
ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం
తృటిలో తప్పించుకున్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పోలీసుల అదుపులో నిందితుడు..
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లాపై కాల్పుల ఘటన కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి జమ్మూలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని రాయల్ పార్క్ వద్ద జరిగిన పెళ్లి కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన బయటకు వస్తుండగా ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురిందర్ చౌదరి, ముఖ్యమంత్రి సలహాదారు నాసిర్ అస్లాం వాని కూడా అక్కడే ఉన్నారు.
అప్రమత్తమయిన భద్రతా సిబ్బంది..
కాల్పులు జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది స్పందించారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనలో ఫరూక్ అబ్దుల్లాకు ఎలాంటి గాయాలు కాలేదు.
నిందితుడు ఎవరు?
నిందితుడిని కమల్ సింగ్ జంవాల్‌గా పోలీసులు గుర్తించారు. 63 ఏళ్ల వయసు ఉన్న జంవాల్ జమ్మూలోని పురాణి మండీ ప్రాంతానికి చెందినవాడు. 20 సంవత్సరాలుగా ఫరూక్ అబ్దుల్లాను లక్ష్యంగా చేసుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని విచారణలో చెప్పినట్లు సమాచారం. నిందితుడు ఉపయోగించిన పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తుపాకీకి లైసెన్స్ ఉన్నట్లు కూడా అధికారులు తెలిపారు.
సీసీటీవీ దృశ్యాలు..
సీసీటీవీ కెమెరా దృశ్యాల్లో నిందితుడు వెనుక నుంచి అబ్దుల్లాకు దగ్గరికి వచ్చి కాల్పులు జరిపినట్లు కనిపించింది. సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రకారం నిందితుడు ఘటన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
बड़ी खबर-
— Narendra Nath Mishra (@iamnarendranath) March 11, 2026
जम्मू में पूर्व मुखमंत्री फारूक अब्दुल्लाह पर एक शादी समारोह में फायरिंग । गोली चली। बाल बाल बचे। डिप्टी सीएम सुरेंद्र चौधरी भी साथ थे।
हमलावर कमल सिंह जामवाल गिरफ्तार! pic.twitter.com/1qkBWGwjho
ఒమర్ అబ్దుల్లా స్పందన..
ఈ ఘటనపై ఫరూక్ అబ్దుల్లా కుమారుడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. “అల్లా దయతో నా తండ్రి ప్రాణాలు నిలిచాయి. ఇది చాలా దగ్గర నుంచి జరిగిన ప్రమాదకర ఘటన” అని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు.
#WATCH | Jammu, J&K: An incident of firing occurred at a function where JKNC chief Farooq Abdullah and Deputy CM Surinder Choudhary were present. One person has been arrested. No injuries have been reported.
— ANI (@ANI) March 11, 2026
CCTV visuals showing the moment when the incident took place. pic.twitter.com/pnoD3f9fRJ
భద్రతా లోపంపై ఆందోళన..
ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురిందర్ చౌదరి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సలహాదారు ఉన్న కార్యక్రమంలో ఒక వ్యక్తి తుపాకీతో లోపలికి రావడం పెద్ద భద్రతా లోపమని ఆయన పేర్కొన్నారు.
కొనసాగుతోన్న దర్యాప్తు ..
పోలీసుల ప్రకారం ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణం కనిపించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

