నల్గొండ కాంగ్రెస్‌పై కన్పించని రేవంత్ మార్క్
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటినా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్ పట్టు సాధించలేకపోతున్నారు.
- ఫెడరల్ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ఇంకా కన్పించడం లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటినా.. నల్లగొండ కాంగ్రెస్‌పై పట్టు మాత్రం సాధించలేకపోతుండడం గమనార్హం. నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తోన్న కుందూరు జానారెడ్డి, నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి సీఎం రేవంత్‌కు పొలిటికల్ సెగలు ఎప్పటికప్పుడు తాకుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం.. నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలతో విభేధాలు రాకుండా ఉండేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. నిజానికి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదట్లో రేవంత్ రెడ్డి తనకంటూ సొంత వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత, అద్దంకి దయాకర్ తదితర నేతలను రేవంత్‌రెడ్డి ప్రోత్సహించుకుంటూ వచ్చారు. సదరు నేతలు సైతం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.
రేవంత్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన సీనియర్లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేవంత్ రెడ్డి తన వర్గాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. పక్కా వ్యుహాంతో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలపై తమ పెత్తనమే కొనసాగేలా పావులు కదిపి విజయం సాధించారు. ఒకనొక దశలో రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అడుగు పెట్టేందుకు తమ అనుమతి తీసుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన నేతలకు తమదైన శైలిలో చెక్ పెట్టడంలో సఫలీకృతమయ్యారనే చెప్పాలి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే పటేల్ రమేశ్‌రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట సీటు, అద్దంకి దయాకర్‌కు సైతం తుంగతుర్తి టికెట్ దక్కకుండా చేయడంలో అధిష్ఠానం వద్ద చక్రం తిప్పారనే ప్రచారం లేకపోలేదు. ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులోనూ రేవంత్ వర్గానికి చెక్ పెట్టేలా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అనుచర గణానికి నల్లగొండ, భువనగిరి ఎంపీ సీట్లు దక్కకుండా చేసేందుకు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యుహాలకు పదునుపెట్టారు.
తిప్పికొట్టే ప్రయత్నంలో రేవంత్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల కదలికలను ముందస్తుగానే పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరులకు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే అద్దంకి దయాకర్‌కు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం అవకాశం కల్పించేందుకు ప్లాన్ చేశారని సమాచారం. అందులో భాగంగానే వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించారని తెలుస్తోంది. రాజయ్యను పక్కకు తప్పించడంతో అద్దంకి దయాకర్‌కు గ్రౌండ్ లెవల్‌లో కొంతమేర అడ్డంకి తొలిగిపోయిందనే చెప్పాలి. మరోవైపు నల్లగొండ ఎంపీ స్థానం జానారెడ్డి పెద్దకొడుకు రఘువీర్‌రెడ్డికి, భువనగిరి ఎంపీ సీటును కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి పవన్‌కుమార్‌రెడ్డికి కట్టబెట్టాలనే వ్యుహాంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో అవకాశం కోసం ఏకంగా 16 మంది కాంగ్రెస్ నేతలు టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సీఎం రేవంత్ దీన్ని తిప్పికొట్టేందుకు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బరిలోకి దించాలనే ప్రతిపాదన చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇదిలావుంటే.. బీఆర్ఎస్ నుంచి నల్లగొండ లోక్‌సభకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 11 గెలుచుకోగా, బీఆర్ఎస్ మాత్రం ఒక్క సీటును మాత్రమే దక్కించుకుంది. కాంగ్రెస్ తిరిగి పూర్వవైభవం సాధించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిందనడంలో సందేహం లేదు.