
టాప్ మావోయిస్టు గణేశ్ ఒదిశాలో ‘ఎన్ కౌంటర్’
మావోయిస్టు పార్టీకి మరొక దెబ్బ
చత్తీష్ గడ్ సరిహద్దులోని ఒదిశా కందమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే హతమయ్యాడు. ఆయన మీద రు. 1.10 కోట్ల రివార్డు ఉంది. 43 సంవత్సరాలుగా గణేశ్ అండర్ గ్రౌండ్ జీవితంలో ఉన్నాడు. ఆయన వయసు 69 సంవత్సరాలు. తెలంగాణ నల్గొండ జిల్లాకు చెందిన గణేశ్ ఇపుడు మావోయిస్టు ఒదిశా ఇన్ చార్జ్ గా ఉంటున్నారు. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో గణేశ్ తో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. అందులో మహిళలు కూడా ఉన్నారు.
గణేశ్ కు అనేక దాడులతో సంబంధం ఉందని సెక్యూరిటీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2013లో చత్తీష్ గడ్ సుక్మా జిల్లా జీరాం ఘాటిలో జరిగిన దాడికి ఆయన బాధ్యుడని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వాహనాల మీద ఈ దాడి జరిగింది. ఇందులో 27 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరొక 34 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో గణేశ్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జాబితాలో చేరిపోయాడు.
గణేశ్ కదిలకల గురించి సరెండర్ అయిన కొందరు మావోయిస్టుల నుంచి పోలీసులు సమాచారం సేకరించి ఈ దాడికి పూనుకున్నారు. దాడిలో మరణించిన వారికి సంబంధించిన ఇద్దరు మహిళల, ఇద్దరుపురుషలు మృతదేహాలను ఆ ప్రాంతంలో కనుగొన్నట్లు కందమాల్ ఎస్ పి హారీష్ తెలిపారు.
మరొక వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఎన్కౌంటర్ ను ప్రశంసించారు. నక్సల్ రహిత భారతదేశం ఏర్పాటులో ఇది మరొక ముందడుగు అన్నారు. గణేశ్ ఉయికే హతం కావడంతో ఒదిశా మావోయిస్టు నిర్మూలన గడప చేరిందని ఎక్స్ లో రాశారు.
A significant milestone towards Naxal-free Bharat.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) December 25, 2025
In a major operation in Kandhmal, Odisha, 6 Naxalites, including Central Committee Member Ganesh Uike, have been neutralized so far.
With this major breakthrough, Odisha stands at the threshold of becoming completely free from…
గణేశ్ ది తెలంగాణనే
పాకా హనుమంతు తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన వాడు. బిఎస్ సి చదువుతూ విప్లవరాజకీయాలవైపు ఆకర్షితుడయ్యాడు.1982 నుంచి అజ్ఞాతవాసంలో ఉంటున్నాడు. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. రూపా, రాజేశ్ తివారి,చాము, చామ్రు,సోముడు ఇలా ఎన్నో మారుపేర్లతో ఆయన పని చేసేవాడు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉంటున్నారు. ఇటీవలే ప్రభుత్వం ఆయన మీద రు.1.10 కోట్ల రివార్డు ప్రకటించింది.
ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్, రెండు ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు మొదలుపెట్టారు.

