ప్రభుత్వ ఉద్యోగుల సర్కార్ స్వీట్ న్యూస్
x

ప్రభుత్వ ఉద్యోగుల సర్కార్ స్వీట్ న్యూస్

పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త ఈవీ విధానంతో జీరో టాక్స్, రిజిస్ట్రేషన్ మినహాయింపులు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం.


పర్యావరణ రక్షణకు పెద్ద అడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలపై 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ కల్పించే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలులో భాగంగా, సచివాలయం ముందు ఏర్పాటు చేసిన ఈవీ వాహనాల ప్రదర్శనను ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మహేంద్ర ఎలెక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా వంటి కంపెనీలు ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌లో రాకూడదనే ఉద్దేశంతో ఈవీ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విధానం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో రోడ్ టాక్స్, జీరో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపుగా ఇస్తున్నారు.

ఈ రాయితీల వల్ల ప్రభుత్వానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం తగ్గే అవకాశమున్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యం ఇచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇకపై ప్రభుత్వ శాఖలు వాహనాలు కొనుగోలు చేసినా, అద్దెకు తీసుకున్నా తప్పనిసరిగా ఈవీలే ఉండాలని ముఖ్యమంత్రి సూచించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నగరంలోని కోర్ ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వివరించారు.

ప్రజల్లో ఈ పథకాలను విస్తరించేందుకు ఉద్యోగులే ముఖ్య పాత్ర పోషిస్తారని, అందుకే వారు ముందుగా ఈవీ వాహనాలను బుక్ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాన కార్యదర్శి తెలిపారు. హైదరాబాద్‌లో జనాభా అధికంగా ఉండటంతో గాలి నాణ్యతను కాపాడటానికి ఈవీల వినియోగం అవసరమని పేర్కొన్నారు.

సుమారు 2 వేల కిలోమీటర్ల కోర్ ఏరియాను కాలుష్య రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెడ్కో ద్వారా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రవాణా శాఖలో సంస్కరణలతో షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను స్క్రాపేజీకి పంపిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ప్రోత్సాహకాలను ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Read More
Next Story