లోకల్ ఐస్‌క్రీమ్స్‌ బ్యాన్ చేస్తున్న గ్రామాలు
x
Local Ice creams banned in some villages in Nirmal Dt

లోకల్ ఐస్‌క్రీమ్స్‌ బ్యాన్ చేస్తున్న గ్రామాలు

లోకల్ ఐస్‌క్రీములను అమ్మేందుకు లేదు తినేందుకు లేదని గ్రామాల పంచాయతీలు తీర్మానాలు చేశాయి


లోకల్ ఐస్ క్రీములను గ్రామాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లోకల్ ఐస్ క్రీములను తమ గ్రామాల్లో అమ్మకానికి అనుమతించేదిలేదంటు నిర్మల్ జిల్లాలోని కొన్ని గ్రామాలపంచాయతీలు తీర్మానించటం సంచలనంగా మారింది. తీర్మానించటమే కాకుండా ఈమేరకు గ్రామాల్లో పెద్ద బ్యానర్లు, పోస్టర్లను పంచాయతీలు ఏర్పాటు చేశాయి. తమ గ్రామాల్లోకి ఐస్ క్రీములు అమ్మటానికి వస్తే రు. 5 వేలు జరిమానా చెల్లించాల్సిందే అని రాసివున్న పెద్ద బ్యానర్లు పొట్లపల్లి, గొల్లమాడ గ్రామాల్లో వెలిసాయి. అయితే ఐస్‌క్రీముల అమ్మకాలపై గ్రామాల్లో నిషేధించటం నిబంధనలకు విరుద్ధమంటు కొన్ని గ్రామాల్లో ఏర్పాటుచేసిన బ్యానర్లు, పోస్టర్లను అధికారులు తీయించేస్తున్నారు.

ఇపుడు విషయం ఏమిటంటే ఎండకాలం వస్తోందంటేనే పిల్లలు, పెద్దలు తేడాలేకుండా ఐస్ క్రీములు తినాలని అనుకుంటారు. అయితే ఐస్ క్రీములను తినటం వల్ల కొందరు పిల్లలు, పెద్దలు అనారోగ్యం బారినపడుతున్నారు. దీనికి కారణాలను గమనించిన కొందరు గ్రామస్తులు లోకల్‌ ఐస్‌క్రీములను తినటంవల్లే జనాలు అనారోగ్యాల బారినపడుతున్నట్లు తీర్మానించారు. ఇదేవిషయాన్ని గొల్లమాడ సర్పంచ్ చెన్నవసంతతో పాటు మరికొన్ని గ్రామాల్లోని సర్పంచుల దృష్టికి ఆయా గ్రామాల ప్రజలు తీసుకెళ్ళారు. దాంతో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలతో చర్చించి లోకల్ ఐస్‌క్రీములను అమ్మేందుకు లేదు తినేందుకు లేదని గ్రామాల పంచాయతీలు తీర్మానాలు చేశాయి.

ఈవిషయం జనాలందరికీ తెలిసేట్లుగా గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటుచేశారు. ఎప్పుడైతే లోకల్ ఐస్ క్రీములకు వ్యతిరేకంగా బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటయ్యాయో వెంటనే ఈ విషయం సంచలనంగా మారింది. పెంబి మండలంకేంద్రంతో పాటు మందపల్లి, లోకేశ్వరం, దిలావర్ పూర్, గుండంపల్లి, నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ, లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్, పీచర, పొట్టపల్లి, ధర్మారం, కండెం, సారంగాపూర్, ఖానాపూర్ పంచాయతీల్లో లోకల్ ఐస్ క్రీములను బ్యాన్ చేశారు.

లోకల్ ఐస్‌క్రీములు తినటంవల్ల సమస్యలు ఏమిటంటే హానికర రంగులు, రసాయనాలతో తయారు అవుతున్నాయని అనుమానిస్తున్నారు. అందుకనే లోకల్ ఐస్‌క్రీములు గ్రామాల్లోకి రాకుండా నిర్మల్ జిల్లాలోని సుమారు 20 గ్రామపంచాయతీల్లో తీర్మానాలు చేశారు. లోకల్ ఐస్ క్రీములను తిన్న ఒకటి, రెండు రోజులకే దగ్గు, జలుబు మొదలై చివరకు జ్వరాల్లోకి దిగుతున్నాయని గొల్లమాడ సర్పంచ్ వసంత భర్త లక్ష్మణ్ తెలంగాణ ఫెడరల్ కు చెప్పారు. ఐస్ క్రీములు తిన్న తర్వాత తమ పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరాలు వస్తున్నట్లు కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేయటం వల్లే పంచాతీలో చర్చించినట్లు తెలిపారు. అందుకనే తమగ్రామంలో లోకల్ ఐస్‌క్రీముల అమ్మకాలను బ్యాన్ చేస్తు పంచాయతీ తీర్మానం చేసినట్లు వివరించారు.

అలాగే మరోవ్యక్తి రాజేందర్ మాట్లాడుతు తమగ్రామంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను విలేజ్ సెక్రటరీ తీయించేసినట్లు చెప్పారు. ఎందుకంటే లోకల్ ఐస్‌క్రీముల అమ్మకాలను నిషేధించేలా నిబంధనలు ఏమీలేవని తమతో సెక్రటరీ చెప్పారు అని రాజేందర్ తెలిపారు. ప్రభుత్వంతో సంబంధంలేకుండా గ్రామపంచాయతీలే లోకల్ ఐస్ క్రీముల అమ్మకాలను నిషేధించటం చట్టవిరుద్ధమని చెప్పారు అని తెలిపారు. అందుకనే ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు వివరించారు.

Read More
Next Story