తిరుమలలో ‘శ్రీవారి ముడుపు పత్రం’పై నిర్ణయం
x
Tirumala Temple

తిరుమలలో ‘శ్రీవారి ముడుపు పత్రం’పై నిర్ణయం

హుండీలో వేసే కానుకుల పద్దతిని తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు మార్చేయబోతున్నది


తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు హుండీలో సమర్పించే కానుకుల పద్దతి మారబోతోంది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు తిరిగి వచ్చేటపుడు హుండీలో కానుకులు సమర్పించుకోవటం శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితి. హుండీలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులు డబ్బులను కానుకలుగా వేస్తుంటారు. హుండీలో వేసే కానుకుల పద్దతినే తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు మార్చేయబోతున్నది. ఈనెల 28వ తేదీన జరగబోయే ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. చేతిలో డబ్బులున్న భక్తులు ఇప్పటిలాగే హుండీలో సమర్పించవచ్చు.

శ్రీవారి దర్శనం తర్వాత హుండీలో సమర్పించుకునేందుకు సరిపడా డబ్బులు లేవని భక్తులు దిగులుపడాల్సిన అవసరం ఉండదు. చేతిలో డబ్బులు లేకపోయినా భక్తులు హుండీలో కానుకలు వేసేట్లుగా బోర్డు కొత్త పద్దతిని తీసుకుని రాబోతోంది. ఆ కొత్తపద్దతే ‘శ్రీవారి ముడుపు పత్రం’. శ్రీవారి దర్శనార్ధం వచ్చేభక్తులు తమస్ధోమతకు తగ్గట్లుగా హుండీలో కానుకలను సమర్పించుకోవటం అందరికీ తెలిసిందే. వీటినే ‘హుండీ కానుకలు’ అని అంటారు.

ప్రతిఏటా శ్రీవారిని సుమారు 3 కోట్లమంది దర్శించుకుంటున్నారు. తర్వాత హుండీలో కానుకలు సమర్పించుకుని దేవాలయం బయటకు వచ్చేస్తారు. రోజువారి లెక్కించే శ్రీవారి ఆదాయంలో హుండీ కానుకలు కూడా ముఖ్యమైనదే. 2025లో హుండీ కానుకల ద్వారానే శ్రీవారికి రు. 1383 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా పుణ్యమాని నగదు రహిత లావాదేవీలు పెరిగిపోతున్న విషయం అందరికీ అనుభవమే. ఇందులో భాగంగానే చాలామంది యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.

లక్ష రూపాయల వరకు ముడుపు పత్రం

పై మూడు విధానాల కారణంగా శ్రీవారిహుండీ కానుకల్లో నగదు వేయటం తగ్గిపోతోంది. దర్శనం తర్వాత హుండీలో కానుకలు సమర్పించుకోవాలంటే తమ దగ్గర క్యాష్ ఉండటంలేదని భక్తులు యాజమాన్యంతో తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నట్లు తెలిసింది. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టమని కూడా యాజమాన్యాన్ని భక్తులు కోరుతున్నారని అధికారవర్గాల సమాచారం. వస్తున్న ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకునే తిరుపతితో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ‘ముడుపు కౌంటర్లు’ ఏర్పాటు చేసే విషయాన్ని టీటీడీ యాజమాన్యం ఆలోచించింది. ఈ కౌంటర్లలో భక్తులు రు. 100 నుండి లక్ష రూపాయల వరకు నగదు లేదా యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. భక్తులు చేసే చెల్లింపులకు తగ్గ శ్రీవారి ముడుపు పత్రాన్ని టీటీడీ అధికారులు జారీచేస్తారు.

కౌంటర్లలో అందుకున్న శ్రీవారి ముడుపు పత్రాలను తీసుకుని భక్తులు దర్శనం తర్వాత హుండీలో సమర్పించవచ్చు. ఈ విషయమై ఇప్పటికే అధికారుల స్ధాయిలో నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవటం లాంఛనమే అని తెలుస్తోంది.

Read More
Next Story