జగన్ నాకు తెగనచ్చాడంటున్న కేశినేని
జగన్ తో వేగలేం బాబోయ్ అంటూ అంతా బయటకొస్తుంటే, జగన్ బాబు బాగా ముద్దొస్తున్నాడంటున్నాడు టిడపి ఎంపి కేశినేని. ఎది సత్యం, ఏదసత్యం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోంది. నిన్నటిదాక కత్తులు దూసుకున్న వాళ్లు భుజం భుజం కలిపి తిరుగుతున్నారు. అటోళ్లు ఇటు గోడ దూకుతున్నారు. నిన్నటి పచ్చజెండాలు ఇవాళ వైసీపీ జెండాలవుతున్నారు. వైసీపీ జెండాలు టీడీపీ జెండాలవుతున్నాయి. శత్రువు శత్రువు మిత్రులవుతున్నారు. తిట్టుకున్న నోళ్లు ఇప్పుడు చిరునవ్వులు చిమ్మకుంటున్నాయి. నురగలు కక్కుకుంటూ కృష్ణా తీరం వెంట పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక్కడ సీన్ కట్ చేస్తే...
టీడీపీకి రాం రాం..
తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా చేశారు. వైఎస్ఆర్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా విజయవాడ సమీపంలోని తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు. శాలువా కప్పారు. ఇంకో శాలువా తాను కప్పించుకున్నారు. ఎంపీగా రాజీనామా చేశానని, అది ఆమోదం పొందగానే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని తేల్చి చెప్పారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును చీల్చిచెండాడారు. తెలుగు దేశం పార్టీలో అవమానాలు భరించలేకనే బయటికి వచ్చానన్నారు కేశినేని నాని.
కేశినేని నాని ఏమన్నారంటే...
'2013 జనవరి 16 నుండి విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జ్ అభ్యర్ధిగా కష్టపడుతూ వచ్చాను. చంద్రబాబు 'మీకోసం' పాదయాత్రలో నన్ను ఇన్‌చార్జిగా చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకూ పార్టీ కోసం పనిచేశాను. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జరిగిన పంచాయితీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పోరేషన్, జనరల్ ఎలక్షన్లు అన్నింటినీ నేనే హ్యాండిల్ చేశాను. నా సొంత వ్యాపార సంస్ధ కన్నా తెలుగుదేశం పార్టీ ముఖ్యం అని ఆ పనులు అన్ని చేశాను. అంతకు ముందు బైఎలక్షన్లలో కాంగ్రెస్ నుంచి వచ్చి వైసీపీ తరపున భారీ మెజార్టీతో గెలిచారు.
బాబును నమ్మొద్దని చెప్పినా వినలా...
మా సొంత సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు చంద్రబాబును నమ్మి డబ్బులు ఎందుకు పాడుచేసుకుంటున్నావు హెచ్చరించారు. అయినా పట్టించుకోలేదు. ఆయన గెలుపు కోసమే కృషి చేశాను. పార్టీ కోసమే పని చేశాను. కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జనరల్ ఎలక్షన్‌లో గెలిచాం. అప్పడు ఖర్చు పెట్టన ప్రతి రూపాయి నాదే. గతంలో కూడా నాకు సీటు ఇవ్వనంటే ప్రజలు డిమాండు చేయడంతో ఇచ్చారు. ఎంపీగా అక్రమ సంపాదన కోసం ఆశపడలేదు, వ్యాపారం వదులుకున్నా. పార్టీ కోసం నేను హైదరాబాద్‌లో అమ్ముకున్న ఆస్తుల విలువ నేడు రూ. 2000 కోట్లు ఉంటుంది' అని కేశినేని అన్నారు.
చెప్పుతో కొడతానన్నాడు...
‘పార్టీలో అనేక రకాలుగా నన్ను అవమాన పరిచారు. నేను ఢిల్లీలో ఉన్నాను కార్పొరేషన్ ఎలక్షన్లు ఏం చేస్తున్నావు అని చంద్రబాబు ఫోన్ చేసి అడిగారు. మేయర్ అభ్యర్ధి ఎవరిని పెడుతున్నారని అన్నారు. నాకు తెలియదని బదులిచ్చాను. బోండా ఉమ భార్యను పెడుతున్నారా అయితే ప్రమాదం.. మీ అమ్మాయిని పెట్టండి అని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు చెప్పారు.. పార్టీ కోసం చెయ్యాలి అని తన కూతురు శ్వేతను బలవంతంగా ఒప్పించాను. కార్పొరేషన్లు ఎన్నికలకు రెండు రోజులు ముందు కేశినేని నానిని చెప్పుతో కొడతాను అని ఒక నాయకుడు అన్నాడు. అయినప్పటికీ పార్టీనుండి ఎవ్వరూ స్పందనలేదు. వాళ్ల ప్రెస్ మీట్ వల్ల పార్టీ చెల్లా చెదురు అయిపోయింది. సిట్టింగ్ ఎంపిని అయిన నేను లేకుండానే కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు వచ్చారు. పార్టీ అధ్యక్షుడు పార్టీ ఎంపీని ప్రోటోకాల్‌కు విరుద్దంగా ప్రచారానికి రావద్దన్నారు. అయినా బరించాను. వారికి ఇష్టం లేకపోతే తప్పుకుంటాను అని కూడా చెప్పాను. అందుకు అంగీకరించకపోగా.. ఎంపీగా నువ్వే ఉండాలని చంద్రబాబు అందరి ముందే అన్నారు' అని కేశినేని నాని గుర్తు చేశారు.
6 సీట్లలో కమ్మోళ్లే పోటీ చేస్తారు...
'ఇప్పుడు నా కుటుంబ సభ్యులకు ఎంపీ సీట్లు కావాలనుకుంటున్నారు. అందులో తప్పులేదు. కానీ, టీడీపీలో 6 ఎంపీ సీట్లు కమ్మ వర్గం వారే పోటీ చేస్తారు. అక్కడ ఇవ్వచ్చుగా. నాకు తెలియకుండా ఇక్కడ ఎలా హమీ ఇస్తారు. ఆలపాటి రాజా, నెట్టెం రఘరాం, కొనకళ్ళ నారాయణను నా దగ్గరకు పంపారు. తిరువూరు సభ విషయంలో నాని ఎందుకు కల్పించుకున్నారని లోకేష్ అడిగారని వారు చెప్పారు. ఆ రోజు రౌడీ మూకలతో కలిసి నన్ను కొట్టించాలని అనుకున్నారు. తొమ్మిదిన్నర ఏళ్ళలో పార్టీకి నేను చేసిన ద్రోహం ఏంటి? మీరు జైల్లో ఉంటే మీకు, మీ కుటుంబానికి నేను అండగా నిలబడలేదా?’ అని అన్నారు.
స్పీకర్‌కు రాజీనామా లేఖ..
'నా ఎంపీ పదవికి రాజీనామా లేఖను మెయిల్ ద్వారా లోక్‌సభ స్పీకర్‌కు పంపుతాను. రాజీనామాకు ఆమోదం లభించిన వెంటనే వైసీపీలో చేరుతాను. విజయవాడకు సీఎం వచ్చిన ప్రతిసారి నేను అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే, పార్టీ ఆదేశం మేరకు వెళ్లలేదు. జగన్ పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి, అభివృద్ధి లేకపోవడానికి కారణం కొవిడ్. జగన్ నాకు బాగా నచ్చాడు.. నా రాజీనామా అమోదించగానే పార్టీలో చేరుతా' అని స్పష్టం చేశారు.
విజయవాడ అంటే పిచ్చి..
'విజయవాడ అంటే నాకు పిచ్చి ప్రేమ. నేను ఎప్పుడూ చంద్రబాబును టికెట్ అడగలేదు. విమానాశ్రయం కూడా నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టాలనుకున్నారు. ఎయిర్‌పోర్టు విషయంలో వెంకయ్యనాయుడు నన్ను సపోర్ట్ చేశారు. విజయవాడ కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ. 100 కోట్లు కూడా ఇవ్వలేదు. విజయవాడకు వచ్చిన అభివృద్ధి పనులున్నీ కేంద్రం నుంచి నేను తీసుకువచ్చాను. విజయవాడ ఓ నిజం అమరావతి ఓ కల. దాన్ని నిజం చేయడానికి సమయం పడుతుంది అని చెపుతున్నా. చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్, బెంగుళూరు, ముంబాయిని వదిలి అమరావతికి ఎందుకు వస్తారు అని చెప్పాను' అని అన్నారు కేశినేని నాని.