ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో తెలంగాణకు చెందిన 15లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తమ వారు ఎలా ఉన్నారోనని తెలంగాణలోని వారి కుటుంబసభ్యులు, బంధువులు ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఆరా తీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు 90 లక్షలమంది పనిచేస్తుండగా, ఇందులో తెలంగాణ పౌరులే 15లక్షల మంది ఉన్నారు. ఇందులోనూ 5లక్షల మంది హైదరాబాద్ కు చెందిన వారున్నారు. యుద్ధం ప్రారంభంతో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మన వాళ్లు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. తమ వారు క్షేమంగా ఉండాలని కోరుతూ వారి కుటుంబసభ్యులు ప్రార్థనలు చేస్తున్నారు. యుద్ధం వల్ల విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వారు తిరిగి స్వదేశానికి వచ్చే మార్గం లేక ఆందోళన చెందుతున్నారు.
యుద్ధభయంతో ఇళ్లకే పరిమితం అయిన కార్మికులు
గల్ఫ్ దేశాల్లో యుద్ధంతో పలు సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. దీంతో తెలంగాణకు చెందిన 15లక్షల మంది కార్మికులు యుద్ధ భయంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో కార్యాలయాలు ఎప్పుడు ప్రారంభిస్తారనే కార్మికులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు పనిచేయని రోజులకు తమకు జీతం ఇస్తారా లేదా అని కార్మికులు ఆందోళనలో ఉన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల ఎక్కడి పనులు అక్కడ నిలిచి పోవడంతో కార్మికులు తమ ఉపాధికి ఎక్కడ విఘాతం కలుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఆర్థిక సంక్షోభం
యుద్ధం వల్ల గల్ఫ్ లో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసులు అవస్థలు పడుతున్నారు. యుద్ధం ప్రభావం వల్ల గల్ఫ్ నివాసుల ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం తగ్గవచ్చని ప్రవాసీ వ్యవహారాల నిపుణులు మంద భీంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. యుద్ధం కారణంగా కొందరు తెలంగాణ వాసులు ఉద్యోగాలు కోల్పోయి వారి ఉపాధికి విఘాతం కలిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.ఇన్నాళ్లు గల్ఫ్ దేశాలు సురక్షితమని భావించిన ప్రవాస కార్మికులు ఈ యుద్ధం కారణంగా డ్రోన్ దాడులతో భయాందోళనలు చెందుతున్నారు.
భవిష్యత్ లో భారత కార్మికులకు పెరగనున్న డిమాండ్
యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో పలు భవనాలు నేలమట్టం అవుతున్నందున యుద్ధం ముగిశాక పునర్ నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉందని ప్రవాసీ వ్యవహారాల నిపుణులు మంద భీంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. యుద్ధం అనంతరం భవనాల నిర్మాణ పనులు పెద్దసంఖ్యలో చేపట్టే అవకాశమున్నందున ఇందులో నైపుణ్యమున్న భారత కార్మికులకు యుద్ధం అనంతరం ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని భీంరెడ్డి వివరించారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న భవనాలను పునర్ నిర్మించే అవకాశముందన్నారు. యుద్ధం వల్ల పలు భవనాలు దెబ్బతినడంతో, యుద్ధం ముగిసిన తర్వాత పెద్దఎత్తున పునర్నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది.యుద్ధం అనంతరం నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్న భారత కార్మికులకు డిమాండ్ పెరగవచ్చు.ముఖ్యంగా మేసన్లు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, వెల్డర్లు వంటి వృత్తుల వారికి అవకాశాలు రావచ్చు.అయితే ఇది యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
పెరిగిన విమాన చార్జీలు
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో అంతర్జాతీయ విమాన చార్జీలు ఆకాశన్నంటాయి. యుద్ధ ప్రభావం వల్ల గల్ఫ్ దేశాలైన సౌదీఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, కువైట్,ఒమన్, దుబాయ్,అబుదాబీ, షార్జా, లెబనాన్ దేశాలపై రాకెట్ లాంచర్లు, డ్రోన్లతో భీకర దాడులు సాగుతున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తుండటంతో పలు గల్ఫ్ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశారు. గల్ఫ్ దేశాల విమానాశ్రయాల మూసివేత, గల్ఫ్ మార్గంలో విమాన ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో విమాన చార్జీలకు రెక్కలు వచ్చాయి. న్యూయార్క్, పారిస్, యూకేలకు విమాన చార్జీలు అనూహ్యంగా పెరిగాయి. యుద్ధం కారణంగా గల్ఫ్ మార్గంలో కాకుండా పసిఫిక్ మహా సముద్రం మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో విమాన చార్జీలు పెరిగాయని హైదరాబాద్ నగరానికి చెందిన ట్రావెల్స్ యజమానులు చెబుతున్నారు.
కాన్సులేట్ కార్యాలయాల వద్ద భద్రత పెంపు
యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లోని యూఏఈ కాన్సులేట్ కార్యాలయం వద్ద సాయుధ పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 1లోని అమెరికా కాన్సులేట్ జనరల్ నివాసం వద్ద పోలీసులు పహరా పెంచారు.పాత నగరంలో కొందరు షియా ముస్లింలు ఖమేనీని హతమార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ తీశారు. దీంతో నానక్ రాంగూడలోని అమెరికా కాన్సులేట్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. జీవీకే మాల్ వద్ద ఉన్న ఇమామ్ ఖమేనీ రోడ్డుపై ఉన్న ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు.
తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్
మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ లో భద్రత కట్టుదిట్టం
అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాల వద్ద కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిఘా, భద్రతను పెంచింది. ఇటీవల ఇరాన్‌పై యుఎస్-ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ అనుకూల రాడికల్ ప్రచారకులు, రెచ్చగొట్టే ప్రసంగాలపై నిశితంగా నిఘా ఉంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సలహా జారీ చేసిందని అధికారులు తెలిపారు.ప్రపంచ పరిణామాలు దేశీయ శాంతిభద్రతల సమస్యలను రేకెత్తించకుండా చూసుకోవడానికి అప్రమత్తతను పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ,శాంతి,ప్రశాంతతను కాపాడుకోవడానికి, యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ యొక్క రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు, ఇతర దౌత్య సంస్థల వద్ద భద్రతను బలోపేతం చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.ఇరాన్ అనుకూల రాడికల్ ప్రచారకులపై నిఘా పెట్టాలని ఎంహెచ్ఏ కోరడాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసుల జీవితాల్లో అనిశ్చితిని మిగిల్చాయి. ఉపాధి, భద్రత, స్వదేశానికి తిరుగు ప్రయాణం వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారిన వేళ, ప్రభుత్వాల సమన్వయం, రాయబార కార్యాలయాల చురుకుదనం కీలకంగా మారాయి. యుద్ధ మేఘాలు ఎంతకాలం కమ్ముకుంటాయో తెలియని పరిస్థితుల్లో, ప్రవాసుల భద్రతే మొదటి ప్రాధాన్యంగా మారింది. పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని కుటుంబాలు ఆశాభావంతో ఎదురు చూస్తున్నాయి.