
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. తెలంగాణలో ఆందోళన
ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలతో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల కుటుంబాల్లో కలవరం. శంషాబాద్‌లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం.
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. దాని ప్రభావం తెలంగాణలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణలతో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, కోమ్ నగరాల్లో పలువురు భారతీయ విద్యార్థులు వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ, టోలిచౌకి, మెహిదీపట్నం ప్రాంతాలకు చెందిన విద్యార్థులు షాహిద్ బెహెస్తి యూనివర్సిటీలో చదువుతున్నారు. యుద్ధ పరిస్థితులతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇరాన్ క్షిపణి దాడులు ఇజ్రాయెల్‌తో పాటు దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ దేశాల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. క్షిపణులు పడుతున్న సమయంలో తాము బంకర్లలోకి వెళ్తున్నట్లు ఇజ్రాయెల్‌లోని తెలుగువారు సోషల్ మీడియాలో వీడియోలు పంచుకుంటున్నారు. దుబాయ్‌పై క్షిపణి దాడుల నేపథ్యంలో సినీనటుడు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో ప్రస్తావించారు. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు తాను దుబాయ్‌లోనే చిక్కుకుపోయినట్లు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు.
యుద్ధ ప్రభావం విమాన సర్వీసులపై స్పష్టంగా కనిపించింది. ఆదివారం కువైట్, అబుధాబి, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్ నగరాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 27 అంతర్జాతీయ సర్వీసులు కూడా రద్దయ్యాయి. దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానావ్రయయంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఇక ఖమేనీ హత్యను నిరసిస్తూ పాతబస్తీలోని షియా ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. పురానీ హవేలీ నుంచి దారుల్‌షిఫా గ్రౌండ్ వరకు ప్రదర్శన సాగింది. ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ, ఎమ్మెల్సీ రియాజుల్లా అసన్ అఫంజీ పాల్గొన్నారు.
మరోవైపు నగర పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెంచారు. అసత్య ప్రచారాలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. విదేశీ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-7లోని ఇరాన్ కాన్సులేట్, రోడ్ నంబర్-2లోని బ్రిటిష్ కార్యాలయం, రోడ్ నంబర్-12లోని యూఏఈ కార్యాలయాల వద్ద భద్రతను సమీక్షించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికా కాన్సులేట్ వద్ద కూడా బందోబస్తు పెంచారు. పశ్చిమాసియా పరిణామాలు తెలంగాణపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. పరిస్థితులను అధికారులు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

