తెలంగాణ ఫార్మా రంగంపై పశ్చిమాసియా యుద్ధ పిడుగు
x

తెలంగాణ ఫార్మా రంగంపై పశ్చిమాసియా యుద్ధ పిడుగు

రాష్ట్రం చేసే ఫార్మా ఎగుమతులు 5.9 బిలియన్ డాలర్లు కాగా ఇది దేశం చేసే 30.5 బిలియన్ డాలర్లలో 19.3 శాతం


పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం తెలంగాణ లోని ఫార్మా రంగంపై పడింది. రాష్ట్రం నుండి సన్ ఫార్మా, డా రెడ్డీస్, లూపిన్, టొరెంట్, దివిస్ లాబ్స్, తాజ్ ఫార్మా లాంటి కంపెనీలు ఈ యుద్ధ వలన ప్రధానంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

2024-25 సంవత్సరంలో తెలంగాణ నుంచి 5.9 బిలియన్ డాలర్ల మందులు ఎగుమతి అయ్యాయి. ఇది దేశం నుండి జరిగిన 30.5 బిలియన్ డాలర్ల ఎగుమతిలో 19.3 శాతం. రాష్ట్రాల వారీగా ఎగుమతుల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండవ స్థానంలో ఉంది.

ఇందులో పశ్చిమాసియాకు జరిగే ఎగుమతి శాతం ఎంత అనే సమాచారం తమ వద్ద ఉండదని ఫార్మెక్సిల్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం ప్రధానంగా ముడి సరుకులు ఎగుమతి చేస్తుందని పెరిగిన ధరలకు అనుగుణంగా కంపెనీల మధ్య సర్దుబాట్లు తప్పవని బల్క్‌ డ్రగ్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (Bulk Drugs Manufacturing Association) వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే ముడిసరుకు ధరలు 10 శాతం పెరిగాయని శోధనా లేబొరేటరీస్ లో పార్టనర్ అయిన నిఖిల్ తోట వెల్లడించారు. త్వరలో మరో పది శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. “మందుల తయారీలో వాడే ద్రావకం ధరలు పెరిగాయి. మేము మా ఉత్పత్తులు ప్రధానంగా స్థానిక కంపెనీలు రెడ్డీస్, ఆరోబిందో, మైలాన్ లకు అమ్ముతాము. మా వ్యాపారంలో 60 శాతం దేశంలో అంతర్గతంగానే జరుగుతుంది. చైనా, బ్రెజిల్, కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి చేస్తాము. పెరుగుతున్న ఈ ముడి సరుకుల ధరలను కంపెనీలకు బదలాయించగలమా లేదా అని చూడాల్సి వుంది. మార్కెట్ లోని పరిస్థితులను బట్టి ఐదు శాతం వరకు మేమే భరించాల్సి రావచ్చు,” అని ఆయన చెప్పారు.

కొన్ని కంపెనీలు అమెరికా, యూరోప్ మార్కెట్ లలో తమ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను వెతుక్కో గలుగుతారని తాజ్ ఫార్మా, సీఈవో, అభిషేక్ సింగ్ అభిప్రాయ పడ్డారు.

ఫార్మెక్సిల్ (Pharmaceuticals Export Promotion Council) డైరెక్టర్ జనరల్ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఫార్మా రంగంపై, దాని ఎగుమతులపై పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇజ్రాయెల్ కు ఎగుమతులు పోయిన ఏడు 60 మిలియన్ డాలర్ల నుండి 40 శాతం పెరిగి 92 మిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఐదు ఏళ్లుగా ప్రతి ఏడు ఈ పెరుగుదల 22 శాతం వరకు ఉంది.

ఈ ఎగుమతుల్లో ప్రధానంగా ఉండేది బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియారీస్, డ్రగ్ ఫార్ములేషన్లు.

దేశం నుంచి జరిగే ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 5.58 శాతం గల్ఫ్ లోని దేశాలకు జరుగుతాయి. పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి దేశం నుంచి 2020-21 లో 1,320.44 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరగ్గా 2024-25 నాటికి అది 1,749.68 మిలియన్ డాలర్స్ కు పెరిగింది. యుఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, యెమెన్ దేశాలు భారత్ చేసే చౌక ధరల మందుల ఎగుమతులపై పడతాయి. ఫార్మెక్సిల్ (Pharmexcil) ఇచ్చిన సమాచారం ప్రకారం జోర్డాన్, కువైట్, లిబియా లకు మన దేశం నుంచి వ్యాక్సిన్లు, ఆపరేషన్ ల కోసం వాడే సామగ్రి, ఆయుష్ మందుల ఎగుమతులు పెరుగుతున్నాయి.

హార్ముజ్ జలసంధిలో (Strait Of Hormuz) రాకపోకలపై ఉన్న ఇబ్బందుల వలన సరుకు రవాణా ఖర్చులు రెండింతలు అయ్యాయి. వీటికి తోడు సర్ ఛార్జీలు ఒక్కో పడవకు 4,000 నుండి 8,000 డాలర్లు పెరిగి కంపెనీల లాభాలపై దాని ప్రభావం పడుతోంది. హర్మూజ్ మాత్రమే కాక ఇతర జల మార్గాలయిన రెడ్ సీ (Red Sea), గల్ఫ్ (Gulf) లోని ఇతర కారిడార్ ల ద్వారా జరిగే రవాణా సాఫీగా జరగక సరుకు రవాణా లో తీవ్రమైన జాప్యం జరగుతోంది. దీని ప్రభావం ఉష్ణోగ్రత మార్పులకు ప్రభావితమయ్యే మందులపై ప్రధానంగా పడనుంది.

క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుదల, మందులకు ముడిసరుకు అయిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్ లను, తయారైన మందులను రవాణా చేయటం, పెరుగుతున్న ఇతర లాజిస్టిక్స్ ఖర్చులు కంపెనీల వద్ద ఉంచుకునే స్టాక్ ల పైన ప్రభావం చూపుతున్నాయి.

ఈ పరిణామాల వలన మార్చి నెలలో ఫార్మా రంగానికి రు. 2,500 నుండి రు. 5,000 కోట్ల మధ్య నష్టం జరగవచ్చని ఫార్మెక్సిల్ అంచనా వేస్తోంది.

Read More
Next Story