రూ.5,141 కోట్ల వార్షిక బడ్జెట్‌కు టీటీడీ బోర్డు ఆమోదం
x

రూ.5,141 కోట్ల వార్షిక బడ్జెట్‌కు టీటీడీ బోర్డు ఆమోదం

తిరుమలలో వివిధ అభివృద్ధి పనులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,141.74 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి సమావేశం ఆమోదం తెలిపింది.


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,141.74 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.

  • 5 గ్రాములు, 10 గ్రాములతో నాలుగు లేదా ఐదు డిజైన్లలో మంగళసూత్రాలను, వీటితోపాటు లక్ష్మీకాసులను తయారుచేయనున్నారు. లాభాపేక్ష లేకుండా వీటిని విక్రయిస్తారు.
  • టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్‌ రోడ్డుకు ఆమోదం.
  • టీటీడీలోని వివిధ విభాగాలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కింద పనిచేసే ఉద్యోగులకు వేతనాల పెంపు
  • 70 మంది కాంట్రాక్టు లడ్డూ ట్రే లిఫ్టింగ్‌ సెమి స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులను స్కిల్డ్‌ కార్మికులుగా మార్చి వారి వేతనాలను రూ.12,523/- నుంచి రూ.15 వేలకు పెంచేందుకు ఆమోదం.
  • అన్నదాన విభాగంలో 138 మంది క్లీనర్లు, 79 మంది వంట మనుషులను స్కిల్డ్‌ కేటగిరీలోకి మార్చి వారి వేతనాలను రూ.17 వేల నుంచి రూ.22 వేలకు పెంపు.
  • ఎలక్ట్రికల్‌, వాటర్‌ వర్క్స్‌ విభాగాల్లో పనిచేసే కార్మికులను అన్‌స్కిల్డ్‌ నుంచి స్కిల్డ్‌ కేటగిరీలోకి మార్పు.
  • శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో వివిధ దేవతామూర్తుల శిల్పాలను తయారుచేస్తున్న శిల్పుల కళానైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా వారి వేతనాల పెంపునకు ఆమోదం.
  • కలంకారి కళలో నిపుణులైన మునస్వామిరెడ్డి వేతనం రూ.25 వేల నుంచి రూ.39 వేలకు పెంపు.
  • టీటీడీ అనుబంధ, విలీన ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకుల వేతనాలను రూ.26 వేల నుంచి రూ.31 వేలకు పెంచేందుకు ఆమోదం.
  • టీటీడీ స్టోర్‌లో పనిచేసే 9 మంది వర్కర్లకు వారి వేతనం రూ.9 వేల నుంచి రూ.15 వేలకు పెంపు.
  • ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా సేవలందిస్తున్న క్రమాపాఠీలకు రూ.16 వేల నుంచి రూ.22 వేలకు, ఘనాపాఠీలకు రూ.17 వేల నుంచి రూ.25 వేలకు సంభావన పెంపు.
  • అలాగే 1400 మంది వేదపారాయణదారులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంపు.
  • హైందవ సనాతన ధర్మప్రచారంలో భాగంగా వేదవిద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో ఆరు వేద పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను రూ.35 వేల నుంచి రూ.54 వేలకు పెంపు
  • టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనమైన 34 ఆలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగినంత సిబ్బంది నియామకానికి అమోదం. ఇందులో భాగంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో 227 వేదపారాయణందారు, అధ్యాపక, మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 అర్చక, పరిచారిక, పోటు వర్కర్‌, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్‌, వేదపారాయణందారు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.
  • టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీకి వస్తున్న రోగుల సంఖ్య దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1200 పడకలకు పెంపునకు అమోదం. అలాగే 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి భవనాల ఆధునీకరణకు రూ.148 కోట్లు ఆమోదం.
  • తిరుమలలోని ఆకాశగంగ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు రూ.30.71 కోట్లకు ఆమోదం.
  • శ్రీవారి దర్శనానికి దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.2.28 కోట్లతో సప్తగిరి సత్రాలు-6, 7 బ్లాకుల అభివృద్ధి పనులకు ఆమోదం.
  • తిరుమలలోని శ్రీవేంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి, పెయింటింగ్‌ పనుల కోసం రూ.10.90 కోట్లు మంజూరుకు ఆమోదం.
  • ఆకాశరాజు నిర్మించిన అతిప్రాచీనమైన నారాయణవనంలోని శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయానికి రాజగోపురం, రాతిప్రాకారం నిర్మాణానికి రూ.6.90 కోట్లు మంజూరు
  • రాష్ట్ర విభజన అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్యసేవలు అందించాలన్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సూచన మేరకు తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ఇకపై శ్రీ పద్మావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చ్కెల్డ్‌ హెల్త్‌గా నామకరణం.
  • టీటీడీ పాలనా వ్యవహారాలు వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఐదేళ్ల కాలపరిమితికి ఓరాకిల్‌ ఫ్యూజన్‌ క్లౌడ్‌ ఇఆర్‌పి ప్రవేశపెట్టేందుకు ఆమోదం.

తిరుమల అన్నమయ్య భవనం సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్యశ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం.

అనంతరం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీ భాస్కర్‌ రెడ్డి అధ్యక్షతన తిరుమల, తిరుపతి మీడియా ప్రతినిధులతో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టు నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను టీటీడీ ఛైర్మన్‌ భూమన కరణాకరరెడ్డికి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేసింది.

సమావేశంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు.

Read More
Next Story