16 ఏళ్లు గడిచినా లిక్కర్ స్కామ్‌లో నిందితులపై చర్యలేవి?
x
తెలంగాణలో నాటి మద్యం కుంభకోణంపై చర్యలేవి?

16 ఏళ్లు గడిచినా లిక్కర్ స్కామ్‌లో నిందితులపై చర్యలేవి?

తెలంగాణ 2010 ఎక్సైజ్ కుంభకోణం: వేల కేసులు పెండింగ్‌లోనే


తెలంగాణ రాష్ట్రంలో 2010వ సంవత్సరంలో జరిగిన ఎక్సైజ్ స్కామ్ జరిగి 16 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోలేదు. నాటి మద్యం కుంభకోణంలో నిందితులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ కుంభకోణంపై తెలంగాణ సీఎం జోక్యం చేసుకొని నిందితులపై ఇకనైనా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మంగళవారం కోరింది.

ఇదీ భారీ మద్యం కుంభకోణం

తెలంగాణ రాష్ట్రంలో 2010 సంవ‌త్స‌రంలో భారీ ఆబ్కారీ కుంభ‌కోణం జ‌రిగింది. ఈ కేసు విచార‌ణ‌కు ఒక ప్ర‌త్యేక విచార‌ణ బృందాన్ని (సిట్‌) ఏ.సి.బి.డైరెక్టర్ జనరల్ ఆధ్వ‌ర్యంలో నియ‌మించారు.సిట్‌ విచార‌ణ జ‌రుపుతున్న స‌మ‌యంలో ఈ కేసులో కొంద‌రు మంత్రులు, శాస‌న‌స‌భ్యుల‌ ప్ర‌మేయముంద‌ని వెల్లడైంది. నిరుపేద‌లు కోటి రూపాయిలు డిపాజిట్ క‌ట్టి లిక్క‌ర్ షాపులు ద‌క్కించుకున్నారు. విచార‌ణ‌లో వీరంద‌రూ రాజ‌కీయ నాయ‌కుల బినామీల‌ని తేలింది.సిట్ ద‌ర్యాప్తుతో త‌మ‌పై కేసులు కావ‌చ్చ‌ని రాజ‌కీయ నాయ‌కులు సిట్‌ను మూసివేసి, ఏ.సి.బి. డైరెక్టర్ జనరల్ ను ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. కొత్త‌గా ఛార్జి తీసుకున్న డి.జి. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రాజ‌కీయ‌నాయ‌కుల‌ను త‌ప్పించి కేవ‌లం అధికారులు, బినామీల‌పై కేసులు న‌మోదుచేశారు.

లిక్కర్ స్కామ్ పై హైకోర్టులో పిల్

డెబెరా అనే వ్య‌క్తి 2012 వ సంవత్సరం లో హైకోర్టులో పిల్ వేసి లిక్క‌ర్ స్కామ్ కేసు సి.బి.ఐ. చేత విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు.దీనిపై న్యాయ‌స్థాన‌ం ఒప్పుకోక హైకోర్టు ఆధ్వ‌ర్యంలో విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పింది. ఏ.సి.బి. డైరెక్టర్ జనరల్ విచార‌ణ పూర్తిచేసి 24 అవినీతి కేసులు, 22 బినామీ కేసులు, 2 క్రిమిన‌ల్ కేసులు 1118 మందిపై కేసులు న‌మోదుచేశారు. ఇందులో ఆబ్కారీశాఖ అధికారులు 869, పోలీసులు 247, జి.ఏ.డి 1, కార్మిక‌శాఖ 1 మొత్తం 1118 మందిపై కేసులు నమోదు చేశామ‌ని ఏసీబీ డి.జి. కోర్టుకు తెలిపారు. వీరిని ప్రాసిక్యూట్ చేయ‌డానికి ప్ర‌భుత్వ అనుమ‌తి కూడా తీసుకున్నామ‌ని 2012 లో కోర్టువారికి తెలిపారు.

16 ఏళ్లు గడిచినా పెండిగులోనే కేసులు

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత ఆబ్కారీశాఖ అధికారులు 316మంది పోలీసు అధికారులు, 132 మంది తెలంగాణ‌కు సంబంధించిన అధికారులు ఈ కేసులో ఉన్నారు.కేసు విచార‌ణ మంద‌కొడిగా సాగుతుండ‌డంతో ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ స‌మాచార హ‌క్కు చ‌ట్టం క్రింద స‌మాచారం కావాల‌ని 2020 సంవ‌త్స‌రంలో అడుగ‌గా, చివ‌ర‌కు అయిదేళ్ల తర్వాత 5-2-2026 న జాయింట్ సెక్ర‌ట‌రీ స‌మాచార‌ం ఇచ్చారు. 316 మంది ఆబ్కారీ ఉద్యోగుల్లో ట్రిబ్యున‌ల్‌కు 211 కేసులు, క‌మిష‌న‌ర్ ఫ‌ర్ ఎంక్వైరీకి 75 కేసులు, డిపార్ట్‌మెంట్ ల్ ఎంక్వైరీకి 2 కేసులు పంపించామ‌ని, ఇంత‌వ‌ర‌కు ఏ కేసు కూడా క్లోజ్ కాలేద‌ని తెలిపారు. ఇక 132 మంది పోలీసు అధికారుల‌పై చ‌ర్య‌ల విష‌యంలో ఎటువంటి స‌మాచార‌ం లేదు. గ‌త 16 సంవ‌త్స‌రాలుగా ఈ స్కామ్ కేసులు ఇంకా పెండింగులో ఉన్నాయి.

సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

లిక్కర్ స్కామ్ కేసుల‌న్నింటిలో త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అలాగే ఇటువంటి తీవ్ర నేరాల కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా త‌గిన ఆదేశాలు ఇవ్వాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
Read More
Next Story