బెంగుళూరులో మంచినీళ్ల కరువు, వేస్ట్ చేస్తే ఐదు వేల జరిమానా!
x
Pic: UNICEF

బెంగుళూరులో మంచినీళ్ల కరువు, వేస్ట్ చేస్తే ఐదు వేల జరిమానా!

బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. 13,900 బోర్‌వెల్‌లలో 6,900 పనిచేయడం లేదు. తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గత మూడు-నాలుగు దశాబ్దాలలో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును చూడలేదని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సోమవారం (మార్చి 11) అన్నారు.

“గత 30-40 సంవత్సరాలలో మేము ఇంత కరువును చూడలేదు. ఇంతకుముందు కరువు ఉన్నా.. మేము ఇంత పెద్ద సంఖ్యలో కరువు ప్రభావిత ప్రాంతాలును ప్రకటించలేదు, ”అని ఆయన బెంగళూరులో విలేకరులతో అన్నారు.




బెంగళూరులోని 13,900 బోర్‌వెల్‌లలో 6,900 పనిచేయడం లేదు. నీటి ఎద్దడి నివారణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని శివకుమార్ చెప్పారు.

చట్టపరమైన చర్యలు ..

నగర పరిధిలో అనధికారికంగా బోర్‌వెల్‌లు వేసే వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని బెంగళూరు నీటి సరఫరా బోర్డు (BWSSB) తెలిపింది. మార్చి 15 నుండి ప్రజలు తమ దరఖాస్తులను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేయడం ద్వారా బోర్‌వెల్స్ డ్రిల్లింగ్ కు అనుమతి పొందవచ్చని తెలిపింది. అధికారులు స్థల పరిశీలన ఆధారంగా అనుమతి మంజూరు చేస్తారని పేర్కొంది.

భూగర్భ జలాల్లో క్షీణత..

భూగర్భ జలాల మట్టం తగ్గడానికి తగినంత వర్షపు నీరు లేకపోవడమే కారణమని, నగరంలో చాలా బోర్లు ఎండిపోయాయని బోర్డు పేర్కొంది. బోర్‌వెల్‌లను అశాస్త్రీయంగా తవ్వడం వల్ల నగరంలో భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.

అధికారులు సూచించిన చోట మాత్రమే బోర్‌వెల్‌లు వేయాలని, అలా కాకుండా ఇష్టానుసారం వేస్తే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అనవసర అవసరాల కోసం తాగునీటి వినియోగాన్ని బోర్డు నిషేధించిన విషయం తెలిసిందే. వాహనాలను శుభ్రపరచడం, భవనాలు మరియు రోడ్ల నిర్మాణం, వినోద ప్రయోజనాల కోసం మంచినీటిని వినియోగించిన వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరిక కూడా జారీ చేశారు.

మార్చి 7న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మాల్స్‌, సినిమా హాళ్లలో తాగడానికి మాత్రమే మంచినీటిని వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Read More
Next Story