
కేంద్ర బడ్జెట్‌లో ఒక డేంజర్ సిగ్నల్...
2026-27 కేంద్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు పెరిగినా, పాఠశాల–ఉన్నత విద్య మధ్య నిధుల వ్యత్యాసం భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది.
దేశ భవిష్యత్తును నిర్మించే విద్య రంగానికి కేంద్ర బడ్జెట్‌లో క్రమంగా ప్రాధాన్యం తగ్గుతున్నది. ఒకవైపు పాఠశాల విద్యకు, మరోవైపు ఉన్నత విద్యకు కేటాయించే నిధుల పెరుగుదలలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యత్యాసం విద్యా వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే అవకాశముంది. ఈ మార్పు పేద విద్యార్థులకు విద్య అవకాశాలు పెంచుతుందా లేక విద్యకు దూరం చేస్తుందా? ఇదొక ఆందోళనకరమయిన కోణం. డేంజర్ సిగ్నల్. ఈ సూచన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సూచ్యప్రాయంగా కనిపిస్తున్న దని విద్యారంగంలో పనిచేస్తున్నన్న నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్: 2026-27 లో విద్యకు మొత్తం ₹1,39,286 కేటాయించారు. ఇది గత బడ్జెట్ 2025-26 తో పోల్చితే 8.27% ఎక్కువ. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు ₹1,28,650 కోట్ల ను కేటాయించింది. దీనిని ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంపుగా ప్రచారం చేసుకుంది. కానీ మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయించింది కేవలం 2.5 శాతం మాత్రమే.
కోఠారి కమిషన్‌గా ప్రసిద్ధి చెందిన విద్యా కమిషన్ (1966) విద్యకు ప్రభుత్వ నిధుల కేటాయింపు విషయమై చేసిన సిఫార్సులు ముఖ్యమైన మైలురాళ్లుగా పరిగణించబడతాయి. ఈ కమిషన్ భారతదేశంలోని విద్యా వ్యవస్థ ఆర్థిక అవసరాలను అంచనా వేసింది "విద్య తగినంతగా అభివృద్ధి చెందాలంటే, విద్యకు కేటాయించే నిధులు స్థూల జాతీయ ఉత్పత్తి నిష్పత్తి లో 6, మొత్తం బడ్జెట్లో 10 శాతానికి పెరగాలి" అని సిఫార్సు చేసింది. కానీ ప్రసుత కేంద్ర బడ్జెట్లో జాతీయ విద్యా కమిషన్ సిఫార్సుకు విద్య శాఖకు నిధుల కేటాయింపులు ఏమాత్రం దీనికి దగ్గరగా లేవు.
2014-15లో విద్యకు బడ్జెట్ కేటాయింపులు సుమారు 4.14%గా ఉండగా, ఇది క్రమంగా 2.5%కి తగ్గింది. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య, విద్య సంస్థల అభివృధికి ఈ అరకోర కేటాయింపులు ఎంతవరకు ఉపయోగపడతాయో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. విద్యా రంగానికి కేటాయింపులలో "స్వల్ప పెరుగుదల" జాతీయ విద్యా విధానం లక్ష్యాలను మరియు విద్య సార్వత్రికీకరణను చేరుకోవడానికి సరిపోదు అనే వాదన బలంగా వినిపిస్తుంది.
పాఠశాల విద్య కేటాయింపులో కొంత వృద్ధిని కనిపించింది. 2024-25 బడ్జెట్లో పాఠశాల విద్యకు ₹68,804 కోట్ల కేటాయించగా, అది 2025-26 బడ్జెట్లో ₹78,572 కోట్లకు పెరిగింది. ప్రస్తుత 2026-27 బడ్జెట్లో ₹83,562 కోట్లకు పెంచారు. ఇది గత సంవత్సరాల బుడ్జెట్లతో పోలిస్తే సుమారు 6-8% వృద్ధిని సూచిస్తుంది. అయితే, మొత్తం బడ్జెట్ కేటాయింపులో విద్యకు కేటాయింపు సుమారు 2.6%గా ఉంది, ఇది 2019-20 బడ్జెట్‌లలో కేటాయించిన 3% కంటే తక్కువ. బడ్జెట్లో విద్యకు కేటాయింపులు అవసరాలతో పోలిస్తే తిరోగమనంలోనే ఉందని చెప్పవచ్చు.
ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కే స్టీవెన్సన్ మాట్లాడుతూ బడ్జెట్లో ఉన్నత విద్యకు కేటాయింపులు క్రమంగా తగ్గుతున్నాయని అన్నారు. ఇది క్రమంగా ఉన్నత విద్య ప్రైవేటీకరణను ప్రోత్సహించే చర్యగా అయన అభివర్ణించారు. ‘‘2035 నాటికి ఉన్నత విద్య అందుబాటును ప్రస్తుతం ఉన్న 28 శాతం నుంచి 50 శాతానికి పెంచడమే లక్ష్యమన్నపుడు, దీనికి రాబోయే 10 ఏళ్లలో కేటాయింపులను 22 శాతం పెంచాల్సి ఉంటుంది . ఉన్నత విద్య నిధులలో గణనీయమైన పెంపు లేకుండా ఈ లక్ష్యాన్ని ఎలా సాధించగలం,’’ అని ఆయన ప్రశ్నించారు.
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు కే వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం నిధుల కేటాయింపులో పాఠశాల విద్య, ఉన్నత విద్య మధ్య సమతుల్యం పాటించలేదని అన్నారు. లేక దీని వల్ల ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యి డ్రాప్ అవుట్ శాతం పెరుగుతుందన్నారు. "ఉన్నత విద్యను పేదవారికి అందుబాటులో ఉంచినప్పుడే వారు మంచి ఉద్యోగాలు పొంది ఆశించిన అభివృద్ధి సాధ్యం అవుతుంది. పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే, మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిక్ష కోసం కేటాయించిన నిధులు సరిపోవు," అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాన పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ కారిడార్ల సమీపంలో ప్రతిపాదించిన ఐదు విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ల ద్వారా విద్యను ఉపాధి, పరిశ్రమలతో అనుసంధానం చేయడంపై బడ్జెట్ ప్రధాన దృష్టి ఉందని అఖిల భారత విద్యార్థి సంఘం నాయకులు ఎం నాగరాజు మాట్లాడుతూ అన్నారు.
విద్యార్థి సంఘము బి. ఆర్. ఎస్ .వి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మాట్లాతుడుతూ “మహిళా విద్యను పెంచటానికి నూతనంగా జిల్లాకు ఒక బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ దానికి అనుగుణంగా నిధులు కేటాయింపులు చేయలేదు.
నూతన విద్యా విధానం (ఎన్ఈపి-2020) అమలు చేస్తామని చెప్పే కేంద్ర ప్రభుత్వం, దానికి అవసరమైన ఆర్థిక వనరులు కేటాయించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఒకవైపు విద్యాభివృద్ధి అంటూనే, మరోవైపు పాఠశాలల మూసివేత, నిధుల కోత ద్వారా ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

