టీటీడీ అటవీ కార్మికుల వేతనాల పెంపునకు అంగీకారం
x

టీటీడీ అటవీ కార్మికుల వేతనాల పెంపునకు అంగీకారం

టీటీడీ అటవీ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు ఫలితం దక్కింది. కార్మికులకు వేతనం పెంచేందుకు అంగీకరించారు.


టీటీడీ అటవీ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు ఫలితం దక్కింది. తమను రెగ్యులర్‌ చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో గత 36 మాసాలుగా అటవీ కార్మికుల రిలే దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్‌ నుంచి తమను మినహాయించడంతో పాటు టైం స్కేల్‌ వర్తింపజేసి వేతనాలు పెంచాలన్నవి వారి ఇతర డిమాండ్లు.

అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో జనవరి 27 నుంచి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి నేతృత్వంలో నిరవధిక నిరాహార దీక్షలను ప్రారంభించారు. 29వ తేదీన దీక్ష చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితిని దారితీసింది.

ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి చొరవతో జేఈవో వీరబ్రహ్మం, లక్ష్మీ శ్రీనివాసా కార్పొరేషన్‌ సీఈవో శేష శైలేంద్ర, టీటీడీ ఫారెస్ట్‌ డీఎఫ్‌వో శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం సీఐటీయూ నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యంతో చర్చలు జరిపారు.

కార్మికులకు మరో రూ. 3,125లు వేతనం పెంచుతూ ప్రతి రెండేళ్లకు ఓ సారి ఒక్కో కార్మికుడికి 25 మొక్కల పెంపకం బాధ్యతను అప్పగించారు. దీనికి కార్మికులు సమ్మతించడంతో టీటీడీ ఛైర్మన్‌ హరే రామ హరే కృష్ణ రోడ్డులోని దీక్షా శిబిరం వద్దకు వచ్చి మాట్లాడారు. నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. లక్ష్మీ శ్రీనివాసా కార్పొరేషన్ నుంచి కార్మికులను మినహాయించేందుకు టీటీడీ యాజమాన్యం అంగీకరించింది.

పర్మినెంట్ తమ పరిధిలో లేని అంశం కనుక కార్మికులకు టైం స్కేల్ వర్తింప చేస్తామని 2023 పిఆర్ సి ప్రాతిపదికన 20వేల రూపాయల బేసిక్ తో 22,600 వేతనం చెల్లిస్తామని అధికారులు ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి రిలేదీక్షలకు మద్దతు తెలిపిన తిరుపతి నగరంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ అభినయ్‌ రెడ్డి సమస్య పరిష్కారానికి చొరవ చూపారని పలుమార్లు అధికారులతో చర్చించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్టు కందారపు మురళి ప్రకటించారు.

సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వి. నాగరాజు, రిపబ్లికన్‌ పార్టీ నేత పూతలపట్టు అంజయ్య, తెలుగుదేశం పార్టీ నేత మునికృష్ణ, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు నాగేష్‌, వెంకటాచలపతి, బాలసుబ్రమణ్యం, జై భారత్‌ పార్టీ నాయకురాలు మునిలక్ష్మి, సాకం నాగరాజు, రాఘవ శర్మ, తమటం రామచంద్రారెడ్డి, డాక్టర్‌ బాలాజీ, డిఎంసి భాస్కర్‌ లతో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం టి. సుబ్రమణ్యం, వేణు, జయచంద్ర, మాధవ్‌, ఆర్‌ లక్ష్మి, రఘు, బుజ్జి, నాగ వెంకటేష్‌, ముని రాజా, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story