
గాజులరామారంలో భూ ప్రకంపనలు: ఒక్కసారిగా బయటకు పరుగులు
హైదరాబాద్ గాజులరామారంలో ఉదయం భూమి కంపించింది. భారీ శబ్దంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. గాజులరామారం డివిజన్ పరిధిలో భూ ప్రకంపనలు సంభవించాయి. భారీ శబ్దంతో పాటు భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10 గంటల నుంచి 10:30 మధ్యలో మెట్కాన్‌గూడ, అక్షిత ఎన్‌క్లేవ్, HAL కాలనీ, గాజులరామారం పరిసరాల్లో భూమి కంపించినట్లు స్థానికులు గుర్తించారు. మూడు నుంచి ఐదు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు.
భారీ శబ్దం వినిపించగానే అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లలో తలుపులు, కిటికీలు వణికినట్లు స్థానికులు చెప్పారు. ఇంట్లో సామాన్లు కదలడంతో పాటు పాత్రలు కింద పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. భూకంపమేనని భావించిన కొందరు పిల్లలను వెంట తీసుకుని రోడ్లపైకి వచ్చారు.
అకస్మాత్తుగా ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు హడలెత్తిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. భూ ప్రకంపనల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా స్థానిక పాఠశాలలు అప్రమత్తమయ్యాయి.
ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లకు సెలవులు ప్రకటించి విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పాఠశాలలు 11వ తేదీన తిరిగి ప్రారంభమవుతాయని సమాచారం అందింది. ఈ ఘటన భూకంపం వల్ల జరిగిందా లేదా సమీపంలో ఏదైనా పేలుడు కారణమా అనే అంశంపై అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

