
యూట్యూబర్ అన్వేష్‌పై రెండు కేసులు
‘నా అన్వేషణ’ ఛానెల్‌ను అన్‌సస్క్రైబ్ చేసిన లక్షల మంది ఆడియన్స్.
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై హైదరాబాద్‌లో రెండు కేసులు ఫైల్ అయ్యాయి. హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడాడంటూ పలువురు సదరు యూట్యూబర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి. సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అన్వేష్‌పై BNS సెక్షన్ 352, 79, 299, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేయాలని కోరారు. త్వరలోనే పంజాగుట్ట పోలీసులు అన్వేష్‌కు నోటీసులు జారీ చేయనున్నారు.
ఖమ్మం జిల్లాలో దానవాయిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి కూడా అన్వేష్ వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. అన్వేష్, హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ వీడియోలు రిలీజ్ చేశాడు. అయితే ఆ వీడియోల్లో హిందూ దేవతలపై అసభ్యమైన వ్యాఖ్యలు చేసినట్లు మండిపడుతున్న హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాల తర్వాత అన్వేష్ సోషల్ మీడియాలో ఫాలోవర్లను కోల్పోతున్నాడు. ‘నా అన్వేష్ యూట్యూబ్’ ఛానల్‌ను రెండు రోజులలో లక్షల మంది అన్-సబ్‌స్క్రయిబ్ చేశారు. తరువాత అన్వేష్ కొన్ని వీడియోల్లో క్షమాపణలు చెప్పినప్పటికీ, నెటిజన్లు స్పందన కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. తదుపరి చర్యలు పరిస్థితుల ప్రకారం తీసుకోవాలని అధికారులు తెలిపారు.

