48 మంది మావోయిస్టులతో లొంగిపోయిన బర్సేదేవా, భారీ ఎన్ కౌంటర్
x
Maoists surrendered before Telangana DGP B Sivadhar Reddy

48 మంది మావోయిస్టులతో లొంగిపోయిన బర్సేదేవా, భారీ ఎన్ కౌంటర్

దేవా లొంగుబాటుతో ఒకపుడు 41మందితో ఎంతో బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య ఇపుడు నాలుగుకి చేరింది


మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ కార్యదర్శి బర్సేదేవాతో పాటు మరో 48 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. శనివారం మధ్యాహ్నం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో దేవాతో పాటు మావోయిస్టులు ఆయుధాలను అప్పగించేశారు. వీరిలో దేవాతో పాటు తెలంగాణ ఏరియాలో కీలక నేత కంకణాల రాజిరెడ్డి కూడా ఉన్నారు. దేవా లొంగుబాటుతో ఒకపుడు 41మందితో ఎంతో బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య ఇపుడు నాలుగుకి చేరింది.

లొంగుబాటు సందర్భంగా డీజీపీ మాట్లాడుతు తెలంగాణలో ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడు మాత్రమే మిగిలినట్లు చెప్పారు. ఆయుధాలతో సహా లొంగిపోవటంతో బర్సేదేవా కీలకంగా వ్యవహరించినట్లు డీజీపీ వివరించారు. పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోవటంతో పాటు ఉన్న కొద్దిమందిని కూడా అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నట్లు తెలిపారు. ఇపుడు లొంగిపోయిన వారిలో కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నట్లు డీజీపీ చెప్పారు.

పీజీఎల్ఏ కార్యదర్శిగా మాడ్వీ హిడ్మా తర్వాత అతంటి కీలకంగా ఉన్నది దేవా మాత్రమే. రెండునెలల క్రితం హిడ్మా ఎన్ కౌంటర్లో చనిపోయిన తర్వాత పార్టీ నాయకత్వం పీజీఎల్ఏ బాధ్యతలు దేవాకే అప్పగించింది. పార్టీకి సంబంధించిన ఆయుధాల సమీకరణ, సరఫరా మొత్తాన్ని దేవానే చూసుకుంటున్నారు. హిడ్మా, దేవా ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన వారే కాకుండా వరసకు సోదరులు అవుతారు.

భారీ ఎన్ కౌంటర్

ఒకవైపు దేవా తన అనుచరులతో లొంగిపోయిన శనివారమే మరోవైపు ఛత్తీస్ ఘడ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా అడవుల్లో ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఏరియా లీడర్ మంగ్డూ కూడా ఎన్ కౌంటర్లో చనిపోయాడు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్ఫీఎఫ్ దళాలు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏకే 47 తుపాకులు, ఇన్సాస్ రైఫిల్స్, బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Read More
Next Story