రెండు కూటమి ప్రభుత్వాల మధ్య ఐపీఎస్ చిచ్చు
x

రెండు కూటమి ప్రభుత్వాల మధ్య ఐపీఎస్ చిచ్చు

తమ రాష్ట్రం ఐపీఎస్ అధికారి మీద ఏపీ పోలీసులు జులుం చూపించటంపై బీహార్ డీజీపీ వినయ్ కుమార్ బాగా సీరియస్ అయ్యారు


వినటానికి చాలా విచిత్రంగానే ఉంటుంది. ఒక ఐపీఎస్ అధికారిని రక్షించుకునేందుకు ఒక రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ఇదే ఐపీఎస్ అధికారిని అరెస్టు చేసేందుకు మరో ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఐపీఎస్ అధికారిని రక్షిస్తున్న ప్రభుత్వం ఎన్డీయే కూటమిలో భాగమే, అరెస్టుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వమూ ఎన్డీయే కూటమిలోనిదే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు ప్రభుత్వాల మధ్య వివాదానికి మూలకరకుడైన ఐపీఎస్ అధికారి ఈ రెండు ప్రభుత్వాలతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తి.

రెండు ప్రభుత్వాల మధ్య చిచ్చు రగలటానికి మూల కారణమైన ఐపీఎస్ అధికారి పేరు సునీల్ నాయక్. నాయక్ ను రక్షించేందుకు చర్యలు తీసుకున్నది బీహార్ లో నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం. అలాగే నాయక్ ను అరెస్టు చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నది ఏపీలో చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే. రెండు ప్రభుత్వాలూ ఎన్డీయేలోని కూటములోనివే అయినా ఒక ఐపీఎస్ అధికారి కోసం రెండు ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయలేమిని స్పష్టంగా చూపిస్తోంది.

ఇంతటి వివాదానికి మూలకారణం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఎంపీ కనుమూరు రఘురామకృష్ణమరాజు కస్టోడియల్ టార్చర్ గురించి అందరికీ తెలిసిందే. తనను ఒక కేసులో అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో కస్టడీలో టార్చర్ చేశారని సదరు ఎంపీ దేశమంతా చెప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యారు. అప్పుడు రఘురామ తనను కస్టడీలో టార్చర్ చేసిన ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, సునీల్ నాయక్ తదితరులపైన పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం రఘురామ కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీ డిప్యుటి స్పీకర్ అనే రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారు.

రఘురామ ఫిర్యాదే కారణం

అందుకనే డిప్యుటి స్పీకర్ ఫిర్యాదు ఇవ్వగానే పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. సునీల్ నాయక్ ను అరెస్టు చేయాలని ఏపీ పోలీసులు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం సునీల్ నాయక్ బీహార్ ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ ఐజీగా విధుల్లో ఉన్నారు. కాబట్టి ఏపీ పోలీసులు బీహార్ కు వెళ్ళి నాయక్ ను అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకురావాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బీహార్ వెళ్ళిన పోలీసులు నాయక్ ఇంటిమీద రెయిడ్ చేశారు. ఇంట్లోనే ఉన్న నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ ఐజీని కొంతమంది అదుపులోకి తీసుకోవటాన్ని గమనించిన బీహార్ పోలీసులు అడ్డుపడ్డారు.

ఆసమయంలో బీహార్ పోలీసులకు, ఏపీ పోలీసులకు మధ్య పెద్ద గొడవే అయ్యింది.

ఐజీ భద్రతా సిబ్బంది సమాచారం ఆధారంగా అక్కడిపోలీసులు వెంటనే ఇంటిదగ్గరకు అదనపు బలగాలను పంపించారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని ఏపీ పోలీసులు వెంటనే నాయక్ ను విడిచిపెట్టేశారు. తమ రాష్ట్రం ఐపీఎస్ అధికారి మీద ఏపీ పోలీసులు జులుం చూపించటంపై బీహార్ డీజీపీ వినయ్ కుమార్ బాగా సీరియస్ అయ్యారు. దాంతో నాయక్ ను ఏమీచేయలేక ఏపీ పోలీసులు అక్కడి నుండి వెనక్కుతగ్గారు.

ఏపీ పోలీసులపై సీరియస్

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే నాయక్ విషయంలో ఏపీ పోలీసులు చేసిన దాడిపై బీహార్ ప్రభుత్వ బాగా సీరియస్ అయ్యింది. వెంటనే బీహార్ ప్రభుత్వం సీఆర్పీసీ స్ధానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్)-2023 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 218, సబ్ సెక్షన్ 2 ప్రకారం కేంద్ర సాయుధ దళాలకు చెందిన వారు ఎవరైనా అధికారిక విధినిర్వహణలో నేరానికి పాల్పడితే అలాంటి వారిని కేంద్రం ముందస్తు అనుమతితో మాత్రమే విచారణ చేయాలి. సునీల్ నాయక్ విషయంలో ఏపీ పోలీసుల చర్యల కారణంగా బీహార్ ప్రభుత్వం బీఎన్ఎసఎస్-2023 చట్టాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది.

అలాగే బీహార్ రాష్ట్ర క్యాడర్ అధికారులు విధి నిర్వహణలో భాగంగా ఇతర రాష్ట్రాలు లేదా ఇతర ప్రాంతాల్లో పనిచేసినపుడు నేరాలకు లేదా నేరానికి పాల్పడుంటే వారిని విచారించాలంటే ముందుగా బీహార్ ప్రభుత్వం అనుమతి తీసుకోక తప్పదు అని తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. బీహార్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కారణంగా సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకోవాలన్నా, విచారించాలన్నా ముందు బీహార్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. బీహార్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కారణంగా నాయక్ ను అదుపులోకి తీసుకోవటం, విచారించటం ఏపీ పోలీసులకు ఇప్పట్లో జరిగే పనికాదని అర్ధమైపోతోంది.

నాయక్ ను అదుపులోకి తీసుకుంటాము, విచారిస్తాము లేదా అరెస్టు చేసి ఏపీకి తీసుకుని వెళతామంటే బీహార్ ప్రభుత్వం ఎట్టి పరిస్ధితిలోను అంగీకరించదు. నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారించటం అన్నది ఇపుడు ఏపీ పోలీసులకు పెద్ద సవాలుగా తయారైంది. నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారించకుండా తిరిగి వెళితే పరువుపోవటం ఖాయం. నాయక్ పైన చర్యలు తీసుకోవాలని అనుకున్నపుడు అదేదో ఏపీ ప్రభుత్వం ద్వారా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడించి ఉంటే సరిపోయేది. అలాకాదని సినిమాల్లో చూపినట్లుగా నేరుగా వెళ్ళి ఎత్తుకొచ్చేద్దామని అనకుని వెళ్ళటంతో కథ అడ్డం తిరిగింది. ఇపుడు ఏపీ పోలీసులు ఏమిచేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story