
పులి దంతాలు, గోర్లు స్వాధీనం
కేరళ నుంచి హైదరాబాద్‌కు పులి దంతాలు,గోర్ల స్మగ్లింగ్
కొనుగోలుదారులుగా మారి పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు
కేరళ రాష్ట్రం నుంచి పులి దంతాలు, గోర్లను హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చి విక్రయించేందుకు యత్నించిన వన్యప్రాణి స్మగ్లర్ల గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)అధికారులు రట్టు చేశారు. ఫిబ్రవరి 9వతేదీన నాంపల్లి ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో పులి కేనైన్ దంతాలు 2, పులి గోర్లు 7 స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కొనుగోలుదారులుగా రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు
కేరళ రాష్ట్రంలోని జకరియా అనే వ్యక్తి నుంచి పులి దంతాలు, గోళ్లను హైదరాబాద్ కు తీసుకువచ్చి విక్రయించేందుకు యత్నించారని దర్యాప్తులో తేలింది. నాంపల్లి లోని హోటల్ ఏషియన్ ఇంటర్నేషనల్ గది నెంబరు 305లో లావాదేవీలు జరగనున్నాయన్న సమాచారంతో అక్కడికి డీఆర్ ఐ అధికారులు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు కొనుగోలుదారులుగా నటిస్తూ నిందితులను సంప్రదించారు. స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి అవశేషాలు, నిందితులను తదుపరి చర్యల నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు.
విచారణలో నిందితులు ఈ వన్యప్రాణి అవశేషాలను కేరళ రాష్ట్రానికి చెందిన జకరియా అనే వ్యక్తి నుంచి పొందినట్లు ఒప్పుకున్నారు. అతడు ఇద్దరు నిందితులకు సన్నిహిత మిత్రుడని దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఘటనపై సెంట్రల్–I సెక్షన్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి పంచనామా నిర్వహించి, పీఓఆర్ నెం. 12-07/2022-23 (తేదీ: 09-02-2026) కింద కేసు నమోదు చేశారు. పులి (పాంతెరా టైగ్రిస్) వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 లోని షెడ్యూల్–I కింద అత్యంత రక్షిత జాతి కావడంతో వీటితో వ్యాపారం చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 10న జిల్లా అటవీ అధికారి నిందితులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరు పరచగా, 15 రోజుల న్యాయ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం కేరళ అటవీ శాఖకు పంపించగా, వన్యప్రాణి అవశేషాల మూలాన్ని గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story

