పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు..
x

పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు..

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.


లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సంఘం (EC), పశ్చిమ బెంగాల్ గవర్నర్ CV ఆనంద బోస్.. కోల్‌కతా రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన పీస్ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ మూడు నియోజకవర్గాలైన కూచ్ బెహార్, అలీపుర్‌దువార్, జల్‌పైగురి నుంచి ఫిర్యాదులందాయి. అయితే ఈసారి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చాలా తక్కువ అని బోస్ మీడియాకు తెలిపారు.

కూచ్ బెహర్..

ఓటింగ్ ప్రారంభమైన గంటలోపే కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గంలోని దిన్‌హటాలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బూత్ ప్రెసిడెంట్ నివాసం నుంచి బాంబు దొరికింది. మరో ఘటనలో అదే నియోజకవర్గంలోని సీతాయ్ వద్ద తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పోలింగ్ క్యాంపుపై బిజెపి కార్యకర్తలు దాడి చేశారు. ఇంకో ఘటనలో చందమారిలో టిఎంసి మద్దతుదారులు బిజెపి కార్యకర్తలపై రాళ్లతో కొట్టడంతో బిజెపి బూత్ ప్రెసిడెంట్ గాయపడ్డారు.

గాయపడ్డ టీఎంసీ నాయకుడు..

బిజెపి కార్యకర్తలు దాడి చేయడంతో దిన్హటాలో ఒక టిఎంసి బ్లాక్ ప్రెసిడెంట్ గాయపడ్డాడు. కూచ్ బెహార్‌లోని తుఫాన్‌గంజ్‌లో టిఎంసి తాత్కాలిక ఎన్నికల కార్యాలయానికి బిజెపి కార్యకర్తలు నిప్పు పెట్టారు. పొరుగున ఉన్న అలీపుర్‌దూర్ నియోజకవర్గంలో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది, బిజెపి నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారని, బీజేపీకి ఓటు వేయమని బలవంతం చేశారని టిఎంసి ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

ఎన్నికల హింస, ఓటరు బెదిరింపులు, ఎన్నికల ఏజెంట్లపై దాడులకు సంబంధించి బీజేపీ 39 ఫిర్యాదులు చేయగా, టీఎంసీ ఈసీకి 80 ఫిర్యాదులు చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని మూడు నియోజకవర్గాల నుంచి మొత్తం 150కి పైగా ఫిర్యాదులు ఈసీకి అందాయి. కొన్నింటిని మినహాయిస్తే, చాలా ఫిర్యాదులు కూచ్ బెహార్ నుండి వచ్చినట్లు EC వర్గాలు తెలిపాయి.

మణిపూర్‌లో అశాంతి..

మణిపూర్‌లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్నర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని మొయిరాంగ్ ప్రాంతంలోని థమన్‌పోక్పిలోని పోలింగ్ బూత్ సమీపంలో శుక్రవారం తుపాకీ కాల్పుల శబ్దంతో సమస్యాత్మక రాష్ట్రంలో ఓటింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పరుగులు తీయడంతో భయాందోళనలు వ్యాపించాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

భారీ పోలింగ్..

బీజేపీకి సపోర్టుగా ఉన్నఅక్రమార్కులు ఓటర్లను బెదిరిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.చెదురుమదురు హింసాత్మక సంఘటనలు జరిగినా, రెండు రాష్ట్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకు భారీ పోలింగ్ జరిగింది.

Read More
Next Story