తెలంగాణ గురించి ఒడిశా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఏమన్నారు?
x

తెలంగాణ గురించి ఒడిశా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఏమన్నారు?

ఒడిశాలో బీజేడీ, బీజేపీల మధ్య సత్సంబంధాలున్నాయని అజోయ్‌ ఎం‌దుకు అన్నారు? తన పర్యటనలో తెలంగాణ ప్రస్తావన ఎందుకొచ్చింది?


అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీ ఒడిశా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు అజోయ్‌ ‌కుమార్‌ ఆరోపించారు.

ఒడిశాకు కాంగ్రెస్‌ ఇన్‌చార్జీగా నియమితులైన అజోయ్‌ తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించారు. ‘‘ఒడిశా ఫర్‌ ఒడియాస్‌’’ ‌నినాదాన్ని లేవనెత్తిన అజోయ్‌ ‌కుమార్‌.. ఒడియన్ల ప్రాముఖ్యత రోజురోజుకు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బయటి వ్యక్తులు’’ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.

‘‘రూ.35 వేల కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టు పనులు బయటి వ్యక్తులకు కట్టబెట్టారు. ఒడిశాలో కాంట్రాక్టర్‌ ‌లేరా? రాష్ట్రాన్ని బయటి వ్యక్తులే నడిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకు కన్పించడం లేదు’’ అని అజోయ్‌ ‌ప్రశ్నించారు.

రాజకీయ పదవులతో పాటు ముఖ్యమైన ఉద్యోగాలు, మైనింగ్‌ ‌కాంట్రాక్టులు, వ్యాపారాలను రాష్ట్రం వెలుపలి వ్యక్తులు చేపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఒడిశా సొమ్ము అంతా బయటి వ్యక్తులకు వెళుతుంది. అందుకే ఒడిశా పేద రాష్ట్రంగా మిగిలిపోయింది. ఒడియా పరువు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నాయకులు రాజకీయ వ్యవస్థను నడపాలని, ఒడియాలు తమ రాష్ట్రాన్ని నడపాలని’’ సూచించారు.

బిజేడీ బీజేపీతో కలిసి పనిచేస్తోందని ఆరోపించిన అజోయ్‌ ‌రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలకు గాను 15 స్థానాల్లో తమ అభ్యర్థులు ఎన్నికయ్యేలా చూస్తామన్నారు ‘‘ఒడిశాలో సీబీఐ, ఈడీ దాడులు ఏమైనా చూశారా? వివిధ రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తున్న కేంద్ర ఏజెన్సీలు ఒడిశాను మరిచిపోయాయి. బీజేడీ, బీజేపీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఇది రుజువు చేస్తోంది’’ అని విలేకరులతో అన్నారు.

తెలంగాణను ఉదాహరణగా చూపుతూ.. ‘‘తెలంగాణలో మేము 15 ఉప ఎన్నికల్లో ఓడిపోయాం. అయినా, మా పోరాటాన్ని కొనసాగించాం. అక్కడ కాంగ్రెస్‌ ‌మాత్రమే ప్రత్యామ్నాయం గనకనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం’’ అన్నారు.

తన పర్యటన సందర్భంగా అజోయ్‌ ‌రాష్ట్ర పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలపై సమీక్షిస్తున్నారు. అజోయ్‌ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి బిరంచి త్రిపాఠి ఇలా మాట్లాడారు ‘‘ఇతరులపై వేళ్లు చూపించే ముందు, కాంగ్రెస్‌ ‌తన ఎంపీ ధీరజ్‌ ‌సాహు, బీజేడీ మధ్య సంబంధాన్ని స్పష్టం చేయాలి. ధీరజ్‌ ‌సాహు ఒడిశాలో రూ. 350 కోట్ల నగదును అక్రమంగా ఉంచాడు.’’ అజోయ్‌ ‌చేసిన ఆరోపణలపై అధికార బీజేడీ ఇంకా స్పందించలేదు.

Read More
Next Story