
ఫోరెన్సిక్ ల్యాబ్‌ను కావాలనే కాల్చేశారా?
ఏదైనా కేసుకు సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రమాదాన్ని కావాలనే సృష్టించారా?
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం జరగటం పలు అనుమానాలకు దారితీస్తోంది. శనివారం మధ్యాహ్నం ల్యాబొరేటరీ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఎలా అంటుకున్నాయో ఎవరికీ స్పష్టత లేదు. మంటలు వ్యాపించగానే సిబ్బంది అందరూ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ ప్రమాదంలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ మొదటి అంతస్తు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇక్కడే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కారణం—మొదటి అంతస్తులోనే అత్యంత కీలకమైన ఫైల్స్ నిల్వ ఉండటం. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్, టెలిఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో సాక్ష్యాలు, ట్యాపింగ్‌కు సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు ఇక్కడే ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్‌కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఫైల్స్, ఆడియో, వీడియో సాక్ష్యాలు కూడా మొదటి అంతస్తులోనే ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలో జరిగే దాదాపు అన్ని కేసులకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణకు పోలీసులు ఈ ల్యాబ్‌పైనే ఆధారపడతారు. డీఎన్ఏ పరీక్షలు, వేలిముద్రల విశ్లేషణ, డేటా అనాలిసిస్, కీలక కేసులకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌ల పరిశీలన, వాటిలోని డేటాను వెలికి తీయడం వంటి కీలక పనులు ఇక్కడే జరుగుతాయి. అనేక సంచలనాత్మక కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఈ ల్యాబ్‌లో ఉంటాయి. అలాంటి ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరగటం, దానికి కారణాలు ఇంకా తెలియకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఏదైనా కేసుకు సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రమాదాన్ని కావాలనే సృష్టించారా? అనే చర్చ మొదలైంది. అదే నిజమైతే ఇది ఎవరి పని? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో ల్యాబొరేటరీ భద్రతపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే మంటలను అదుపు చేసే ఏర్పాట్లు అక్కడ ఎందుకు పనిచేయలేదు? లేకపోతే ఆ లోపానికి కారణమేంటి? అనే అంశం కూడా కీలక చర్చగా మారింది.
భద్రతపై అనుమానాలు
ఈ ప్రమాదంతో నాంపల్లిలోని ల్యాబొరేటరీలో కీలక కేసులకు సంబంధించిన సాక్ష్యాల భద్రతపై అభద్రతాభావం వ్యక్తమవుతోంది. ప్రమాదాలు సహజమే అయినా, వాటిని వెంటనే అదుపు చేసే మెకానిజం అక్కడ ఎందుకు లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది నిర్లక్ష్యమా? లేక అలసత్వమా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు, ఓటుకు నోటు వంటి హైప్రొఫైల్ కేసుల ఫైల్స్ అక్కడే ఉన్నప్పుడు భద్రతపై ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టలేదన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
బ్యాకప్ పరిస్థితి ఏంటి?
ఈ ల్యాబ్‌లో అనేక హైప్రొఫైల్ కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాలు, డేటా అగ్నికి ఆహుతైన తొలి అంతస్తులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ సాక్ష్యాలు ఎంతవరకు మిగిలాయో ఎవరికీ స్పష్టత లేదు. దీంతో బ్యాకప్ అంశం తెరపైకి వచ్చింది. హైప్రొఫైల్ కేసులకు సంబంధించిన డేటా ఒకేచోటే నిల్వ ఉంచారా? మరెక్కడైనా బ్యాకప్ తీసుకున్నారా? అనే ప్రశ్నలు కీలకంగా మారాయి. ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరించే అధికారులు ఈ డేటాకు కూడా బ్యాకప్ తీసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు లభిస్తాయో చూడాలి.

