
అమెరికా మక్కతో తెలంగాణ రైతులకు ఇక్కట్లు తప్పవా?
రైతులు పత్తి పంట నుంచి మక్క వైపు మళ్ళడంతో 174 శాతం పెరుగుదల నమోదైంది. ఈ దశలో అమెరికా మక్కా దాడి చేయ బోతున్నది
అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం తెలంగాణ మక్క రైతులకు మంచిదేనా? ఇటీవలి కాలంలో మక్క పంట విస్తీర్ణం రికార్డు స్థాయికి చేరడంతో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
గత మూడు సంవత్సరాల విస్తీర్ణాన్ని చూస్తే మక్క పంట దాదాపు రెండింతలు పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కోళ్ళ పెంపకం (పౌల్ట్రీ) మరియు ఎథనాల్ పరిశ్రమలో మక్క వినియోగం పెరగడమేనని పరిశీలకులు చెబుతున్నారు. 2025-26 రబీ సీజన్‌లో మక్క విస్తీర్ణం గత సీజన్ లో 7,25,668 ఎకరాల నుంచి ఈ సారి 11,21,494 ఎకరాలకు పెరిగింది. ఇది 174 శాతం పెరుగుదల. ఈ పంట సాధారణ సీజన్ విస్తీర్ణం 6,45,574 ఎకరాలు.
తెలంగాణ వ్యవసాయ డైరెక్టర్ వి. గోపీ రైతులు పత్తి పంట నుంచి మక్క వైపు మళ్లారు. 2023 ఖరీఫ్‌లో పత్తి విస్తీర్ణం గత ఏడాది 50,00,401 ఎకరాల నుంచి 44,77,937 ఎకరాలకు తగ్గింది. ఇది సీజన్ సాధారణ విస్తీర్ణం 50,59,225 ఎకరాల 88 శాతం మాత్రమే. 2024 ఖరీఫ్‌లో అది 43,76,043 ఎకరాలకు పడిపోయింది. 2025 ఖరీఫ్‌లో మళ్లీ 45,94,685 ఎకరాలకు పెరిగింది అని తెలిపారు.
ఇటీవలి సంవత్సరాల్లో మక్క కొనుగోలు పెరగడం వల్ల రైతులు ఈ పంట వైపు మళ్లారని, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఎం.డి. వి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ధరల హెచ్చు తగ్గుల మీద ఆధారపడి పత్తి, మక్క మధ్య రైతులు మార్పులు చేస్తారు. పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులు వేయగల పంటలు వేరుశెనగ లేదా మక్క, అని అల్ ఇండియా కిసాన్ సభ (All India Kisan Sabha) ఉపాధ్యక్షుడు సరంపల్లి మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.
“వేరుశెనగ విత్తనాల ఖర్చు ఎకరానికి రూ. 5–6 వేల వరకు ఉంటుంది. మక్క విత్తనాలు రూ. 500–600 కే దొరుకుతాయి. మక్క పంట 90 రోజుల్లో కోతకువస్తుంది. వర్షంలో తడిసిన మక్కలు కూడా ఎథనాల్ ప్లాంట్లు కొనుగోలు చేస్తాయి. ఎకరానికి సగటున 25 క్వింటాళ్లు దిగుబడి వస్తే పెట్టుబడికి రెట్టింపు లాభం వస్తుంది. మక్క మొక్క పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుంది. వరి పంట ఉత్పత్తి ఖర్చు పెరుగుతోంది. వరి వ్యాధులకు లోనవుతుంది, కానీ మక్కకు అలాంటి సమస్యలు తక్కువ. వ్యవసాయ శాఖ వద్ద స్పష్టమైన కార్యాచరణ లేక వారికి తోచిన పంటలు వేస్తున్నారు. రైతులను మార్కెట్ శక్తుల దయా దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. మక్కలో లాభం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు,” అని మల్లారెడ్డి అన్నారు.
వ్యవసాయం పై విదేశాంగ విధాన ప్రభావం గురించి ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ అమెరికాకు లొంగిపోయారని ఆరోపించారు. భారత ఎగుమతులపై 10 శాతం సుంకం ఉండగా, దిగుమతులపై సున్నా సుంకం ఉందని తెలిపారు. అమెరికా ఉత్పత్తులు ఎక్కువగా దిగుమతి అయితే రైతుల ఉత్పత్తుల ధరలు పడిపోతాయని, రైతులు నష్టపోతారు అని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ వరకు 11 శాతం సుంకం తొలగించడంతో భారత్ 45 లక్షల బేళ్లు పత్తి దిగుమతి చేసుకుందని తెలిపారు.
స్థానిక పత్తి 30 మిమీ పొడవు మాత్రమే ఉందని చెప్పి, అమెరికా నుంచి 34 మిమీ పొడవు పత్తిని దిగుమతి చేస్తున్నారని అన్నారు. “నూలు నేయడానికి పొడవు రకం పత్తి అవసరమని చెబుతున్నారు. మరి మనం ఆ రకం ఎందుకు పండించలేము?” అని మల్లా రెడ్డి ప్రశ్నించారు.
నిపుణుల అభిప్రాయాలు:
అమెరికా పత్తిపై దిగుమతి సుంకం తొలగించడంతో పత్తి 95 శాతం అందుబాటు పెరిగి ఒక బేలుకు రు. 1,500 వరకు ధర తగ్గిందని ఆహార మరియు వాణిజ్య విధాన విశ్లేషకుడు దేవీందర్ శర్మ తెలిపారు. “సుంకాలు మళ్లీ అమల్లోకి వచ్చాయి. కానీ ఇండియా–యూఎస్ ఒప్పందం అమల్లోకి వస్తే ధరలు మళ్లీ పడిపోతాయి. మన పత్తి ఎగుమతుల్లో 70 శాతం బంగ్లాదేశ్‌కు వెళ్తుంది. అక్కడి టెక్స్టైల్ ఉత్పత్తులపై 19 శాతం సుంకం ఉంది. అమెరికా పత్తి వాడితే అది సున్నా అవుతుంది. ఈ మార్కెట్ కోల్పోతే మన పత్తి రైతులకు దెబ్బ పడుతుంది. ఇదే పరిస్థితి మక్కకూ వస్తుంది,” అని అన్నారు.
ఎథనాల్ పరిశ్రమలో డిమాండ్ ఉన్నప్పటికీ, మక్క రైతులకు క్వింటాలుకు రూ. 1,200–1,600 మాత్రమే వస్తోంది. అయితే కనీస మద్దతు ధర (MSP) రూ. 2,400. అమెరికా నుంచి డీడీజీఎస్ (డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రైన్స్ విత్ సొల్యూబుల్స్, dried distillers grains with solubles) రూపంలో వచ్చే మక్క పూర్తిగా జన్యుమార్పిడి (GM) పంట అని తెలిపారు.
మక్క, సోయా ధరలు అమెరికా దిగుమతులతో పడిపోతాయని అలయన్స్ ఫర్ సస్టైనబుల్ & హోలిస్టిక్ అగ్రికల్చర్ (ASHA- కిసాన్ స్వరాజ్ నెట్వర్క్) (Alliance for Sustainable & Holistic Agriculture) స్థాపక సమన్వయకర్త కవితా కురుగంటి కూడా అంగీకరించారు. డీడీజీఎస్ దిగుమతికి అనుమతి ఎందుకు ఇచ్చారో అని ఆమె ఆశ్చర్యపోయారు.
అమెరికా ప్రతి డాలర్ పత్తి ఎగుమతికి 1.5 డాలర్ల సబ్సిడీ ఇస్తోంది. మన రైతు భరోసా పథకం ద్వారా ఉత్పత్తి ఖర్చులో 5 శాతం కూడా ఇవ్వటం లేదు. పత్తికి సరైన ధర రాకపోతే రైతులు మక్క వైపు మళ్ళడం తెలంగాణలో సాధారణమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (Professor Jayashankar Telangana Agricultural University) ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాస్ జనయ్య తెలిపారు. ఎథనాల్, పౌల్ట్రీ పరిశ్రమల డిమాండ్ వల్ల మక్కధర పెరిగిందని, దిగుమతులు పెరిగితే ధరలు పడిపోతాయని అన్నారు.
ఐసీఏఆర్–నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్, రాయ్‌పూర్‌కు చెందిన డా. ఎ. అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, అమెరికా మక్క చవకగా వస్తే పౌల్ట్రీ, ఎథనాల్ పరిశ్రమలు దానిని వాడతాయని, బహిరంగ మార్కెట్లో ధరల మార్పులు రైతులను ప్రభావితం చేస్తాయని చెప్పారు. చైనా దిగుమతులు ఆపడంతో అమెరికాలో అధిక దిగుబడి వస్తే, భారత్‌లోకి డంపింగ్ చేసే అవకాశం ఉందని అన్నారు. యూరప్ జీఎం ఆహారాన్ని అనుమతించకపోవటంతో, అమెరికాకు భారత్ ప్రధాన మార్కెట్ అవుతుందని తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పండే మక్క సరిపోకపోవడంతో పౌల్ట్రీ, ఎథనాల్ పరిశ్రమలు దిగుమతులు కోరాయి. ఎథనాల్ ప్లాంట్లకు కిలో వరి రూ. 22.50 కి సబ్సిడీతో ఇస్తున్నారు. ఎఫ్‌సీఐకి ఒక కిలో వరి సేకరణ, నిల్వకు ఖర్చు రూ. 40 పడుతుంది. బ్యాంకు రుణాలపై వడ్డీ మినహాయింపులతో పరిశ్రమ నడుస్తోంది. ప్లాంట్ యజమానులు వారి పరిశ్రమ మూసివేసినా వారికి పెద్దగా నష్టం ఉండదు. కానీ రైతులు దివాళా తీస్తారు, రిటైర్డ్ శాస్త్రవేత్త డా. కె. బాబు రావు చెప్పారు.
వాణిజ్య వక్రీకరణపై:
మక్క (పాప్‌కార్న్ రకం) కాంట్రాక్ట్ రైతు, ప్రాసెసర్ వేణు ఆకుల 1992 విదేశీ వాణిజ్య అభివృద్ధి & నియంత్రణ చట్టం ప్రకారం ఆహార ధాన్యాల దిగుమతి ఎఫ్‌సీఐ ద్వారా మాత్రమే చేయాలని చెప్పారు. కానీ ప్రభుత్వాలు నోటిఫికేషన్ల జారీతో ఇతరులకు కూడా అనుమతులు ఇస్తున్నాయి. డీజీఎఫ్‌టీ (Director General of Foreign Trade) ఇచ్చిన నోటిఫికేషన్లతో మక్క (పాప్‌కార్న్) సుంకం లేకుండా దిగుమతి అవుతోంది. ఈ మక్కను ఇతర ఉత్పత్తులు తయారీ కోసం తెచ్చుకుని నిబంధనలు ఉల్లంఘించి ముడి రూపంలోనే అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.
కర్ణాటకలో పాప్‌కార్న్ తయారీకి వాడే మక్క పండించే రైతులకు కొనుగోలుదారులు లేరని, గత ఏడాది రూ. 80కి అమ్మిన సరుకు ఇప్పుడు రూ. 30 కూ అమ్ముడవడం లేదని తెలిపారు. కొంతమంది దిగుమతిదారుల ప్రయోజనాల కోసం మార్కెట్‌ను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. “మన దేశంలో అవసరానికి సరిపడా ఉత్పత్తి ఉంది. సరైన ధరలు వస్తే విస్తీర్ణం పెరిగి ఎగుమతులు కూడా చేయగలుగుతాం,” అని అన్నారు.

