగింది.
తెలంగాణలోని ఆలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పలు కీలక నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ కార్యకలాపాలకు ఆలయాల్లో స్థానం లేకుండా నిబంధనలు ఉండాలని వెల్లడించారు. బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగానే తెలంగాణ ఆలయాల్లో అమలు చేయాలని పలు నియమనిబంధనల ఆయన కీలకస సూచనలు చేశారు. పర్యావరణ హితం కోసం ఆలయాల పరిసరాల్లో ఈవీ వాహనాలకు మాత్రమే ఎంట్రీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా శ్రీజ్ఞాన సరస్వతీ దేవస్థాన అభివృద్ధికి సుమారు రూ. 225 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ప్రణాళికను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు.
సంప్రదాయాలు, ఆగమ శాస్త్రాలను పాటిస్తూ అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. ఎక్కడా భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాలమైన రహదారులు నిర్మించాలన్నారు. ఆలయ పరిసరాలు పచ్చదనంతో నిండేలా మొక్కలు నాటాలని సూచించారు. ఆలయం దగ్గర ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పుష్కరాలు వంటి సందర్భాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
వాహనాల నియంత్రణపై కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆలయ ప్రాంగణానికి బయటే అన్ని వాహనాలు నిలిపివేయాలని, లోపలికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాల్లో సోలార్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకూడదని అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
పనుల నాణ్యత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా ఆలయాల అభివృద్ధి, నిర్వహణలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

