మొత్తం ఎలక్టోరల్ బాండ్లు 22,127
x

మొత్తం ఎలక్టోరల్ బాండ్లు 22,127

వివిధ రాజకీయ పార్టీలు ఏప్రిల్ 1, 2019 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్యకాలంలో మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయని ఎస్ బీఐ తెలిపింది.


వివిధ రాజకీయ పార్టీలు ఏప్రిల్ 1, 2019 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్యకాలంలో మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయని, వాటిలో 22,030 బాండ్లను రీడీమ్ చేసుకున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సుప్రీంకోర్టుకు తెలిపింది. బుధవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ఎస్బీఐ బయటపెట్టింది. కోర్టు ఆదేశాల మేరకు..మార్చి 12 న పని గంటలు ముగిసేలోపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ (EC)కి అందుబాటులో ఉంచినట్లు బ్యాంక్ తెలిపింది.

ప్రతి ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదారు పేర్లు, కొనుగోలు చేసిన బాండ్ల డినామినేషన్‌తో సహా కోరిన అన్ని వివరాలను అందించినట్లు SBI తెలిపింది.

ఎస్‌బిఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎలక్టోరల్ బాండ్‌లను ఎన్‌క్యాష్‌మెంట్ చేసిన తేదీ, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల పేర్లు, బాండ్ల డినామినేషన్‌ల వంటి వివరాలను కూడా బ్యాంక్ ఎలక్షన్ కమిషన్‌కు అందించిందని చెప్పారు.

బాండ్ల వివరాలు బయటపెట్టేందుకు గడువు పొడిగింపు కోరుతూ ఎస్‌బిఐ చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. మార్చి 12 న పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇటు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వివరాలను మార్చి 15 సాయంత్రం 5 గంటలలోగా ప్రచురించాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.

ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 15న అనామక రాజకీయ నిధులను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ విధానాన్ని "రాజ్యాంగ విరుద్ధం"గా పేర్కొంటూ దాతలు, గ్రహీతల వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించింది.

Read More
Next Story