ధాన్యాన్ని తడిసి ముంచెత్తుతున్న వరద

ఎనిమిది జిల్లాల్లో కోట్లలో పంటనష్టం జరిగే అవకాశం ఏపీలో రైతులను తీవ్రంగా నష్టపరిచిన తుపాన్‌


ధాన్యాన్ని తడిసి ముంచెత్తుతున్న వరద
x
రామచంద్రాపురంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి వేణుగోపాల కృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మిచౌంగ్‌ తుపాన్‌ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని తిరుపతి, ఎస్‌పీఎస్‌ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, వెస్ట్‌గోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో మంగళవారం గంటకు 110 కిలో మీటర్ల వేంగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. చలిగాలులు ఎక్కువ కావడంతో తీర ప్రాంతాల ప్రజలు వణికి పోతున్నారు. ఈనెల 7వ తేదీ వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో రైతులు పండించిన వరి పంట కోత దశలో ఉండగా కొందరు రైతులు ఇప్పటికే వరి కోసి ఆరబెట్టారు. ఇండ్లలో ఆరబెట్టుకునే అవకాశం లేకపోవడంతో కల్లాలు, ఇతర ప్రాంతాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముదై్దంది. తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఇప్పటి వరకు 97వేల టన్నుల ధాన్యం సేకరించామని, 6.50లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కల్లాలోనే ధాన్యం తడిసి పోయింది. సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ స్వయంగా పరిశీలించి ధాన్యం రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిజానికి ధాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే ఇలా ఎందుకు కల్లాలో తడవబెట్టుకుంటామని రైతులు చెబుతున్నారు. 20 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు చేసేది లేదని అధికారులు చెబుతూ తుపాన్‌ ముంచుకొచ్చే వరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయలేదు. ఇప్పుడు మాత్రం రంగుమారినా, తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నారు.

జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం
ప్రభుత్వం తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారులను నియమించింది. వారు సోమవారం రాత్రికి ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. బాపట్లకు కాటమనేని భాస్కర్, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు జయలక్ష్మి, తూర్పు గోదావరి జిల్లాకు వివేక్‌ యాదవ్, కాకినాడకు యువరాజ్, ప్రకాశంకు ప్రద్యుమ్న, ఎస్‌పీఎస్‌ నెల్లూరుకు హరికిరణ్, తిరుపతికి జె శ్యామలరావు, వెస్ట్‌గోదావరికి కన్నబాబులు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇస్తారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటారు.
పునరావాస కేంద్రాలు
ఎనిమిది జిల్లాల్లో ఇప్పటికే 181 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా 308 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మందులు, వంట సామాగ్రి అందుబాటులో ఉంచారు.
ఒక్కో జిల్లాకు రూ. 2కోట్లు
బాధితులను ఆదుకునేందుకు ఒక్కో జిల్లాకు రూ. 2కోట్ల నిధులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆయా జిల్లాల కలెక్టర్‌లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా ఇళ్లు దెబ్బతింటే వారికి తక్షణ సాయంగా రూ. 10వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
బాపట్ల వద్ద తుపాన్‌ తీరం దాటే అవకాశం
బాపట్ల వద్ద తుపాన్‌ మంగళవారం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. తీరం దాటిన తరువాత సుమారు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సహాయక బృందాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సీఎం సూచించారు.
Next Story