
ఈ సారి బడ్జెట్ 'మధ్యతరగతి'కి భారం కాబోతుందా ?
రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (కాకతీయ యూనివర్సిటీ ) ప్రొఫెసర్ జ్యోతి రాణి ఇంటర్వ్యూ.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, గత పది సంవత్సరాలుగా సామాన్యుడిపై బడ్జెట్ ప్రభావం, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల ఆదాయం, పొదుపు ,పెరుగుతున్న పన్నుల భారం నుండి ఈ సారైనా బడ్జెట్ సామాన్యుడికి ఊరటనిస్తుందా ?లేదా ?వంటి పలు అంశాలపై ‘ఫెడరల్ తెలంగాణా’తో రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (కాకతీయ యూనివర్సిటీ ) ప్రొఫెసర్ జ్యోతి రాణి గారి ఇంటర్వ్యూ.
1)బడ్జెట్ అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యత ఏంటి ?
బడ్జెట్ అనేది కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ఒక ప్రాతిపదిక. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఉద్యోగ కల్పనకు, పేదరిక నిర్మూలనకు మరియు ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఉపయోగించే ఒక శక్తివంతమైన ఆయుధం కాబట్టి దీనిని కోశ విధాన సాధనం (Fiscal Policy Tool) అంటారు.
2) గతంతో పోలిస్తే ప్రస్తుతం బడ్జెట్ పట్ల సామాన్యుడి ఆసక్తి పెరిగిందా ?తగ్గిందా ?
గత 10-11 ఏళ్లుగా ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను బలంగా అవలంబిస్తూ, ప్రజల శ్రేయస్సును విస్మరించడం వల్ల సామాన్యుడికి బడ్జెట్ పట్ల ఆసక్తి పోయింది. ఒకప్పుడు విమర్శనాత్మక చర్చలు జరిగేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
3)ఈ బడ్జెట్ అంచనాలలో మధ్యతరగతి వర్గం పాత్ర ఏమిటి ? వారి కొనుగోలు శక్తి మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది?
భారతదేశంలో మధ్యతరగతి జనాభా సుమారు 43.2 కోట్లు, ఇది బ్రిటన్ మొత్తం జనాభా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. బడ్జెట్ కేటాయింపులు మరియు పన్ను రాయితీలపై ఈ వర్గం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది, ఎందుకంటే మల్టీ నేషనల్ కంపెనీల ఉత్పత్తులకు, కార్పొరేట్ విద్యా-వైద్య సేవలకు మరియు వినియోగ వస్తువులకు అసలైన డిమాండ్ ఈ వర్గం నుంచే వస్తుంది. వీరి కొనుగోలు శక్తి పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఎఫిషియన్సీ దెబ్బతింటుంది, అందుకే మార్కెట్ స్థిరంగా ఉండాలంటే ఈ బడ్జెట్‌లో మధ్యతరగతికి ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం.
4) బడ్జెట్ బయట అమలవుతున్న జీఎస్టీని "తిరోగామి పన్ను" అని ఎందుకు పిలుస్తారు ?ఇది సామాన్యుడిపై ఎలాంటి భారాన్ని మోపుతోంది?
ఆర్థిక శాస్త్రంలో జీఎస్టీని "తిరోగామి పన్ను" అంటారు. దీని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి ఆదాయంతో సంబంధం లేకుండా, కోటీశ్వరుడైనా లేదా నిరుపేదయినా ఒకే వస్తువుపై సమానమైన పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇది ధనికుల కంటే తక్కువ ఆదాయం ఉన్న పేద, మధ్యతరగతి వర్గాల పైనే పన్ను భారాన్ని ఎక్కువగా మోపుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేశంలోని మొత్తం జీఎస్టీ వసూళ్లలో 75% వాటా మెజారిటీ ప్రజలు కొనుగోలు చేసే 480 రకాల నిత్యావసర వస్తువుల నుండే వస్తోంది. బడ్జెట్ ద్వారా ప్రత్యక్ష పన్నుల్లో మార్పులు చేసినా, పరోక్ష పన్నులైన జీఎస్టీ భారం వల్ల సామాన్యుడి నిజమైన ఆదాయం హరించుకుపోతోంది.
5)రాబోయే బడ్జెట్‌లో సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉందా?
గత ఎనిమిది సంవత్సరాలుగా జీఎస్టీ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పండుగ కానుకలుగా పన్నులు తగ్గిస్తున్నామని చెబుతున్నా, అవి కేవలం భ్రమలు మాత్రమే. బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ప్రభుత్వం పన్నులు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది కాబట్టి, ఈ బడ్జెట్ ద్వారా ధరలు తగ్గి సామాన్యుడికి భారీ ఉపశమనం లభిస్తుందని ఆశించడం కష్టమే.
6) మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆశ్రయించే జీవిత భీమా పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
ప్రభుత్వం జీవిత భీమాను కేవలం ఒక వ్యాపారంగా మారుస్తూ, పొదుపును నిరుత్సాహపరుస్తోంది. పాలసీదారులు చెల్లించే నెలవారీ ప్రీమియంల మీద మరియు పాలసీ ముగిశాక వచ్చే బోనస్ మీద కూడా పన్నులు వేయడం వల్ల మధ్యతరగతి వారు భీమా చేయడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అన్ని రకాల పొదుపు మార్గాలను మూసివేస్తూ ప్రజలను కేవలం వినియోగదారులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
7)బడ్జెట్ ప్రతిపాదనలలోని "జాయింట్ టాక్స్" గురించి మీ అభిప్రాయం ?
భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి పన్ను వేసే "జాయింట్ టాక్స్" విధానం వల్ల మహిళలు ఉద్యోగాలు చేయడానికి నిరుత్సాహపడే ప్రమాదం ఉంది. ఒకవైపు "మహిళల నేతృత్వంలోని అభివృద్ధి" అని నినాదాలు చేస్తూనే, మరోవైపు ఇటువంటి పన్నుల ద్వారా వారిని తిరిగి ఇంటికే పరిమితం చేసేలా ఈ విధానాలు ఉన్నాయి.
8)కేంద్ర బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణా పరిస్థితి ఎలా ఉండొచ్చు ?
ఆర్థిక అధికారాలన్నీ కేంద్రం దగ్గరే కేంద్రీకృతమవుతున్నాయి. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాలకు సొంతంగా పన్నులు వేసే శక్తి పోయి, ప్రతి చిన్న కేటాయింపు కోసం కేంద్ర బడ్జెట్ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బాకీలు కూడా సకాలంలో అందకపోవడం వల్ల ఫెడరల్ వ్యవస్థ బలహీనపడుతోంది.దీనికి తెలంగాణా మినహాయింపు కాదు.
9) సామాన్యుడికి మేలు జరగాలంటే రాబోయే బడ్జెట్‌లలో ఎటువంటి ప్రాథమిక మార్పులు రావాలి?
అంతర్జాతీయ నివేదికలైన వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ,ఆక్స్‌ఫామ్ సూచించినట్లుగా, ప్రభుత్వం ప్రస్తుత నయా ఉదారవాద విధానాలను పక్కన పెట్టాలి. బడ్జెట్ అనేది కేవలం కార్పొరేట్ లాభాల కోసం కాకుండా, ప్రజల సంక్షేమం, ఆదాయ అసమానతల తగ్గింపు మరియు అందరికీ సమానమైన విద్యా-వైద్యం అందించే దిశగా ఉండాలి.
3)కొత్త ఆదాయపు పన్నువిధానం వల్ల పొదుపుపై పడే ప్రభావం ఏమిటి?
జవాబు: కొత్త బడ్జెట్ విధానంలో హౌస్ లోన్, మెడికల్ బిల్లులు వంటి పొదుపులపై ఇచ్చే పన్ను మినహాయింపులను ప్రభుత్వం తొలగించింది. ప్రజలు పొదుపు చేయకుండా, వచ్చిన ఆదాయం అంతా ఖర్చు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

