ఈ శాటిలైట్ ఆకాశంలో ఏమి చేస్తుంది?
x

ఈ శాటిలైట్ ఆకాశంలో ఏమి చేస్తుంది?

GSLV ఎఫ్‌-14 రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌ 3DS శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపింది ISRO. వాతావరణ పరిస్థితులు, సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుంది.


మరో కీలక ప్రయోగం చేసింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. GSLV ఎఫ్‌-14 రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌ 3DS శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపింది. వాతావరణ పరిస్థితులు తెలపడానికి, సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, ఇతర ఉపగ్రహాల రక్షణ చర్యలకు కూడా ఉపయోగపడనుంది ఈ శాటిలైట్‌. GSLV సిరీస్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజనిక్‌ ఇంజిన్లతో చేస్తున్న ప్రయోగంలో ఇది 16వది కాగా.. షార్‌ నుంచి చేసిన 92వ ప్రయోగం ఇది.

పీఎస్‌ఎల్వీ-58 విజయంతో కొత్తగా ఏడాదిని ఘనంగా ప్రారంభించిన ఇస్రో. మరో ప్రతిష్టాత్మక విజయాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగమే GSLV ఎఫ్-14 రాకెట్ ప్రయోగం. శుక్రవారం మధ్యాహ్నం షార్‌ వేదికగా ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్‌ పూర్తి కాగానే.. శనివారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ ఇన్‌శాట్ 3 డిఎస్ శాటిలైట్‌ను నింగిలోకి తీసుకెళ్లంది.

ఎంత బరువంటే....

మొత్తం 2 వేల 272 కిలోల బరువు కలిగిన ఇన్‌శాట్‌-3DS ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ప్రయోగాన్ని డిజైన్‌ చేశారు. మూడు దశల్లో నిర్మించిన ఈ రాకెట్ 19 నిమిషాల్లోనే నిర్ణీత కక్ష్యలోకి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకున్న 10వ ప్రయోగం ఇది. అయితే.. GSLV సిరీస్‌లో ఇది 16వది కాగా.. షార్‌ కేంద్రం నుంచి జరుగుతున్న 92వ ప్రయోగం ఇది.

GSLV - F 14 రాకెట్ ద్వారా ఇన్‌శాట్‌ 3DS శాటిలైట్‌ను జియో సింక్రోనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. థర్డ్‌ జనరేషన్‌కు చెందిన ఈ ఇన్‌శాట్‌ 3DS ఉపగ్రహానికి మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ ఫండింగ్‌ చేస్తోంది.

వాతావరణ మార్పులపై పరిశోధన....

భూమిపై జరిగే వాతావరణ మార్పులను అంతరిక్షం నుంచి గుర్తించేందుకు ఈ శాటిలైట్‌ ఉపయోగపడుతుంది. 6 ఇమేజ్‌ ఛానల్స్‌, 19 సౌండ్‌ ఛానెల్స్‌తో ఉన్న ఈ శాటిలైట్‌.. క్లైమేట్‌ చేంజ్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను రియల్‌ టైమ్‌లో ఇస్రో కేంద్రానికి చేరవేస్తుంది.

ఇప్పటికే కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఇన్‌శాట్‌ 3D.. ఇన్‌శాట్‌ 3DR శాటిలైట్లకు కొనసాగింపుగా దీన్ని ప్రయోగిస్తున్నారు. భూమి, సముద్రం ఉపరితలాలు పర్యవేక్షించడంతో పాటు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తుంది. భారత వాతావరణ శాఖకు చెందిన అన్ని విభాగాలకు మెరుగైన వాతావరణ సూచనలు అందిస్తుంది. ఇందులో ఉన్న డేటా రిలే ట్రాన్స్‌పాండర్‌ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ ప్రొఫైల్‌ డేటా భూమికి అందజేస్తుంది.

కేవలం వాతావరణ సంబంధిత సమాచారం చేరవేయడమే కాకుండా.. అంతరిక్షంలో ఇతర ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పును తెలియజేయడంతో పాటు.. దానికి అవసరమైన రెస్క్యూ సేవలు కూడా అందిస్తుంది ఈ ఇన్‌శాట్‌ 3DS శాటిలైట్‌.

Read More
Next Story