పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం తెలంగాణ పసుపు రైతులపై తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. మూడు వారాల క్రితం క్వింటాల్‌కు రూ.14 వేలకుపైగా పలికిన పసుపు ధర ప్రస్తుతం రూ.9,500కు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిల్చిపోవడంతో పసుపు ధరలు పతనం అయ్యాయి. దీంతో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
పసుపు ధరలు పతనం
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రోజుకు 15వేల నుంచి 20వేల బస్తాల పసుపును రైతులు తీసుకువస్తుంటారు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 20వతేదీన పసుపు క్వింటాల్ ధర అత్యధికంగా 14,500 రూపాయలు పలికింది. మధ్యస్తంగా రూ.13వేల రూపాయలకు పసుపును వ్యాపారులు కొన్నారు. యుద్ధం కారణంగా పసుపు ఎగుమతులు నిలిచిపోవడంతో పసుపు ధరలు పతనం అయ్యాయి.
మార్చి 12వతేదీన నిజామాబాద్ మార్కెట్ లో పసుపు క్వింటాల్ ధర 9,500 రూపాయలకు తగ్గిందని నిజామాబాద్ మార్కెట్ కమిటీ గ్రేడ్ 2 కార్యదర్శి విజయ కిషోర్ శుక్రవారం ఉదయం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కేంద్ర పసుపుబోర్డు ఉన్నా ప్రయోజనమేది?
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరలు తగ్గడం వల్ల జరిగే తీవ్ర నష్టం నుంచి తమను కాపాడాలని పసుపు రైతులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, అది పసుపు ధరలను స్థిరీకరించడంపై దృష్టి సారించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆర్మూర్ ప్రాంత రైతు గంగారెడ్డిని ఛైర్మన్ గా నియమించినా పసుపు రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పసుపు బోర్డు ఏర్పాటై ఏడాది గడచిని పసుపు ధరలను స్థిరీకరించడంపై బోర్డు దృష్టి సారించడం లేదని పసుపు రైతు నాయకుడు తిరుపతిరెడ్డి ఆరోపించారు.
పసుపు ఎగుమతులపై యుధ్ధం దెబ్బ
అమెరికా-ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా గల్ఫ్‌కు పసుపు ఎగుమతులను ప్రభావితం చేసింది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్,కామారెడ్డి కరీంనగర్,జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పసుపు మార్కెట్ ధరలు పడిపోయాయి. యుద్ధం వల్ల పసుపు ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశముందనే భయంతో ధర తగ్గినా విక్రయించేందుకు మార్కెట్ కు పసుపును తరలిస్తూనే ఉన్నారు.
పసుపు ధరలు పెరుగుతాయని ఆశించిన కొంతమంది రైతులు తమ పసుపు నిల్వలను గోదాములకు తరలించారు. అయితే యుద్ధం కారణంగా ఉన్న ధరలే తగ్గుతుండటంతో తమ పసుపు నిల్వలను మార్కెట్ తరలిస్తున్నారని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్ 2 కార్యదర్శి విజయ కిషోర్ చెప్పారు.
పసుపు ఎగుమతులకు ఆటంకాలు లేవు : పసుపు బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి
యుద్ధం కారణంగా పసుపు ఎగుమతులకు ఎలాంటి ఆటంకాలు లేవని నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పసుపు షిప్ లు నిలిచిపోయాయనే సాకు చెప్పి వ్యాపారులు పసుపు ధరలు తగ్గించారని, అది వాస్తవం కాదని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు కల్లబొల్లి కబుర్లు చెప్పి పసుపు ధరలు తగ్గించి రైతులకు నష్టం చేకూరుస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నందున పసుపు పంటకు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని తాము తెలంగాణ మార్కెటింగ్ శాఖను కోరామని గంగారెడ్డి వివరించారు.
పసుపుబోర్డుకు రూ.13కోట్లు
నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటైన పసుపు బోర్డుకు రూ.13 కోట్లను కేంద్రం విడుదల చేసిందని ఛైర్మన్ పల్లె గంగారెడ్డి వెల్లడించారు. ఈ నిధులతో పసుపు రైతులకు సబ్సిడీపై యంత్రపరికరాలు అందిస్తున్నామని చెప్పారు. పసుపు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు పసుపు ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది తమ పసుపు బోర్డుకు రూ.90 కోట్లు కావాలని తాము కోరగా, కేంద్రప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసేందుకు సూచనప్రాయంగా అంగీకరించిందని ఛైర్మన్ గంగారెడ్డి చెప్పారు.
పసుపు ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు రైతులకు ఆశాజ్యోతి అవుతుందనే భావించినా, ధరల స్థిరీకరణలో ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని రైతు సంఘాలు అంటున్నాయి. ఎగుమతులు పునరుద్ధరించి ధరలను నిలబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారు.లేదంటే పసుపు సాగుపై రైతుల ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.