
‘వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలి’
ఒపిడిఆర్ డిమాండ్
ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన భూములలో పేదలు నిర్మించుకున్న వినోబా నవోదయ కాలనీ కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన వారందరికి అదే స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (ఒపిడిఆర్) నేతలు డాక్టర్. జతిన్ కుమార్ (ఉపాధ్యక్షుడు)డీ. విజయందర్, (సెక్రటరీ) ఒక ప్రకటనలో కోరారు.
అసలేం జరిగింది?
ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన భూములలో పేదలు నిర్మించుకున్న వినోబా నవోదయ కాలనీని ఫిబ్రవరి 24 తేదీన ఈ ప్రభుత్వం నేలమట్టం చేసింది. 2014 నుండి భూదాన బోర్డు అనుమతి పత్రాలు వున్నవాళ్ళు సుమారు 1950 మంది వున్నారు, అక్కడ ఏదోఒక స్తాయిలో ఇల్లు నిర్మించుకున్నవారు 950 మంది వున్నారు. 62 ఎకరాల 7 గుంటల భూదాన భూమిలో ప్రస్తుతం కాలనీ ఆధీనంలో వున్నది 31 ఎకరాలు మాత్రమే. డానిలో 10 ఎకరాలు పాఠశాలకు కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. 24 వ తేదీన తాము కూల్చిన నివాసాలు 630 వుంటాయని ఆనాడు అధికారులు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 24-02-2026 న ఇళ్లను నేలమట్టం చేసి అక్కడ అనేక సంవత్స రాలుగా నివసిస్తున్న వందలాది పేద ప్రజలను వీధుల పాలు చేశారు.
కాలనీ వాసుల పోరాటం
ఇలా నిరాశ్రయులైన ప్రజలను పరామర్శించిన వారెందరో ఇల్లు కోల్పోయిన వారందరికీ అదే స్థలంలో ఇళ్ళు కట్టించిఇవ్వాలని, వారి న్యాయమైన హక్కులను రక్షించాలని చెప్పారు. కొన్నిరాజకీయ పక్షాలు, పత్రికా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు కూడా ఇదే కోరికను వెలిబుచ్చారు. అసలు ఆ కాలనీవాసులయితే ప్రాణంపోయినా ఆ స్థలం వదులుకోమనీ, అక్కడే తిరిగి తమకు నివాసం కల్పించాలని గట్టి పట్టుదలతో వున్నారు. తాత్కాలిక వసతి నుండి కూడా వారిని ఖాళీ చేయించాలని చూస్తే ప్రతిఘటించారు. ధర్నాలు, రస్థా రోకోలు చేశారు. తమ స్థలాలలోనే తమకు ఇళ్ళు కట్టించాలని గట్టిగా కోరుతున్నారు. వారి సంఘ నాయకులను అవినీతి ఆరోపణ లలో ఇరికించి అరెస్టులు చేసినా పట్టుదలతో ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఐక్యంగా సంఘంతో కలిసి పోరాడుతున్నారు.
కాంగ్రెస్ కు చెడ్డ పేరు
ప్రతిపక్ష సభ్యులు వెంటనే రంగంలోకి దూకి తమ రాజకీయ వైఖరికి అనుకూలంగా కొన్ని ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాదు నగరంలో హైడ్రా పేరిట జరుపుతున్న కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పేరిట జారీ చేసిన నోటీసులు, కొత్తగా గాంధీ సరోవరం కోసమని మరికొన్ని ఇళ్లవారిని ఖాళీ చేయాలని చెప్పటం తో ఈ ప్రభుత్వాన్ని అందరూ కూలగొట్టే ప్రభుత్వం గా చూస్తున్నారు. మూట గట్టుకుంటున్న అప్రతిష్టను తొలగించుకోవటం కోసం ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని, అన్నిసౌకర్యాలు వున్న చోట ఇస్తామని చెబుతూ వచ్చింది. తన పేరు ప్రతిష్టలకు జరిగిన నష్ట నివారణ చర్యగా హడావుడిగా కొన్ని చర్యలకు పూనుకున్నది.
కాలనీ వాసుల జాబితా నుంచి తొలగింపు
కానీ,’ తన గుణమేల మారు’ అన్నట్లు ఆర్ధిక సర్వే పేరిట కొందరిని ఏరివేసింది. ఆధార్ కార్డుల అడ్రసులతో కొందరిని అనర్హులను చేసింది. తమ భూములలోనే కొత్త ఇల్లు కావాలని కోరుకుంటున్నవారికి మరే ప్రత్యా మ్నాయమూ అంగీకారం కాదని గ్రహించిన ప్రభుత్వం చివరకు తాను పేదల పట్ల ఉదారంగా వుంటానని చెబుతూ నిన్న 311 మందికి అదే భూమిలో ఇండ్ల స్థలాలను కేటాయించి ఇచ్చారు. 101 మందికి వారి గ్రామాలలో ఎక్కడో ఇల్లు మంజూరు చేసినట్లు పత్రాలు ఇచ్చారు. దీనితో ప్రభుత్వం సమస్యను పేదలకు అనుకూలంగా పరిష్క రించినట్లు ప్రచారం చేస్తున్నారు. తమ ప్రయత్నాల వల్లే ఈ విజయం సాధించామని కొందరు చెప్పుకుంటున్నారు. కానీ పేదల సంఘం నాయకత్వంలో గత పదిసంవత్సరాల ప్రజల పోరాటం ,మొక్కవోని వారి పట్టుదల,ఈ విపత్కర స్థితిలో కూడా వారు ప్రదర్శించిన ధైర్యమే దీనికి ప్రధాన కారణం.
అందరికీ భూమి కేటాయించలేదు
అయితే రాజకీయ ప్రతిష్ట నిలబెట్టుకోవటం కోసం తీసుకున్న నిర్ణయాలతో ఇచ్చినందున 2018 నుండి ఆ స్థలాలలో ఇండ్లు నిర్మిచుకొని నివాసం ఉంటున్న వారందరికీ ఇప్పుడు భూమి కేటాయించలేదు. న్యాయంగా వారికున్న హక్కును గౌరవించలేదు. అంతేకాదు ఇంతకు ముందు అక్కడ నివాసం లేనివారు కూడా తాము ఇల్లు కోల్పోయినట్లు నమోదు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి బహుశా వారు రాజకీయ నాయకుల అనుచరులో, అధికారుల వత్తాసు పొందినవారో అయివుంటారు. ఈ కాలనీ వాసులు ఎన్నో సంవత్సరాలుగా సరయిన సర్వే చేసి హద్దులు నిర్ణయించి భూదాన బోర్డు ఆర్డర్లను అమలు చేయమని తమ స్థలాలు తమకు నిర్ధారించమని పదే పదే అడుగుతూ వచ్చారు. అప్పుడు వారిని రెగ్యులరైజ్ చేయకుండా ఇప్పుడు కొద్ది రోజులలోనే సర్వే పూర్తి చేసి స్థలాలు కేటాయించడం ఆశ్చర్యంగా లేదూ? బూటకపు సర్వేలు, దొంగ సాక్ష్యాలు ఆపి ఇల్లు కోల్పోయిన అందరికీ అక్కడ నివాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దీన్ని వొదిలివేసి అరకొరగా కొందరికి స్థలాలు కేటాయిస్తే చేసిన పాపం పోదు. అనుమతి పత్రాలు వున్న అందరికీ స్థలాలు కేటాయించాలి అన్యాక్రాంతమైన భూదాన భూమిని [మొత్తం 62 ఎకరాల 7 గుంటలు] సర్వే చేసి ఇప్పుడు వున్న వారితో సహా ఇతర పేదలకు అక్కడ నివాస గృహాలు కట్టించి ఇవ్వాలి. ఇలా చేయకుండా అక్రమాలు, భూమాఫియా అంటూ ప్రభుత్వమూ, దాని ఏజoట్లు కట్టు కథలు చెప్పటంవల్ల ఇళ్లు కూల్చిన అధికార నేరం మాసిపోదు. వారికి సమర్ధన దొరక బోదు. అందుకే ఇప్పటికైనా కొత్త పొరపాట్లు, కుట్రలు చేయకుండా ఇళ్ళు కోల్పోయిన అందరికి స్థలం కేటాయించి నివాసం నిర్మించి ఇవ్వాలి.
ఈ లోగా వెంటనే సముచిత నష్ట పరిహారం చెల్లించి నిర్వాసితులకు ఊరట కల్గిo చాలని, వారిపై అరెస్టులు, నిర్భంధాలు ఆపివేయాలని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి అని ఓపిడిఆర్ డిమాండ్ చేసింది.

