
విజయశాంతి ఫోన్, ల్యాప్ టాప్ తెరుచుకోవటంలేదా ?
ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను క్రైం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు.
జనవరి 31వ తేదీన మేడ్చల్ జిల్లా చర్లపల్లి-ఘట్ కేశర్ మధ్య గూడ్స్ రైల్ కింద ఇద్దర పిల్లలతో విజయశాంతిరెడ్డి ఆత్మహత్య(Vijaya santhi Suicide) కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఆర్ధిక సమస్యలు లేవు, కుటుంబంలో ఎలాంటి కలతలు లేవు. అనారోగ్య సమస్యలా అంటే అవీలేవు. అత్త, మామల పోరు కూడా లేదు. దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటున్న భర్త కూడా తనను బాగానే చూసుకుంటున్నాడు. ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లోనే ఉంది. పిల్లలు చైతన్యారెడ్డి, విశాల్ రెడ్డి ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. అయినా విజయశాంతిరెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది ? అన్నదే అందరినీ ఆలోచింపచేస్తున్న ప్రశ్న.
ఈ నేపధ్యంలోనే పోలీసులు విజయశాంతి ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో, ల్యాప్ టాప్ లో ఏమన్నా సమాచారం లభిస్తుందా అన్న ఆలోచనతోనే పోలీసులు వాటిని తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే పాస్ వర్డ్ చాలా బలంగా ఉన్నకారణంగా ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు తెరవలేకపోయారు. ఎంతగా ప్రయత్నించినా ఉపయోగంలేకపోయింది. విజయశాంతి కుటుంబసభ్యులు, దుబాయ్ నుండి వచ్చిన భర్త సురేంద్రరెడ్డి కూడా ఫోన్, ల్యాప్ టాప్ ను తెరిచేందుకు ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు.
అందుకనే ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను క్రైం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు. ఇక్కడ గనుక మొబైల్, ల్యాప్ టాప్ తెరుచుకుంటే ఏమన్నా సమాచారం దొరుకుతుందేమో అని పోలీసులు ఆలోచిస్తున్నారు. ముంబాయ్ నుండి మృతురాలికి మెసేజులు వచ్చేవని ప్రచారంలో ఉంది. ఆ మెస్సేజులు ఏమిటి ? ఎక్కడనుండి వస్తున్నాయి ? అన్నది కీలకమైన విషయంగా ఉంది. వాటి గుట్టు విప్పేందుకే పోలీసులు మొబైల్, ల్యాప్ టాప్ ను ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపింది. ఇక్కడైనా ఇవి ఓపెన్ అయితే ఆత్మహత్యకు అసలు కారణం బయటపడుతుందేమో చూడాలి.

