అధికారంలోకి వస్తే ఆ నిబంధనను తొలగిస్తాం: శశిథరూర్
సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాకి కాంగ్రెస్ నేత శశిథరూర్ మద్దతు పలికారు.
కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని లబ్దిదారుల జాబితా నుంచి ముస్లింలను మినహాయించే క్లాజ్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వారికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
మన పౌరసత్వంలో మతాన్ని ప్రవేశపెట్టడాన్ని తాము సమర్థించమని చెబుతూనే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నిబంధనను తొలగిస్తామని, తమ మేనిఫెస్టోలో కూడా దీన్ని పొందుపరుస్తామని థరూర్ విలేకరులతో అన్నారు. శశిథరూర్ తిరువనంతపురం స్థానం నుంచి మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ప్రధాన మతాన్ని మినహాయించి, కొన్ని మతాలను పౌరసత్వానికి అర్హులుగా పేర్కొనడం.. NDA ప్రభుత్వ మతపర చర్యగా అభివర్ణించారు.
చాలాకాలంగా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న పొరుగు దేశాల ప్రజలకు పౌరసత్వం పొందడంలో చట్టం సహాయపడుతుందని, ఆ విషయాన్ని నేను స్వాగతిస్తున్నానని చెప్పారు.
“CAA ప్రకారం పొరుగు దేశాల నుంచి ఆశ్రయం పొందుతున్న వారికి ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వం ఉంటుంది. అది మంచి పరిణామం. పొరుగు దేశాల నుంచి పారిపోతున్న వారికి, అక్కడ ఏ కారణం చేతనైనా హింసకు గురైన వారికి మన దేశంలో ఆశ్రయం కల్పించాలి' అని అన్నారు.
2019లో చట్టంగా రూపొందించిన సీఏఏ అమలుకు కేంద్రం సోమవారం ఆమోదం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇస్తామని చట్టం హామీ ఇస్తుంది.