
ట్రంప్, నెతన్యాహూలకు షాకులు మొదలయ్యాయా ?
యుద్ధంలో ఏమీ సాధించలేకపోగా తమ దేశాల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు
ఇంట గెలిచి రచ్చగెలవాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు. అయితే ఈ నానుడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూలకు వర్తించేట్లు లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు రచ్చగెలవటం సంగతి దేవుడెరుగు ఇంటకూడా వీళ్ళపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇపుడు విషయం ఏమిటంటే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా యుద్ధం మొదలుపెట్టి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ సాధించింది ఏమిటంటే ఏమీలేదనే చెప్పాలి. యుద్ధంలో ఏమీ సాధించలేకపోగా తమ దేశాల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా 50రాష్ట్రాల్లోని 3500 ప్లేసుల్లో సుమారు 90లక్షలమంది భారీనిరసన వ్యక్తంచేశారు. అలాగే ఇజ్రాయెల్‌లో నెతన్యాహూ వైఖరికి నిరసనగా నిరసనలు మొదలయ్యాయి.
అమెరికాలో అయినా ఇజ్రాయెల్ లో అయినా ప్రజలు ఆందోళనలు దేనికంటే ఇరాన్ పై యుద్ధం వెంటనే నిలిపేయాలని. ఇరాన్‌తో యుద్ధంకారణంగా అమెరికాలో, ఇజ్రాయెల్‌లో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండుదేశాలకు చెందిన వందలాదిమంది సైనికులు చనిపోయారు. ఇజ్రాయెల్ సైనికులు చనిపోవటమే కాకుండా కొందరు పౌరులు కూడా మృతిచెందారు. వందలాది మిస్సైళ్ళ ఇరాన్ దాడుల కారణంగా ఎప్పుడేమి జరుగుతుందో అన్న టెన్షన్ ఇజ్రాయెల్ పౌరుల్లో పెరిగిపోతోంది. మొన్నవరటి ఎంతో గొప్పగా చెప్పుకున్న ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ ఇపుడు ఎందుకు పనికిరాకుండా పోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్‌కు మద్దతుగా యమెన్‌లోని హౌతీలు ఇజ్రాయెల్ పై మిస్సైళ్ళతో విరుచుకుపడుతున్నారు.
హౌతీలు యుద్ధంలోకి ఎంటరై ఇజ్రాయెల్ పట్టణాలపైన మిస్సైళ్ళతో విరుచుకుపడటం ఊహించని పరిణామం. అందుకనే ఇజ్రాయెల్ జనాలు వీధుల్లోకి వచ్చి నెతన్యాహూ వైఖరికి నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారు. ఇదే పద్దతిలో అమెరికాలో ట్రంప్ కు కూడా మొదలైంది. అవసరంలేని యుద్ధం మొదలుపెట్టి తమ జీవితాలతో ట్రంప్ చెలగాటమాడుతున్నాడంటు అమెరికన్లు మండిపోతున్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తు ట్రంప్‌కు వ్యతిరేకంగా లక్షలాదిమంది జనాలు రోడ్లపైకి రావటం కీలకమైన పరిణామమనే చెప్పాలి.
ట్రంప్ అసలు సమస్య ఇదేనా ?
ఇపుడు సమస్య ఏమిటంటే యుద్ధాన్ని గౌరవప్రదంగా ఎలా విరమించాలో ట్రంప్ కు అర్ధంకావటంలేదు. అమెరికాకు మద్దతుగా మిత్రదేశాలు యుద్ధంలోకి దిగలేదు. హోర్మూజ్ జలసంధి నుండి నౌకలు ప్రయాణించటానికి వీలుగా అమెరికా సైనికచర్యకు దిగాలి రమ్మని ట్రంప్ అడిగితే మిత్రదేశాలు తమకు సంబంధంలేదు పొమ్మన్నాయి. ఇదేసమయంలో అమెరికాకు సాయంగా నిలుస్తున్నాయన్న కారణంగా గల్ఫ్ లోని కువైట్, దుబాయ్, సౌదీఅరేబియా, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లోని అమెరికా సైనిక స్ధావరాలు, రాయబార కార్యాలయలపైనే కాకుండా జనావాసాలపైన కూడా ఇరాన్ క్షిపణులు, బాంబులతో దాడులు చేస్తోంది. ఈ దాడుల కారణంగా పై దేశాల్లోని వర్తక, వాణిజ్య కేంద్రాలు, చమురుక్షేత్రాలతో పాటు జనావాసాలు బాగా దెబ్బతినేశాయి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలీదు కాని ఈ దేశాలకు పూర్వవైభవం రావాలంటే మాత్రం చాలాకాలం పడుతుంది అనటంలో సందేహంలేదు.
ఈ పరిస్ధితుల్లో ఇరాన్‌పై యుద్ధాన్ని ఎలాఆపాలో ట్రంప్‌కు అర్ధంకావటంలేదు. నాలుగైదురోజుల్లో ఇరాన్ లొంగిపోతుందనే తప్పుడు అంచనాతో అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం కారణంగా ఇపుడు ఆ దేశాల అధినేతలకే ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. ఎన్నిరోజులైనా సరే తాము యుద్ధానికి రెడీ అని సవాలు విసురుతోంది. ఇరాన్ విసురుతున్న సవాలుకు ధీటుగా బదులివ్వటం అమెరికా, ఇజ్రాయెల్ కు సాధ్యంకావటంలేదు. హోర్మూజ్ జలసంధిలో వివిధ దేశాలకు చెందిన నౌకలు ప్రయాణించకుండా ఇరాన్ దిగ్భందం చేసేయటంతో ఆ దేశాల నుండి ట్రంప్ పైన బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. ట్రంప్, నెతన్యాహూపైన అన్నీ వైపుల నుండి ఒత్తిడి పెరిగిపోయేలా వ్యూహాలు పన్నటంలో ఇరాన్ విజయం సాధించినట్లే అనుకోవాలి. ఇరాన్ వ్యూహాల ఫలితమే అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో జనాల్లో మొదలైన తిరుగుబాట్లు. ముందుముందు దీని పర్యవసానాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.

