జగన్ రూట్‌లోనే టీఎంసీ.. మూడు వేదికలతో భారీ ర్యాలీ..
x
Source: Twitter

జగన్ రూట్‌లోనే టీఎంసీ.. మూడు వేదికలతో భారీ ర్యాలీ..

కోల్‌కతాలో టీఎంసీ నిర్వహించనున్న ర్యాలీలో మూడు వేదికలను నిర్మిస్తున్నారు. మూడు ర్యాంప్‌ల నిర్మాణం ఎందుకంటే..లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రచారానికి సన్నద్ధం అవుతున్నాయి. భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించడానికి వేదికలు రెడీ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నెవ్వర్ బిఫోర్ అనేలా ర్యాలీని నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. ఇందు కోసం భారీ వేదికను సిద్ధం చేస్తోంది. ఈ వేదిక చాలా ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఈ ర్యాలీ కోసం మూడు వేదికలను నిర్మిస్తున్నారు. ఈ వేదికల ద్వారా నేతలు, అనుచరులతో ఇంటరాక్షన్‌ బాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించే ఈ సభ ద్వారా తమ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది టీఎంసీ.

వేదికల ప్రత్యేకత ఇదే

ఈ సభలో మూడు వేదికలు చాలా ప్రత్యేకంగా ఉండనున్నాయి. ఈ సభలో భాగంగా మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వంటి కీలక నేతలు ప్రసంగించే సమయంలో వారు ఈ ర్యాంప్‌లపై నడుస్తూ నేతలు, కార్యకర్తలకు మరింత చేరువకు వెళ్లడం సాధ్యమవుతోంది. తద్వారా నాయకులు, కార్యకర్తల మధ్య ఇంటరాక్షన్ పెరగడంతో పాటు నేతలు ఇచ్చే ప్రసంగాల ప్రభావం కూడా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడంలో ఇలాంటి సభలు కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

వేదికల వివరాలిలా..

ఈ సభలో ప్రధానంగా మూడు ర్యాంప్‌లు ఉంటాయి. వాటిలో మొదటిది 72 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పుతో భూమి నుంచి 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండో దశ ర్యాంప్ 68 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉంటుంది. వీటిపై పార్టీ నేతలు ఉంటారు. వారు వీటిపై నుంచే ప్రసంగిస్తారు. మూడో ర్యాంప్ 330 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో మైదాన్ మధ్య వరకు ఉంటుంది. ఇది ప్రధాన వేదిక కాగా దీనిపై మమత, అభిషేక్ వంటి కీలక నేతలు ఆసీనులవుతారు. ఈ వేదిక ప్రజల మధ్య నుంచి వెళ్తుంది. దాని వల్ల ఎవరైనా నేతలు ప్రసంగిస్తూ ఈ ర్యాంప్‌పైకి వెళితే ప్రజలకు స్పష్టంగా కనిపిస్తారు. దీంతో పాటుగా రెండో ర్యాంప్ నుంచి మొదటి ర్యాంప్‌ను కలుపుతూ 240 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో భూమికి 6 అడుగుల ఎత్తులో కలుపుతూ మరో వేదిక ఉంటుంది.

అభ్యర్థులను ప్రకటించేది ఇక్కడే

కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదాన్‌లో జరగనున్న భారీ ర్యాలీలో తమ పార్టీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ అభ్యర్థులను మమతా ప్రకటిస్తారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను మమతా ప్రకటిస్తారని, ఇలా ఒక ర్యాలీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం టీఎంసీకి ఇదే తొలిసారి అని పార్టీ తెలిపింది. ఈ ర్యాలీలో లక్షల మంది పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు.

జగన్ రూట్‌లోనే టీఎంసీ

వేదిక నిర్మాణ విషయంలో టీఎంసీ పార్టీ వైసీపీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన సిద్ధం సభలో కూడా వేదికను ఇలానే నిర్మించారు. ఈ సభ వేదికను డ్రోన్ షాట్‌లో చూస్తే ప్లస్ గుర్తులా కనిపిస్తుంది. ఈ వేదిక ఉద్దేశం కూడా నేతలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లడమే. ఈ ప్లాన్‌నే టీఎంసీ కూడా తమ సభకు ఫాలో అవుతుందనిపిస్తోంది. జగన్ వేదిక నిర్మించిన సంస్థే టీఎంసీకి కూడా వేదికను రెడీ చేస్తోందని సమాచారం.


Read More
Next Story