
వికసిత భారత్ దిశగా కేంద్ర బడ్జెట్: ఈటల
కేంద్ర బడ్జెట్‌పై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఉపాధి, ఆరోగ్యం, క్యాపిటల్ ఖర్చు, చేనేతకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయించేలా ఉందని మల్కాజ్‌గిరి ఎంపపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన బడ్జెట్‌పై స్పందించారు. ఈ బడ్జెట్‌ను వికసిత భారత్ లక్ష్యంతో రూపొందించిన అభివృద్ధి బడ్జెట్ అని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో సుస్థిర పాలన కొనసాగుతోందని, దీర్ఘకాలిక దూరదృష్టి నిర్ణయాల వల్ల భారత జిడిపి ఏడు శాతం పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం 50 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఈసారి 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు.
ఉపాధి, చేతివృత్తులు, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేశారని ఆయన వివరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గత బడ్జెట్‌లో కేటాయించిన నాలుగు లక్షల కోట్ల రూపాయల నిధులను ఈసారి కూడా కొనసాగించారని అన్నారు. మేకిన్ ఇండియా లక్ష్యంతో యువశక్తిని దేశ పురోగతిలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం బడ్జెట్‌లో కనిపిస్తోందని చెప్పారు. ఆరోగ్య రంగంలో క్యాన్సర్ సహా 17 రకాల మందులపై పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
గ్రామీణ ఉపాధి పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని, కానీ గత బడ్జెట్‌లో 81 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈసారి లక్షా యాభైవేల కోట్లకు పైగా నిధులు పెట్టారని స్పష్టం చేశారు. దీని వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి మరింత పెరుగుతుందని అన్నారు. దేశ భవిష్యత్తు క్యాపిటల్ ఎక్స్పెండిచర్‌పై ఆధారపడి ఉంటుందని, గతసారి 11 లక్షల కోట్లైతే ఈసారి 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చారని, డైరీ, పౌల్ట్రీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.
#Budget2026Live ను వికసిత భారత్ లక్ష్యంతో రూపొందించిన అభివృద్ధి బడ్జెట్‌గా ఎంపీ #Etalarajender పేర్కొన్నారు.
— Subbu (@Subbu15465936) February 1, 2026
ఉపాధి, చేతివృత్తులు, ఆరోగ్యం రంగాలకు పెద్దపీట వేశారని తెలిపారు.
క్యాన్సర్ సహా 17 రకాల మందులపై పన్ను రాయితీతో పేద రోగులకు ఉపశమనం కల్పించారని అన్నారు.#telanganaassembly pic.twitter.com/mtXx0eNLGs
దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచేందుకు పథకాలు ప్రవేశపెట్టారని, సేవారంగంపై తొలిసారి ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మినరల్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కారిడార్ ప్రకటించినట్లు చెప్పారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని, బ్యాంకింగ్ రంగం ద్వారా రుణాల విస్తరణపై కూడా బడ్జెట్‌లో సునిశిత దృష్టి పెట్టినట్లు తెలిపారు.
మొత్తంగా వికసిత భారత్ 2047 దిశగా ఈ బడ్జెట్ స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. చివరగా, బడ్జెట్ అమలు ద్వారా ప్రజలకు ఎంత మేర లాభం చేకూరుతుందో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని అన్నారు.

