ఎలక్టోరల్ బాండ్ల విషయంలో డీఎంకే, అన్నడీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం
x

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో డీఎంకే, అన్నడీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో తమిళనాడులో ప్రత్యర్థి పార్టీ ఏఐఏడీఎంకే స్టాలిన్ సర్కారును టార్గెట్ చేసింది. పారదర్శకతతో దాతల పేర్లను వెల్లడించామని పట్టుబట్టింది.


ఎలక్టోరల్ బాండ్ల గురించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పార్టీ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మీ పార్టీకి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే.. మీకొచ్చిన విరాళాల గురించి ముందు చెప్పాలంటూ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో తమిళనాడులో ప్రత్యర్థి పార్టీ ఏఐఏడీఎంకే స్టాలిన్ సర్కారును టార్గెట్ చేసింది. పూర్తి పారదర్శకతతో దాతల పేర్లను వెల్లడించామని పట్టుబట్టింది. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ నుంచి డీఎంకేకు రూ.509 కోట్ల విరాళం వచ్చిందన్న విషయం బయటకు పొక్కడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రజల ప్రాణాలు తాకట్టుపెట్టే గ్లాంబ్లింగ్ కంపెనీ నుంచే విరాళాలు పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా డీఎంకే ప్రభుత్వం ఆన్‌లైన్ జూదాన్ని నిషేధిస్తూ బలహీనమైన చట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను ఖండించారు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు. సుదీర్ఘపోరాటం తర్వాత స్టాలిన్ ప్రభుత్వం ఆన్ లైన్ గేమింగ్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించిందన్నారు. గేమింగ్ కంపెనీకి ఎలాంటి రాయితీని ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ గేమింక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించడంలో ఆలస్యానికి కారణం గవర్నరేనని..ఆయనే గేమింగ్ కంపెనీల యజమానులను కలిశారని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే చట్టం అమల్లోకి వచ్చిందని వివరించారు.
బీజేపీ దోపిడీపై పళనిస్వామి నోరు మెదపడం లేదని బాలు విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసిన 30 కంపెనీల్లో 14 కంపెనీలు బీజేపీకి విరాళాలు ఇచ్చాయని, దానిని ఖండించే ధైర్యం పళనిస్వామికి ఉందా? అని ప్రశ్నించారు. ఏఐఏడీఎంకే, బీజేపీ గత ఏడాది విడిపోయాయి. అయితే ఇదంతా "డ్రామా" అని కొట్టిపడేసింది డీఎంకే.
MK స్టాలిన్ ఎలక్టోరల్ బాండ్లను "వైట్ కాలర్ కరప్షన్"గా అభివర్ణించారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బు ప్రభుత్వ ఖజానాకు కాకుండా బిజెపికి చేరిందని పి చిదంబరం పేర్కొన్న విషయాన్ని స్టాలిన్ గుర్తుచేశారు.
Read More
Next Story