Infant killed by mother
x

నెలల శిశును కట్టెల పోయిలో పడేసిన కన్నతల్లి

దుండిగల్ పరిధిలో దారుణం. తల్లి చేతిలో శిశువు మృతి. దంపతుల గొడవతో ఘటన బయటపడింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు.


ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే అమ్మే.. బిడ్డ పాలిట యమపాశం అయింది. ఏడుస్తుంటే లాలించాల్సింది పోయి.. కట్టేసి కట్టెల పోయిలో పడేసింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్నతల్లే కట్టెలపోయిలే వేసి సజీవదహనం చేసింది. ఈ హృదయవిదారక ఘటన స్థానికులను కలచివేసింది. అసలు తల్లి ఎందుకు అలా చేసింది? అన్న వివరాలు ఇంకా తెలీలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల వివరాల ప్రకారం, నిన్న రాత్రి నుంచి శిశువు నిరంతరం ఏడుస్తుండటంతో తల్లి అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.

బాలుడి ఏడుపును ఆపేందుకు అతని నోటిలో గుడ్డలు పెట్టి, చేతులు కాళ్లు కట్టేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. అనంతరం కట్టెల పొయ్యిలో వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యల కారణంగా శిశువు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. బాలుడి మృతి విషయం తెలుసుకున్న తండ్రి తీవ్ర వేదనకు గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

దంపతుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికుల దృష్టికి వెళ్లింది. పరిస్థితులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంఘటనను వెలుగులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే దుండిగల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో హత్య కోణం స్పష్టమవుతున్నట్లు సమాచారం.

తల్లి మానసిక స్థితి, కుటుంబ పరిస్థితులు, దంపతుల మధ్య ఉన్న వివాదాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఖచ్చితమైన మరణ కారణాలు తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనతో బౌరంపేట ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. పసిబాలుడిపై జరిగిన ఈ అమానుష ఘటన స్థానికులను కలచివేసింది. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Read More
Next Story