మొత్తానికి టిఎస్ పిఎస్ పి ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా
x
అనర్థాలన్నీ జరిగాక పదవికి రాజీనామా చేసిన టిఎస్ పి ఎస్ సి ఛెయిర్మన్ జనార్ధన్ రెడ్డి

మొత్తానికి టిఎస్ పిఎస్ పి ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా

తాను అపకీర్తి పాలయి, కమిషన్ అభాసు పాలయి, బిఆర్ ఎస్ పార్టీ ఎన్నికల్లో పరాభవం పాలయ్యాక జనార్దన్ రెడ్డి పదవి నుంచి తప్పుకున్నారు.


మొత్తానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవికి బి జనార్దన్‌రెడ్డి సోమవారం నాడు రాజీనామా చేశారు.

ఆయన రాజీనామా చేసేందుకు ఎంత బీభత్సం జరగాల్సి వచ్చిందో. ఎన్ని జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయో.ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంది. కొన్ని లక్షల మంది నిరుద్యోగుల ఆశలు వమ్ముఅయ్యాయి. ఒక్క మాటలో చెబితే టిఎస్ పిఎసి అసమర్థత వల్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఓడిపోయింది. ఇక రాదు అనుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చింది.కెసిఆర్ ఓటమిలో నిరుద్యోగుల పాత్ర ఎవరైనా కాదనగలరా. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారమంతా మూడు నాలుగు అంశాల వైపే తిరిగాయి. అందులో నిరుద్యోగం ఒకటి. నిరుద్యోగం అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే గుర్తుకొస్తుంది.

జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలి అనే డిమాండ్ గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పటినుంచి డిమాండ్ వినపడుతూ ఉంది. ఆయనకు వెనక బోలెడు రాజకీయ నాయకుల అండవుచ్చు. కానీ పేపర్ లీక్ అయ్యాక నైతిక బాధ్యతను జనార్దన్ రెడ్డి విస్మరించాడు. కుంటిసాకులతో పదవిలోనే కొనసాగడం పెద్ద రాజకీయ దూమారం లేపింది.

క్వశ్చన్ పేపర్ లీకుల నేపథ్యంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎఇ, ఎఇఇ)డివిజినల్ అకౌంట్స్స ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వంటి పరీక్షలు వాయిదా పడ్డదాయి. ఈ లీకేజీ మీద ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)నియమించింది. అది క్వశ్చన్ పేపర్ లు లీకయినట్లు తేల్చింది. ఈ తేల్చడాన్ని కొంత ప్రభుత్వం అంగీకరిస్తుందా లేకదీని వెనక ఉన్నదెవరో బయటపెట్టేందుకు మరొక దర్యాప్తు చేయిస్తుందా తెలియదు. నిజానికి అపుడే చాలా మంది సిబిఐ దర్యాప్తు చేయించాలని కూడా కోరారు.

ప్రభుత్వంలో సీనియర్ అధికారిగా పలు బాధ్యతలు నిర్వర్తించిన జనార్దన్ రెడ్డికి తన నాయకత్వంలోని ఒక సంస్థ వల్ల కొన్ని లక్షల మంది నిరద్యోగులు నష్టపోయారన్నపుడు రాజీనామా చేయాలనిపించాలి. దానికి తాను బాధ్యుడు అయనా కాకపోయినా, తన అజమాయిషీలోని సంస్థ అపకీర్తి పాలయినపుడు బాధ్యత వహించాలి. ఆయన ఆ మంచిపని చేయాలేదు. ఆయన రాజనామా ఆరేడునెలలు ఆలస్యం చేశారు. దీనితో ప్రభుత్వం కూలిపోవాల్సి వచ్చింది.

సోమవారం నాడు జనార్దన్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి అందజేశారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డిని కూడా కలిశారు. ఆయన రాజీనామాను గవర్నర్‌ తమిలిసై ఆమోదించారు. తదుపరి చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి అదేశాలు జారీ చేశారు.

మాజీ ఐఎఎస్ అధికారి అయిన జనార్దన్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా 2021 మే 5 తేదీన బిఆర్ ఎస్ ప్రభుత్వం నియమించింది. ఆయన తో పాటు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు రవీందర్ రావు, ఆయుర్వేద డాక్టర్ చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ హెల్త్ ఈఎన్‌సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రోఫెసర్ లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారి, తెలుగు పండిట్ సుమిత్రా ఆనంద్ తనోబాలను సభ్యులుగా నాటి తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వీళ్లింకా రాజీనామా చేసినట్లు లేరు.

ఆయన రాజీనామా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ఛైర్మన్ డా. జనార్ధన్ రెడ్డి రాజీనామాను స్వాగతిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. జనార్దన్ రెడ్డి లాగనే కమిషన్ మిగతా సభ్యులు కూడా వెంటనే రాజీనామా చేయాలని ఆయన సూచించారు "ఈ పని మార్చి నెల లోనే చేసుంటే బాగుంటుండె. అసలు నిజాలు ప్రజలకు తెలిసేవి. ప్రవళిక లాంటి నిరుద్యోగుల విలువైన ప్రాణాలు పోయేవి కావు," అని ప్రవీణ్ కుమార్ అన్నారు.

అదే విధంగా సిట్ (SIT) ఇన్వెస్టిగేషన్ అంతా అసలు నిందితులను రక్షించడానికే జరిగిందని దాని మీద కూడా పూర్తి స్థాయి సమీక్ష జరపాలని నిరుద్యోగుల తరపున బీయస్పీ కోరుతున్నదని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సారైనా నీతికి, నిజాయితీకి, చక్కటి పరిపాలన దక్షతకు మారుపేరైన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా సభ్యులుగా నియమించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించిన కీలకమయిన సమాచారం ప్రజలముందుంచడంలో ప్రవీణ్ కుమార్ గణనీయమయిన పాత్ర పోషించారు.

జనార్దన్‌రెడ్డి 1996కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన అగ్రికల్చర్‌ లో పోస్టు గ్రాజ్యుయేట్ . పీజీ 1990లో గ్రూప్‌-1కు ఎంపికై నల్లగొండ, నెల్లూరు ఆర్డీవోగా పనిచేశారు. వరంగల్‌, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా విధులు పని చేశారు. నిజానికి ఈ రెండు జిల్లాల కలెక్టర్ గా ఉన్నపుడు జనార్దన్ రెడ్డి కి మంచి పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన వ్యవసాయశాక ముఖ్యకార్యదర్శిగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు గా పనిచేశారు. టిఎస్ పిఎస్ సి లీకులతో ఆయనకు చెడ్డపేరు వచ్చింది. కమిషన్ అభాసుపాలయింది.

Read More
Next Story