
లొంగుబాటుపై మాటమార్చిన దేవ్ జీ
తాము పోలీసుల ముందు లొంగిపోయామని జరుగుతున్న ప్రచారం తప్పన్నారు
మావోయిస్టుపార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మాటమార్చారు. ఒకరకంగా చెప్పాలంటే లొంగుబాటుపై యూటర్న్ తీసుకున్నారనే చెప్పాలి. లొంగిపోయారని అందరు అనుకుంటున్న మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శుక్రవారం మీడియాతో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మాట్లాడుతు తాము పోలీసులకు లొంగిపోలేదని తమను అరెస్టుచేశారని చేసిన వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాము పోలీసుల ముందు లొంగిపోయామని జరుగుతున్న ప్రచారం తప్పన్నారు. తాము లొంగిపోలేదని పోలీసులు తమను అరెస్టుచేసినట్లు ప్రకటించారు.
మొన్నటి ఫిబ్రవరి నెలలో దేవ్ జీ తో పాటు కేంద్రకమిటి సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, రాష్ట్ర కమిటి సభ్యుడు నర్సింహారెడ్డితో పాటు మరో 25 మంది మావోయిస్టులు డీజీపీ బీ శివధరరెడ్డి ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాము లొంగిపోవటమే కాకుండా తమదగ్గరున్న అత్యంత అధునాతన ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించేశారు. దేవ్ జీ తదితరుల సమక్షంలోనే డీజీపీ మాట్లాడుతు మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రకటించారు. వేదికమీద నుండి మావోయిస్టు అగ్రనేత గణపతిని లొంగిపోవాలని డీజీపీ పిలుపిచ్చారు. ఆరోజు నోరెత్తని దేవ్ జీ ఇన్నిరోజుల తర్వాత తాము లొంగిపోలేదని, అరెస్టు చేశారని చెప్పటంలో అర్ధం ఏమిటి ?
అలాగే గణపతి ఎక్కడున్నారో తమకు తెలీదని అన్నారు. మావోయిస్టుపార్టీ క్షీణించిపోయిందని చెప్పారు. 2023లో సెంట్రల్ కమిటి సమావేశం జరిగిందని, అప్పటినుండి పార్టీకి సరైన దిశానిర్దేశం చేయలేకపోయినట్లు అంగీకరించారు. ఇపుడు విషయం ఏమిటంటే తాము లొంగిపోలేదని, అరెస్టు చేసినట్లు చెప్పాల్సిన అవసరం దేవ్ జీకి ఏమొచ్చింది ? అన్నదే అర్ధంకావటంలేదు.
తమను పోలీసులు అరెస్టుచేశారని దేవ్ జీ అబద్ధం చెప్పినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే నిజంగానే పోలీసులు మావోయిస్టు అగ్రనేతలను అరెస్టులు చేసుంటే కొద్దిరోజుల్లోనే వీరందరినీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అవనిచ్చేవారే కాదు. అరెస్టయిన మావోయిస్టునేతలకు పోలీసులు ఎక్కడైనా రాచమర్యాదలు చేస్తారా ? అరెస్టయిన మావోయిస్టులకు పోలీసుల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మావోయిస్టు నేతలు లొంగిపోయారు కాబట్టే వీళ్ళందరినీ పోలీసులు తమతో పాటు గౌరవంగా కుర్చీల్లో కూర్చోబెట్టి మీడియాతో మాట్లాడారు. అదే అరెస్టు చేసుంటే వీళ్ళందరి మొహాలకు ముసుగులు వేసో వేయకుండానో తమవెనుక పోలీసులు నిలబెట్టేవారే.
ఇంతేకాకుండా కొద్దిరోజుల తర్వాత ముఖ్యమంత్రితో వీళ్ళ భేటీకి డీజీపీ ఎందుకు చొరవతీసుకుంటారు ? నిజంగానే అరెస్టయ్యుంటే మావోయిస్టు నేతలు సీఎంతో భేటీ అయ్యే అవకాశమే ఉండేదికాదు. కాబట్టి ఇక్కడే దేవ్ జీ అబద్ధాలు చెప్పినట్లు అర్ధమైపోతోంది. కాకపోతే లొంగిపోలేదు, అరెస్టు చేశారన్న అబద్ధం ఎందుకు చెప్పారో తెలీటంలేదు.

