రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రుల కమిటీ సమావేశం..
x

రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రుల కమిటీ సమావేశం..

తమ డిమాండ్లను ఆమోదించాలంటూ ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం తరుపున ముగ్గురు కేంద్ర మంత్రుల కమిటీ ఈ రోజు సాయంత్రం చర్చలు జరపనుంది.


రైతుల ఆందోళనతో కేంద్రం దొగొచ్చింది. తమ డిమాండ్లను ఆమోదించాలంటూ ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం తరుపున ముగ్గురు మంత్రుల కమిటీ ఈ రోజు సాయంత్రం చర్చలు జరపనుంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ కమిటీ సభ్యులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపాలని రైతు సంఘాల నాయకులు కోరారు.

శాంతియుత నిరసనకు అనుమతించాలి..

గురువారం శంభు సరిహద్దు ప్రాంతంలో ‘కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ’ ప్రధాన కార్యదర్శి శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించకపోతే శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు అనుమతించాలన్నారు.

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు..

పంజాబ్‌-హరియాణా సరిహద్దుల్లో రైతులపై పోలీసు ప్రత్యేక బలగాలు బాష్ప వాయువును ప్రయోగించడాన్ని పంథేర్‌ ఖండించారు. ‘‘ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా వెనక్కి పంపాలని చూస్తోంది. అందువల్లే ఈ ప్రాంతంలో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మా డిమాండ్లు నెరవేరే వరకు వెనుదిరిగే ప్రసక్తేలేదు’’ అని పంధేర్‌ తెలిపారు.

ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత..

పంటకు కనీస మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని రైతు సంఘాలు ‘ ఢిల్లీ చలో’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీంతో పంజాబ్‌ నుంచి రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నారు. గత ఘటనల దృష్ట్యా, వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు, కాంక్రీట్‌ దిమ్మెలను అడ్డంగా ఉంచారు. వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు టియర్‌ గ్యాస్‌, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు చండీగఢ్‌లో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయెల్‌, అర్జున్‌ ముండా, నిత్యానంద్‌ రాయ్‌ రైతు సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు.

రైతుల డిమాండ్లు ఇవి..

పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో పాటు, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పెన్షన్లు, వ్యవసాయ రుణమాఫీ, పోలీసు కేసుల ఉపసంహరణ, లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read More
Next Story