యూపీలో తొక్కిసలాట - 50 మంది మృతి
x

యూపీలో తొక్కిసలాట - 50 మంది మృతి

ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 50 మందికి పైగా చనిపోయారు. మతపరమైన కార్యక్రమం (సత్సంగ్) ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది.


ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 50 మందికి పైగా చనిపోయారు. మంగళవారం పుల్రాయి గ్రామంలో మతపరమైన కార్యక్రమం (సత్సంగ్) ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. " ఇటా ఆసుపత్రికి ఇరవై ఏడు మృతదేహాలు చేరుకున్నాయి. మృతుల్లో 23 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు, ఒక పురుషుడు ఉన్నారు." అని చెప్పారు.

అయితే ఈ ఘటనలో 50 నుంచి 60 మంది చనిపోయినట్లు భావిస్తున్నారు. చనిపోయిన, అపస్మారక స్థితిలో బాధితులను ట్రక్కులు, ఇతర వాహనాల్లో సికందరరావు ట్రామా సెంటర్‌కు తీసుకువచ్చారు.

'సత్సంగం' ముగిశాక బయటకు వస్తుండగా ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి శకుంతలా దేవి తెలిపారు. రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు సికిందరావు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఆశిష్ కుమార్ తెలిపారు.

ఆగ్రా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలీఘర్ డివిజనల్ కమిషనర్‌తో కూడిన బృందం ఘటనపై దర్యాప్తు చేస్తోంది.

మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి..

తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సానుభూతి తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

కార్యక్రమం నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదిత్యనాథ్ ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మెరుగైన వైద్యం అందించాలి..

తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్ సంతాపం తెలిపింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సానుభూతి తెలిపారు.

"ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి .గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. బాధితులకు వెంటనే పరిహారం అందించాలి.’’ అని ఖర్గే అన్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read More
Next Story