
తిరుమల తుంబురు తీర్థ ముక్కోటి తేదీలు ఖరారు
తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి సందర్భంగా భక్తుల కోసం భద్రత, రవాణా, సౌకర్యాలపై టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి ఏర్పాట్లు వేగంగా పూర్తవుతున్నాయి. మార్చి 31 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పుణ్య కార్యక్రమానికి సంబంధించి తాజా సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. భక్తుల సౌకర్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి నిర్వహించారు. తుంబురు తీర్థ ముక్కోటి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
భక్తులకు మార్చి 31 ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని నిర్ణయించారు. ఈ సమయంలోనే భక్తులు తీర్థానికి వెళ్లి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 100 మంది శ్రీవారి సేవకులు ఈ సేవల్లో పాల్గొంటారు. అదనంగా ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు.
తీర్థానికి చేరేందుకు ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో కొన్ని పరిమితులు విధించారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండె, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, అలాగే స్థూలకాయం ఉన్న భక్తులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు వంటి వస్తువులు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మార్గంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిబంధనలు అమలు చేయనున్నారు.
పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు పోలీసు శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. మార్గమధ్యంలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. ఈ ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ సూచించింది.

