
తెలంగాణ విమాన ప్రయాణికుల కల నెరవేరేదెన్నడు?
తెలంగాణ విమానప్రయాణికుల కలలకు 2026-27 కేంద్ర బడ్జెట్ బ్రేక్
33 జిల్లాలకు ఒకే ఒక్క విమానాశ్రయం!
33 జిల్లాలు ఉన్న తెలంగాణకు ఇప్పటికీ ఒకే ఒక్క విమానాశ్రయం. దశాబ్దాలుగా ప్రతిపాదనల్లో ఉన్న వరంగల్ మామునూర్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసినా, 2026–27 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో వాయు రవాణా విస్తరణపై మరోసారి అనిశ్చితి నెలకొంది.
తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి వీలుగా దశాబ్దాలుగా ప్రతిపాదనల్లో ఉన్న కొత్త విమానాశ్రయాలను నిర్మించాలనే ప్రతిపాదనలకు కేంద్రం 2026-27 కేంద్రబడ్జెట్ లో నిధులు ఇవ్వలేదు. ఒకవైపు వరంగల్ జిల్లాలోని మామునూర్ విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి అయింది. మరో వైపు ఆదిలాబాద్ లోనూ విమానాశ్రయం కోసం భూమి సేకరణ సర్వే సాగుతుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు ఒకే ఒక్క విమానాశ్రయం ఉన్న నేపథ్యంలో కనీసం మొదటి దశలో ఆదిలాబాద్, మామునూర్ విమానాశ్రయాలను అయినా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, ఈ బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలోని కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి నిధులు విదల్చలేదు.
తెలంగాణలోని 33 జిల్లాలకు ఏకైక విమానాశ్రయం
తెలంగాణలో 33 జిల్లాలున్నా, విమాన ప్రయాణికుల రాకపోకల కోసం కేవలం ఒకే ఒక్క శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది.దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు ఉన్నా అవి డిఫెన్స్ అవసరాల కోసమే వినియోగిస్తున్నారు.హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శిక్షణ కమాండ్ కింద ఉన్న భారతీయ వైమానిక దళ స్థావరం. దుండిగల్ ఫైటర్ ట్రైనింగ్ వింగ్, హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూలుగా ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయం వీవీఐపీల రాకపోకలను ఉపయోగపడుతోంది.తెలంగాణ రాష్ట్రం మొత్తంమీద దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు రాకపోకల కోసం శంషాబాద్ విమానాశ్రయంపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో ఎల్లప్పుడూ కిటకిటలాడుతోంది. అదే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గన్నవరం, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్టణం, కడప, కర్నూల్, పుట్టపర్తి, భోగాపురం విమానాశ్రయాలుండగా తెలంగాణలో శంషాబాద్ ఒక్కటే విమానాశ్రయం ఉంది.
తెలంగాణలో వాయు రవాణ కనెక్టివిటీ ఏది?
తెలంగాణలో వాయు రవాణా కనెక్టివిటీని పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరినా కేంద్రం నిధులు ఇవ్వకుండా భూసేకరణ పేరిట తాత్సారం చేస్తుంది. వరంగల్ జిల్లాలోని మామునూర్ విమానాశ్రయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం భూమి సేకరించి అప్పగించినా దీనికి కేంద్రం తాజా బడ్జెట్ లో నిధులివ్వలేదు. బీహార్ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ప్రతిపాదిత కొత్త విమానాశ్రయాల గురించి బడ్జెట్ లో ఊసే లేకుండా పోయిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రామగుండం (అంతర్గాం), నాగార్జున సాగర్ వద్ద వాటర్ ఎయిర్‌డ్రోమ్ ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నా వాటిని కేంద్రం కాగితాలకే పరిమితం చేసింది.
భూసేకరణ చేసినా బడ్జెట్ లో నిధులేవి?
వరంగల్ జిల్లాలోని మామునూర్ విమానాశ్రయం పునరుద్ధరణకు అవసరమైన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అప్పగించింది. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే మామునూరులో 696 ఎకరాల పురాతన విమానాశ్రయం భూమి ఉంది. విమానాశ్రయం కోసం భూమి అప్పగింత కార్యక్రమం బేగంపేట విమానాశ్రయంలో మూడు రోజుల క్రితం జరిగింది.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సేకరించిన భూమిని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అంద చేశారు. భూమి సేకరించి ఇచ్చినా కేంద్రం మాత్రం ఈ బడ్జెట్ లో మామునూర్ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఆదిలాబాద్ విమానాశ్రయం పురోగతి గురించి ఏఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజయ్ దేవ్ తో చర్చిస్తున్న ఎంపీ జి నగేష్
కేంద్రం నుంచి నిధులు సాధిస్తాం : ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గెడం నగేష్
హైదరాబాద్ కు 300కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ లో ఇప్పటికే ఉన్న ఎయిర్ ఫోర్స్ ఏరోడ్రోమ్ స్థలంలో కొత్తగా విమానాశ్రయం నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆదిలాబాద్ లో పాత ఏరోడ్రోమ్ స్థలం 369 ఎకరాలు ఉండగా, మరో 700 ఎకరాలను సేకరించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కు అప్పగించాలని నిర్ణయించారు.
‘‘భూసేకరణ పనులు చేపట్టి, భూమిని కేంద్రం ఆధీనంలోని ఏఏఐకు అందజేస్తే వారు విమానాశ్రయం నిర్మాణం కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతోపాటు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు’’ అని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గెడం నగేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
తెలంగాణలో మొదటి దశ కింద ఆదిలాబాద్, వరంగల్ మామునూర్ విమానాశ్రయాల నిర్మాణానికి తాము కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని నగేష్ చెప్పారు. విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలు, డీపీఆర్ తయారు చేయగానే తాము కేంద్రం నుంచి నిధులు సాధిస్తామని ఆయన తెలిపారు.
అధ్యయనం దశలోనే అంతర్గాం విమానాశ్రయం
పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని స్థానిక పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ డిమాండుతో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఈ విమానాశ్రయం నిర్మాణంపై అధ్యయనం చేయాలని కోరుతూ తెలంగాణ రోడ్లు భవనాల శాఖ జీఓఆర్టీ నంబరు 465 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విమానాశ్రయం గురించి అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరుతూ కన్సల్ టెన్సీగా నియమించింది. దీనికి గాను కన్సల్ టెన్సీ రుసుముగా రూ.40.53 లక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకు విడుదల చేసింది. అంతర్గాం విమానాశ్రయం ఏర్పాటు చేసే వరకూ తాను పోరాటం సాగిస్తామని స్థానిక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ చెప్పారు.
కేంద్రమంత్రి సుముఖంగా ఉన్నా బడ్జెట్ లో నిధులేవి?
ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడానికి మామునూర్ విమానాశ్రయాన్ని ఆలస్యం లేకుండా కార్యాచరణ దశకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు ఇటీవల ప్రకటించారు. 2,500 మీటర్ల రన్‌వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, అగ్నిమాపక, భద్రతా సౌకర్యాల కల్పనకు ఏఏఐ నిధులు సమకూరుస్తుందని మత్రి తెలిపారు.పారదర్శకంగా నిర్ణీత సమయంలో భూసేకరణను పూర్తి చేసినందుకు మంత్రి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించారు.విదేశీ ప్రయాణాలు, పౌర విమాన విడిభాగాలపై పన్నులను తగ్గించి పౌర విమానయాన రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని బడ్జెట్ ఇస్తుందని, దీనివల్ల విమానాశ్రయ మౌలిక సదుపాయాలను బలోపేతం అవుతుందని మంత్రి రామమోహన్ నాయుడు చెప్పారు. విమానయాన రంగానికి కేంద్రం ప్రోత్సాహమిచ్చినా తెలంగాణ కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి నిధుల ప్రస్థావన బడ్జెట్ లో లేకపోవడం దారుణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు.
ప్రజలు ఎదురు చూస్తున్నారు… భూములు అప్పగించారు… ఫైళ్లు కదిలాయి. అయినా కేంద్ర బడ్జెట్‌లో నిధుల్లేకపోవడం వల్ల మామునూర్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు మరోసారి ఆశల జాబితాలోనే నిలిచిపోయాయి. తెలంగాణకు వాయు మార్గాలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది.ప్రాంతీయ విమాన కనెక్టివిటీపై కేంద్రం ప్రకటిస్తున్న విధానాలు, తెలంగాణ విషయంలో బడ్జెట్ నిర్ణయాల్లో మాత్రం ప్రతిఫలించలేదు.డీపీఆర్‌లు, మాస్టర్ ప్లాన్‌ల దశకు వెళ్లిన తర్వాతైనా నిధులు కేటాయిస్తారా? లేక తెలంగాణ విమానాశ్రయాల అంశం మరోసారి ఫైళ్లకే పరిమితమవుతుందా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి.
Next Story

