
రేపే ఇంటర్ ఫలితాలు.. ఫోన్‌లోనే చూసుకోవచ్చు.. !
విద్యార్థులు మొబైల్‌లో సులభంగా ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. కాగా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి ఇంటర్‌నెట్ షాపులకు, మీసేవా సెంటర్లకు పరుగులు పెట్టాల్సిన పని లేదని, ఇంట్లో కూర్చుని వాట్సాప్‌లోనే తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు విడుదల కానున్న ఫలితాలను విద్యార్థులు నేరుగా వాట్సాప్‌లోనే పొందే అవకాశం కల్పించింది.
ఇకపై ఫలితాల కోసం వెబ్‌సైట్‌లలో లాగిన్ కావాల్సిన అవసరం లేకుండా, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. 8096958096 నెంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలు పొందవచ్చని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ తెలిపారు. విద్యార్థులు ముందుగా ఆ నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని ‘Hi’ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత చాట్‌బాట్‌లో ‘BIE Exam Result’ ఎంపికను ఎంచుకుని ‘Open Service’ నొక్కాలి. తరువాత హాల్ టికెట్ నంబర్, సంవత్సరం, స్ట్రీమ్ వివరాలు నమోదు చేస్తే ఫలితం వెంటనే మెసేజ్ రూపంలో అందుతుంది.
ఈసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,495 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. అదనంగా ఐదు కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం 4,89,126 మంది, రెండో సంవత్సరం 5,07,949 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేశారు. పరీక్షలు పూర్తికాకముందే మూల్యాంకనం ప్రారంభమైంది. దీంతో మార్చి చివరికి ఫలితాలు సిద్ధమయ్యాయి. మొత్తంగా, సాంకేతికతను ఉపయోగించి విద్యార్థులకు సులభంగా ఫలితాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

