హైదరాబాద్ నగరానికి మరో పచ్చని ఊపిరి అందించేందుకు కీలక అడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదాల్లో చిక్కుకున్న గుర్రంగూడ అటవీ ప్రాంతానికి తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వ్ ఫారెస్ట్ హోదా కల్పించింది.హైదరాబాద్ నగర శివార్లలోని గుర్రంగూడలో కొత్తగా అర్బన్ ఫారెస్ట్ పార్కు రానుంది.
ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదాల్లో చిక్కుకున్న అమంగల్ డివిజన్ పరిధిలోని గుర్రం గూడ అటవీ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. మొత్తం 424 ఎకరాలు 31 గుంటల విస్తీర్ణం గల ఈ అటవీ భూభాగాన్ని తెలంగాణ ఫారెస్ట్ చట్టం–1967లోని సెక్షన్ 15 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తిస్తూ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ జీఓ ఎంఎస్ నంబరు 7 (తేదీ: 09-03-2026) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయి, అటవీ భూములకు అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్ హోదా లభించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డాక్టర్ సీ.సువర్ణ తెలిపారు. ఈ నిర్ణయంతో ఆ అటవీ భూములకు మరింత బలమైన చట్టపరమైన రక్షణ లభించనుందన్నారు.
సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నంబర్ 201/1లోని 102 ఎకరాలు చాలా కాలంగా న్యాయ వివాదంలో ఉన్నాయని సాహెబ్‌నగర్ కలాన్ కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ వ్యవహారం దీర్ఘకాలం పాటు వివిధ న్యాయస్థానాల్లో విచారణకు రాగా అటవీ అధికారుల కృషి, ప్రభుత్వ మద్దతువల్ల చివరకు అటవీ శాఖ వాదనను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని, హైదరాబాద్ నగరంలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో పచ్చని ప్రదేశాల అవసరం పెరుగుతున్న పరిస్థితిలో ఈ పార్క్ నగర ప్రజలకు ముఖ్యమైన గ్రీన్ స్పేస్‌గా మారనుందన్నారు.
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు, కుటుంబాలతో కలిసి విశ్రాంతి తీసుకునేందుకు ప్రజలకు అనువైన ప్రదేశంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు సువర్ణ తెలిపారు.హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులు, గ్రీన్ లంగ్ స్పేస్‌లను విస్తరించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆమె పేర్కొన్నారు. గుర్రం గూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడం కూడా ఆ దిశలో తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొన్నారు.
ఆరు అర్బన్ పార్కుల అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రంలోని నగర్ వన్ యోజన పథకం కింద ఆరు అర్బన్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల,యాల్గోర్ 2, మంచిర్యాల జిల్లాలోని ఇందారం, చెన్నూర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట్, చెంగిచర్లలో అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరాల్లో పచ్చదనాన్ని పెంచి పర్యవరణ సమతుల్యతను కాపాడనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.8.26 కోట్లను మంజూరు చేసింది. దీంతోపాటు వికారాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పార్కులను నిర్మించాలని నిర్ణయించారు.
నగరీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పచ్చని ప్రదేశాల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడం నగరానికి పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చెందనున్న ఈ ప్రాంతం నగర ప్రజలకు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే హరిత విహార స్థలంగా మారనుంది.